దేశవ్యాప్తంగా బీటెక్ సీట్లు భారీగా పెంపు
అందుబాటులోకి 14.90 లక్షల ఇంజనీరింగ్ సీట్లు
దక్షిణాది రాష్ట్రాల నుంచే 40 శాతం
3.08 లక్షల సీట్లతో అగ్రస్థానంలో తమిళనాడు
ఆ తర్వాతి స్థానాల్లో ఏపీ, తెలంగాణ
దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ సీట్లు భారీగా పెరిగాయి. 2024–25 విద్యా సంవత్సరంలో బీటెక్ సీట్ల సంఖ్య 14.90 లక్షలకు చేరింది. 2021–22లో దశాబ్దంలోనే కనిష్ట స్థాయికి(12.54 లక్షలకు) పడిపోయిన తర్వాత.. మళ్లీ ఇప్పుడు 18.84 శాతం మేర సీట్లు పెరగడం విశేషం. వాస్తవానికి 2014–15లో దాదాపు 17.05 లక్షల సీట్లు ఉండగా.. ఆ తర్వాత ఏటా తగ్గుదల నమోదయ్యింది.
మళ్లీ తిరిగి 2022–23లో 2 శాతం, 2023–24లో 5 శాతం, ఈ విద్యా సంవత్సరంలో ఏకంగా 10 శాతం(1.40 లక్షలు) మేర సీట్ల సంఖ్య పెరిగింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) గణాంకాల ప్రకారం దేశంలో 2,906 అనుమతి పొందిన యూనివర్సిటీలు, కాలేజీల్లో 14.90 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. కొత్తగా 1,256 కాలేజీల్లో ఇన్‌టేక్ పెంపునకు ఆమోదం పొందాయి.
ఇంజనీరింగ్ సీట్లలో అత్యధికంగా 40 శాతం దక్షిణాదికి చెందిన మూడు రాష్ట్రాల్లోనే ఉండటం విశేషం. దేశంలోనే అత్యధికంగా తమిళనాడులో 3,08,686, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 1,83,532, తెలంగాణలో 1,45,557 సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే తమిళనాడులో 32,856, ఏపీలో 23,518, తెలంగాణలో 20,213 సీట్లు పెరిగాయి. ఈ గణాంకాలు ఇంజనీరింగ్ విద్యలో దక్షిణాది రాష్ట్రాల ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. – సాక్షి, అమరావతి
పరిమితి ఎత్తివేతతో పెరిగిన సీట్లు..
వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఇంజనీరింగ్–టెక్నాలజీ కోర్సులకు ఆమోదంతో పాటు 2023–24లో బీటెక్‌లో కొత్త సీట్లు ప్రవేశపెట్టడంపై పరిమితిని ఏఐసీటీఈ ఎత్తివేసింది. దీంతో సీట్ల సంఖ్య భారీగా పెరిగింది. ఇందులో సూపర్ న్యూమరీ కోటాలో సుమారు 50 వేల సీట్లు కొత్తగా చేరాయి. 400 నుంచి 500 విద్యా సంస్థలు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోర్సులను ప్రారంభించాయి.
2014–15 నుంచి 2021–22 వరకు ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరికలు చాలా వరకు తగ్గాయి. ఫలితంగా అనేక కాలేజీలు మూతపడ్డాయి. 2016–17 విద్యా సంవత్సరంలో 15.56 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా.. 51 శాతం సీట్లు కూడా భర్తీ కాలేదు. అనంతరం మళ్లీ 2021–22లో 71 శాతానికి, 2022–23లో 81 శాతానికి సీట్ల భర్తీ పెరిగింది. దీంతో అడ్మిషన్లు ప్రోత్సాహకరంగా ఉండటంతో సీట్ల గరిష్ట పరిమితిని ఏఐసీటీఈ తొలగించింది.
అవసరమైన మౌలిక సదుపాయాలు, నిపుణులైన అధ్యాపకులు ఉంటే.. వాటిని పరిశీలించి కావాల్సినన్ని సీట్లకు ఏఐసీటీఈ అనుమతులిస్తోంది. ఒక విద్యా సంస్థ సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా 420 సీట్ల వరకు పెంచుకునే వెసులుబాటు తీసుకువచి్చంది.
Comments
Please login to add a commentAdd a comment