సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ఇప్పటివరకున్న ప్రాజెక్టు విధానం స్థానంలో ఇక ఇంటర్న్‌షిప్ విధానం అమల్లోకి రాబోతోంది. విద్యార్థులకు చదువుతోపాటు ప్రాక్టికల్ వర్క్ నేర్పించ డం తద్వారా.. ఉపాధి అవకాశాలు పెంచేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) బీటెక్, డిప్లొమా విద్యార్థుల కోసం కొత్తగా ఇంటర్న్‌షిప్ విధానాన్ని రూపొందించింది. దీంతో విద్యార్థులు వేసవి సెలవుల్లోనూ పూర్తిస్థాయిలో ఇంటర్న్‌షిప్ చేసేందుకు అవకాశం కలిగింది. ఇప్పటివరకు నాలుగేళ్ల బీటెక్‌లో విద్యార్థులు ప్రాజెక్టు వర్క్ చేస్తే సరిపోయేది. ఇక మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులకు 6నెలల ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉండేది. అదీ పెద్దగా అమలయ్యేది కాదు. ఇకపై అలా కుదరదు. బీటెక్‌లో కేవలం ప్రాజెక్టు వర్క్ చేస్తామంటే సరిపోదు. బీటెక్ విద్యార్థులు ప్రథమ సంవత్సరం నుంచే ఇంటర్న్‌షిప్ చేసే విధానాన్ని ఏఐసీటీఈ రూపొందించింది. కోర్సులో భాగంగా ఇంటర్న్‌షిప్‌కు క్రెడిట్స్ పాయింట్లు (మార్కుల స్థానంలో) ఇచ్చేలా చర్యలు చేపట్టింది. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు, ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు రూపొందించిన ఈ విధానాన్ని 2019–20 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది.
ఇంజనీరింగ్‌లో 600–700 గంటలు
ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు ఫుల్‌టైమ్ ఇంటర్న్‌షిప్‌లో వారానికి 40–45 గంటల పాటు ఇంటర్న్‌షిప్, ప్రాజెక్టు వర్క్, సెమినార్ యాక్టివిటీస్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. అలా ప్రతి 40–45 గంటలకు ఒక క్రెడిట్ ఇస్తారు. ఇలా బీటెక్‌లో 14–20 క్రెడిట్స్ ఉంటాయి. అంటే ప్రతి బీటెక్ విద్యార్థి తన నాలుగేళ్ల కోర్సు పూర్తయ్యే నాటికి 600 నుంచి 700 గంటల పాటు ఇంటర్న్‌షిప్, ప్రాజెక్టు వర్క్, సెమినార్ యాక్టివిటీస్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. అలాగే పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులు మూడేళ్లలో 450 నుంచి 500 గంటల పాటు ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుందని, వారికి 10–14 క్రెడిట్స్ ఇస్తారని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. అయితే విద్యార్థులు పార్ట్‌టైం ఇంటర్న్‌షిప్‌తోపాటు ఫుల్‌టైమ్ ఇంటర్న్‌షిప్‌ను చేసుకునేలా వెసలుబాటు కల్పించింది. విద్యాసంవత్సరం మధ్యలో కాకుండా వేసవి సెలవుల్లోనూ ఫుల్‌టైం ఇంటర్న్‌షిప్ చేసుకునేలా సంబంధిత విద్యా సంస్థలు విద్యార్థులకు సదుపాయం కల్పించాలని, సమయాన్ని సర్దుబాటు చేయాలని పేర్కొంది.
ప్రతి కాలేజీలో శిక్షణ, ఉపాధి సెల్
ఇంటర్న్‌షిప్ వ్యవహారాలతోపాటు విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రతి విద్యాసంస్థలో ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్‌ను ఏర్పాటు చేయాలని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. ఇందులో ప్రత్యేకంగా ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్స్ ఆఫీసర్‌ను నియమించాలని వెల్లడించింది. విద్యార్థులు సరైన కెరీర్‌ను ఎంచుకునేలా వారికి ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేయాలని, వారిలో అవగాహన కల్పించాలని వెల్లడించింది. విద్యార్థులు తమకు వచ్చే అనుమానాలను నివృత్తి చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. ఈ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బయోడేటా సిద్ధం చేసుకోవడం నుంచి మొదలుకొని విదేశీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేసింది. అలాగే ఈ–మెయిల్ రైటింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ స్కిల్స్, ఆప్టిట్యూడ్ ట్రైనింగ్ అండ్ ప్రాక్టీస్ టెస్టు, టెక్నికల్ రిపోర్టు రైటింగ్, ప్రజంటేషన్ స్కిల్స్ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వాలని వెల్లడించింది. వాటిన్నింటి నిర్వహణకు ప్రతి విద్యా సంస్థ తమ బడ్జెట్ కచ్చితంగా 1% ని«ధులను ఇందుకోసమే వెచ్చించాలని స్పష్టం చేసింది.
ఉపాధి అవకాశాలు పెరుగుతాయి: కృష్ణారావు
ఈవిధానం అమల్లోకి వస్తే విద్యార్థులకు ఎంతో ఉపయోగమని స్టాన్లీ విద్యా సంస్థల ఛైర్మన్ కృష్ణారావు పేర్కొన్నారు. ఇంటర్న్‌షిప్ విధానం వల్ల విద్యార్థుల పట్ల ఇండస్ట్రీ వర్గాలకు ఓ అవగాహన వస్తుందని, తద్వారా విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వెల్లడించారు. విద్యార్థుల సామర్థ్యాలు ఏంటనేది పారిశ్రామిక వర్గాల వారికి పెద్దగా తెలియదని, ఇకపై మాత్రం 600–700 గంటలు విద్యార్థులు వారివద్దే పని చేస్తారు కనుక సంపూర్ణ అవగాహన వారికి వస్తుందన్నారు. తద్వారా ఎక్కువ మంది విద్యార్థులకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.
ఇదీ అమల్లోకి రానున్న ఇంటర్న్‌షిప్ విధానం
బీటెక్ (వేసవి సెలవుల్లో) డిప్లొమా (వేసవి సెలవుల్లో) బీటెక్ (సమయం) డిప్లొమా (సమయం) బీటెక్ (క్రెడిట్స్) డిప్లొమా (క్రెడిట్స్)
2వ సెమిస్టర్ తరువాత 2వ సెమిస్టర్ తరువాత 3–4వారాలు 3–4 వారాలు 3–4 3–4
4వ సెమిస్టర్ తరువాత 4వ సెమిస్టర్ తరువాత 4–6 వారాలు 4–6 వారాలు 4–6 4–6
6వ సెమిస్టర్ తరువాత 6వ సెమిస్టర్‌లో 4–6 వారాలు 3–4 వారాలు 4–6 3–4
Comments
Please login to add a commentAdd a comment