కొత్త కోర్సుల్లో 10,000 సీట్లు! | AICTE Allowed 15690 Seats In New Courses | Sakshi
Sakshi News home page

కొత్త కోర్సుల్లో 10,000 సీట్లు!

Published Fri, Oct 2 2020 2:19 AM | Last Updated on Fri, Oct 2 2020 2:19 AM

AICTE Allowed 15690 Seats In New Courses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఈసారి కొత్త కోర్సుల్లో 10 వేల వరకు సీట్లకు అనుమతులు వచ్చే అవకాశముంది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కొత్త కోర్సుల్లో 15,690 సీట్లకు అనుమతులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం, యూనివర్సిటీలు 10 వేల వరకు సీట్లకే అనుబంధ గుర్తింపునిచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, కంప్యూటర్‌ సైన్స్‌ నెట్‌వర్క్స్, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ వంటి కోర్సులను 2020–21 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్రంలోని 100కు పైగా కాలేజీలు ఏఐసీటీఈకి దరఖాస్తు చేసుకున్నాయి.

దీంతో ఏఐసీటీఈ పాత కోర్సులతో పాటు కొత్త కోర్సుల్లో 15,690 సీట్లకు అనుమతులు ఇచ్చింది. ఇక రాష్ట్రంలో అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు యూనివర్సిటీలు కసరత్తు ప్రారంభించాయి. కరోనా కారణంగా ఇంతవరకు ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీల (ఎఫ్‌ఎఫ్‌సీ) ఆధ్వర్యంలో కాలేజీల్లో ఫ్యాకల్టీ, వసతులు, తదితర అంశాలపై ఎలాంటి తనిఖీలు చేపట్టలేదు. ఇకపై చేపట్టే అవకాశం లేదు. గతేడాది చేసిన తనిఖీల ఆధారంగా ఫ్యాకల్టీ, వసతులపై ఓ అంచనాకు రావడంతో పాటు, కాలేజీలు ఇచ్చే అఫిడవిట్‌ ఆధారంగా అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.  

10 వేల సీట్ల వరకే..  
కొత్త కోర్సుల ప్రారంభానికి సంబంధించిన ఆమోదం కోసం యూనివర్సిటీలు ప్రభుత్వానికి లేఖలు రాశాయి. దీంతో ప్రభుత్వం వాటిపైనా కసరత్తు ప్రారంభించింది. వచ్చే వారంలో అనుమతులు ఇచ్చే అవకాశముంది. ఏఐసీటీఈ కొత్త కోర్సుల్లో అనుమతినిచ్చిన 15,690 సీట్లకు యథాతథంగా అనుమతులు ఇవ్వకుండా, కాలేజీల స్థాయి, వసతులు, గత మూడేళ్లలో కాలేజీల్లో పరిస్థితులను బట్టి 10 వేల వరకు సీట్లకే అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి 5 వేలకు పైగా సీట్లకు కోత పెట్టి ఈ ప్రక్రియను వచ్చే వారంలో పూర్తి చేసే అవకాశముంది.

ఆ వెంటనే కాలేజీలకు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపును జారీ చేసేందుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాయి. ఈనెల 6వ తేదీన ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ ఫలితాలను విడుదల చేసేందుకు ప్రవేశాల కమిటీ కసరత్తు ప్రారంభించింది. ఫలితాలు వెలువడిన తర్వాత 10వ తేదీలోగానే ప్రవేశాల నోటిఫికేషన్‌ను జారీ చేసి, 10 నుంచి 12వ తేదీల మధ్య ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించేందుకు సాంకేతిక విద్యాశాఖ సిద్ధమవుతోంది.  

ఈసారి ఎన్ని సీట్లకు అనుబంధ గుర్తింపు..? 
రాష్ట్రంలోని 201 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బీటెక్‌ కోర్సులో 1,10,873 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుబంధ గుర్తింపును జారీ చేసింది. అందులో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి కొత్త కోర్సులు కూడా ఉన్నాయి. అయితే ప్రతి ఏటా ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన కాలేజీల్లోని అన్ని కాలేజీలకు, సీట్లకు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇవ్వడం లేదు.

చాలావరకు కోత పెడుతున్నాయి. 2019–20 విద్యా సంవత్సరంలో 216 కాలేజీల్లో 1,11,790 సీట్లకు ఏఐసీటీఈ అనుమతి ఇవ్వగా, యూనివర్సిటీలు 187 కాలేజీల్లో 93,790 సీట్లకు మాత్రమే అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. అంటే దాదాపు 14 వేల వరకు సీట్లకు కోత పెట్టాయి. ఇక ఈసారి ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన కాలేజీలు, సీట్లలో యూనివర్సిటీలు ఎన్నింటికి అనుబంధ గుర్తింపు ఇస్తాయి.. ఎన్నింటికి కోత పెడతాయన్నది వచ్చే వారంలో తేలనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement