సాక్షి, అమరావతి: విద్యార్థులు చదువులు ముగించుకోగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేలా వారిలో నైపుణ్యాలు పెంచేందుకు రాష్ట్రంలో అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) కోర్సుల్లో అదనంగా ఒక ఏడాది ఇంటర్న్‌షిప్ (కోర్సు తదనంతర శిక్షణ) ప్రవేశపెట్టనున్నారు. ప్రతి విద్యార్థి తప్పకుండా ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు మూడేళ్ల డిగ్రీ కోర్సులో అదనంగా ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ ఉంటుందని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో చేరేవారికి ఇది వర్తిస్తుందని చెప్పారు. ఇంటర్న్‌షిప్‌తో కలిపి మొత్తం కోర్సును నాలుగేళ్లపాటు అభ్యసించాలని, దీన్ని నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీగా పరిగణిస్తారని తెలిపారు.
ఇంజనీరింగ్‌లో అదనంగా ఏడాది పాటు ఇంటర్న్‌షిప్‌ను ప్రవేశపెట్టడంపై ఇప్పటికే ఏఐసీటీఈ లేఖ రాశామని వెల్లడించారు. ఏఐసీటీఈ నుంచి అనుమతి రాగానే ఇంజనీరింగ్‌లోనూ అదనపు ఇంటర్న్‌షిప్ ప్రారంభమవుతుందన్నారు. మొత్తం కోర్సు కాల వ్యవధి ఐదేళ్లు ఉంటుందన్నారు. ప్రస్తుతం డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సులు అభ్యసిస్తున్న వారు కూడా ఇంటర్న్‌షిప్‌కు వెళ్లేందుకు అవకాశం ఉందన్నారు. కేవలం కోర్సు మాత్రమే పూర్తి చేసి, కళాశాలల నుంచి బయటకు వెళ్తున్న విద్యార్థుల్లో సరైన నైపుణ్యాలు లేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కడం లేదని వివరించారు. అలాంటి పరిస్థితిని మార్చేస్తూ కోర్సులో భాగంగానే వారిలో నైపుణ్యాలు పెంచడానికి అదనంగా ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని పేర్కొన్నారు. తద్వారా చదువులు పూర్తి కాగానే విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందగలుగుతారని తెలిపారు.
ఆన్‌లైన్‌లోనే డిగ్రీ కాలేజల్లో ప్రవేశాలు
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు ఫ్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. మెరిట్, హాజరు ఆధారంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్ మంజూరు చేయనున్నారని పేర్కొన్నారు. ప్రతి కాలేజీకి ‘న్యాక్’, ఎన్‌ఐఆర్‌ఎఫ్ గుర్తింపు తప్పనిసరి అని, ప్రమాణాలు లేని కళాశాలలను మూసివేయడం తప్పదని స్పష్టం చేశారు. అఫిలియేషన్ లేని కాలేజీలకు నోటీసులు ఇచ్చామని, లోపాలు సరిదిద్దుకోకుంటే వాటి అనుమతులు రద్దు చేస్తామన్నారు. హేమచంద్రారెడ్డి ఇంకా ఏం చెప్పారంటే...
- యూజీ కోర్సుల్లో అదనంగా ఒక ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అమల్లోకి వస్తుంది.
- ఇంటర్న్‌షిప్‌పై యూజీసీ, ఏఐసీటీఈకి లేఖలు రాశాం.
- డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తికాగానే విద్యార్థులకు ఎగ్జిట్‌కు అవకాశమివ్వాలా? లేక ఇంటర్న్‌షిప్ కూడా పూర్తి చేశాకనే ఇవ్వాలా? అన్నదానిపై సంప్రదింపులు జరుగుతున్నాయి. విద్యార్థులకు నష్టం లేనిరీతిలో త్వరలో నిర్ణయం ప్రకటిస్తాం.
- డిగ్రీలో ఐదు సెమిస్టర్ల వరకు సంబందిత సబ్జెక్టుల సిలబస్ ఉంటుంది. ఆరో సెమిస్టర్‌లో పూర్తిగా స్కిల్స్ బోధన. తరువాత ఏడాది పాటు సంబంధిత రంగంలోని విభాగాల్లో ఇంటర్న్‌షిప్.
- పారామెడికల్, లా, టీచింగ్, చార్టెడ్ అకౌంటెంట్, క్లరికల్, ఇండస్ట్రియల్.. ఇలా కోర్సును అనుసరించి ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
- ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌కు పంపిస్తారు. ఇది ప్రతి ఏటా కొనసాగుతుంది కనుక ఆయా సంస్థలకు మానవ వనరులు అందుబాటులో ఉండి మేలు జరుగుతుంది.
- స్కిల్ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల్లోనూ విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఉంటుంది.
- ఇంటర్న్‌షిప్‌కు సంబంధించి స్కిల్ సిలబస్ రూపొందిస్తున్నారు. అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
- స్కిల్ సబ్జెక్టు బోధనలో అధ్యాపకుల పనితీరును అసెస్‌మెంట్ చేస్తారు.
- యూనివర్సిటీల్లో డేటాబేస్ సెంటర్ల ఏర్పాటు.
- ప్రతిఏటా 3.20 లక్షల మంది ఇంటర్మీడియెట్ పూర్తిచేసి బయటకు వస్తున్నారు. కానీ.. డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మా తదితర ఉన్నత విద్యాకోర్సుల్లో 6 లక్షల సీట్లు ఉంటున్నాయి.
- డిగ్రీలో 1.40 లక్షల మంది చేరుతుండగా, ఫైనల్ ఇయర్ పరీక్షలను 60 శాతం మందే రాస్తున్నారు. దీన్ని సరిదిద్దాలని ప్రొఫెసర్ బాలకృష్ణన్ నేతృత్వంలోని సంస్కరణల కమిటీ సూచించింది.
- 25 శాతం కన్నా తక్కువ మంది ఉన్న కాలేజీలను మూసివేయాలని సిఫార్సు చేసింది. విద్యార్థులకు నష్టం కలగకుండా వేరే చోట చేర్పించాలని సూచించింది.
- నూతన విద్యావిధానం ప్రకారం ప్రతి కాలేజీకి అక్రెడిటేషన్ తప్పనిసరిగా ఉండాలి. లేనిపక్షంలో అఫిలియేషన్ రాదు.
- అన్ని కాలేజీలు న్యాక్, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ పొందేలా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తాం. దీనికోసం ఉన్నత విద్యామండలిలో క్వాలిటీ అసెస్‌మెంట్ సెల్ ఏర్పాటు చేస్తాం.
- కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన గురజాడ యూనివర్సిటీ, ప్రకాశం వర్సిటీలను ఓపెన్ యూనివర్సిటీ, టీచింగ్ యూనివర్సిటీలుగా చేయాలన్న బాలకృష్ణన్ కమిటీ సూచనపై సంప్రదింపులు జరుపుతున్నాం.
ఉద్యోగ విద్య
Published Thu, Jan 2 2020 3:48 AM | Last Updated on Thu, Jan 2 2020 4:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment