సాక్షి, అమరావతి: కాలేజీలతో విద్యావేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు, దాతలను అనుసంధానం చేసేలా అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఉన్నత విద్యలో కూడా ‘విద్యాంజలి’ పేరిట కార్యక్రమాన్ని చేపట్టింది. హయ్యర్ ఎడ్యుకేషన్ వలంటీర్ ప్రోగ్రాం కింద విద్యాశాఖ ఈ ‘విద్యాంజలి’కి శ్రీకారం చుట్టింది. పాఠశాలల అభివృద్ధిలో సామాజిక భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని తాజాగా ఉన్నత విద్యలోనూ అమలుచేసేలా చర్యలు చేపట్టింది. ఉన్నత విద్యా సంస్థలకు విద్యా, శిక్షణ, మౌలిక సదుపాయాలు సమకూరేలా సమాజంలోని ప్రముఖుల సహకారాన్ని పొందడం విద్యాంజలి ప్రధాన ఉద్దేశ్యం.
దీనిద్వారా దేశంలోని నాలుగుకోట్ల మంది ఉన్నత విద్య విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఒక్క దాతలే కాకుండా విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, సాంకేతికరంగ నిపుణులతో పాటు కాలేజీలకు అకడమిక్ సహకారం అందించేందుకు పీజీ, పీహెచ్‌డీ స్థాయి విద్యార్థులు కూడా సేవలందించేలా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నారు. ఆయా రంగాల ప్రముఖులు తాము ఏ రకమైన సేవలను అందించనున్నారో ఆ వివరాలను vidyanjaihe.education.gov.in (విద్యాంజలిహెచ్‌ఈ.ఎడ్యుకేషన్. జీవోవీ. ఐఎన్) పోర్టల్‌లో నమోదుచేయాలి.
ఏ సంస్థలకు ఈ సేవలు అందిస్తారో తెలియజేయవచ్చు. అలాగే.. విద్యా సంస్థలు కూడా తమకు కావాల్సిన సేవలను పోర్టల్ ద్వారా తమ అవసరాన్ని తెలియజేయవచ్చు. ఇలా.. దాతలు, స్వచ్ఛంద సేవకులు, ఇతరులు దాదాపు 27 విద్యా కార్యకలాపాల్లో స్పాన్సర్‌షిప్ సేవలు అందించవచ్చు. మౌలిక సదుపాయాల కల్పన పరంగా దాతలు వివిధ వసతుల నిర్మాణం, విద్యుత్ మౌలిక సదుపాయాలు, బోధన కోసం తరగతి గది పరికరాలు, డిజిటల్ మెటీరియల్ తదితరాలను అందించవచ్చు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల కోసం ఏఐసీటీఈ ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది.
విద్యార్థులకు లబ్ధి చేకూర్చడమే కర్తవ్యం
దాదాపు నాలుగు కోట్ల మంది విద్యార్థులు ఉన్నత విద్య చదువుతున్నారని.. ప్రభుత్వం, సమాజం రెండింటి నుండి వారికి ప్రయోజనం చేకూర్చడమే తమ కర్తవ్యమని అందులో వివరించింది. దాతలు, ఇతరులు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని ‘విద్యాంజలి’లో నమోదు చేసుకోవాలని కోరింది. కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో వారు నేరుగా సంప్రదించవచ్చని తెలిపింది. దాతలు తమ ఆస్తులు, ఇతర సామగ్రిని విరాళంగా ఇవ్వడం ద్వారా సంస్థలకు సహాయం చేయాలని కూడా ఏఐసీటీఈ విజ్ఞప్తి చేసింది. ‘విద్యాంజలి హయ్యర్ ఎడ్యుకేషన్ వలంటీర్ ప్రోగ్రామ్ ద్వారా ఉన్నత విద్యలో కమ్యూనిటీ, ప్రైవేట్, పబ్లిక్ సెక్టార్, ఎన్జీవోలు, ఎన్నారైలు భాగస్వాములు అవుతారు. తద్వారా విద్యార్థులు, అధ్యాపకులు, ఆయా ఉన్నత విద్యా సంస్థలకు స్వచ్ఛందంగా సహకారాన్ని అందించి వాటిని బలోపేతం చేయడమే విద్యాంజలి లక్ష్యం’ అని ఏఐసీటీఈ ఆ ప్రకటనలో పేర్కొంది.
ఉన్నత విద్యకూ ‘విద్యాంజలి’
Published Sat, Jan 22 2022 3:47 AM | Last Updated on Sat, Jan 22 2022 2:42 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment