New course
-
తెలుగు వర్సిటీలో 20 కొత్త కోర్సులు
నాంపల్లి: తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు తెలుగు విశ్వవిద్యాలయం 2019 సాహితీ పురస్కారాలను అందజేసింది. గురువారం తెలుగు వర్సిటీలోని నందమూరి తారక రామారావు కళా మందిరంలో ఏర్పాటు చేసిన పురస్కార ప్రధాన సభలో పది మంది ఉత్తమ గ్రంథ రచయితలకు రూ.20,116 నగదు పారితోషికంతో సత్కరించింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వర్శిటీ ఉపాధ్యక్షులు ఆచార్య తంగెడ కిషన్ రావు మాట్లాడుతూ... తెలుగు సాహిత్య సేవకు అంకితమైన నిరాడంబర రచయితలకు 2019 సాహితీ పురస్కారాలను అందించడానికి విశ్వవిద్యాలయం ఎంతో గర్వపడుతోందన్నారు. అందుకు సహకరించిన పురస్కారాల నిర్ణాయక సంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వర్సిటీలో ఈ విద్యా సంవత్సరంలో 20 కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అలాగే వచ్చే రెండు మాసాల్లో తెలుగు విశ్వవిద్యాలయాన్ని బాచుపల్లి ప్రాంగణానికి తరలించడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధ్యక్షులు ఆచార్య ఆర్.లింబాద్రి మాట్లాడుతూ... సామాజిక మనుగడకు ఆయా ప్రాంతాల సాహిత్య, సంస్కృతి ప్రధాన భూమిక వహిస్తుందని, ఆ దిశగా తెలుగు విశ్వవిద్యాలయం సామాజిక బాధ్యతతో సాహిత్యాన్ని, సంస్కృతిని కాపాడుతున్నందుకు అభినందనలు తెలియజేశారు. -
మొట్టమొదటిసారిగా.. యూఎస్‌లో పోర్నోగ్రఫీపై కోర్సు
వాషింగ్టన్: అమెరికాలోని ఓ కాలేజీ మొట్టమొదటిసారిగా పోర్నోగ్రఫీపై కోర్సును ప్రవేశపెట్టింది. 2022–23 విద్యాసంవత్సరంలో ఈ కోర్సు ఉంటుందని ఉటాలోని వెస్ట్‌మినిస్టర్ కాలేజీ ప్రకటించింది. లైంగికావయవాలను గురించి, వివిధ రకాల లైంగిక చర్యల గురించి కోర్సులో బోధిస్తామని తెలిపింది. కోర్సులో భాగంగా లెక్చరర్లు, విద్యార్థులు తరగతి గదిలోనే కలిసి కూర్చుని పోర్న్ సినిమాలను తిలకిస్తూ స్త్రీ, పురుష లైంగిక సంబంధాలపై జాతి, వర్గం, లింగ విభేదాల ప్రభావం గురించి చర్చలు జరుపుతారని తన వెబ్సైట్లో పేర్కొంది. సామాజిక అంశాలను విశ్లేషించేందుకు, వివాదాస్పద అంశాలపై లోతుగా అధ్యయనం చేసేందుకు ఇది ఒక అవకాశమని తెలిపింది. అయితే, విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతిలో అశ్లీల చిత్రాలను కలిసి చూడటం చాలా అసహ్యకరమైన వ్యవహారమంటూ కళాశాల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
మార్పుకు తగ్గట్టు.. ఉపాధి పెరిగేట్టు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ తర్వాత మారిన మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎంట్రపెన్యూర్ లిటరసీ అనే కొత్త కోర్సుతో పాటు, బిజినెస్ లిటరసీ, బిహేవియరల్ స్కిల్స్, డిజిటల్ లిటరసీ వంటి కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలోని ఔత్సాహికులు, విద్యార్థులకు ఈ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఐఎస్బీ, తెలంగాణ సాంకేతిక విద్యామండలి మధ్య శుక్రవారం అవగాహన ఒప్పందం జరిగింది. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ల సమక్షంలో ఐఎస్బీ డీన్ ప్రొఫెసర్ మదన్న్పిల్లుట్ల, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్‌మిట్టల్‌లు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా నాలుగు కోర్సులను నిర్వహించనున్నారు. ఈ కోర్సులో చేరిన విద్యార్థులకు ఐఎస్బీ, సాంకేతిక విద్యామండలి సంయుక్తంగా సర్టిఫికెట్లను జారీచేస్తాయి. ‘‘కేవలం 40 గంటల వ్యవధి గల ఈ కోర్సులను పూర్తిగా ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. సొంతంగా సంస్థలను స్థాపించుకునే నైపుణ్యం ఈ కోర్సుల వల్ల వీలుపడుతుంది. కోర్సు పూర్తికాగానే సర్టిఫికెట్ జారీచేస్తాం. ఐఎస్బీ నిర్వహిస్తున్న కోర్సు కాబట్టి, మార్కెట్లో మంచి విలువ, డిమాండ్ ఉంటుంది. కంపెనీలు, పరిశ్రమల తక్షణ అవసరాలను తీర్చగల ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చైన్ వంటి కోర్సులను డిజిటల్ లిటరసీ కోర్సు ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చాం.’’ అని నవీన్ మిట్టల్ అన్నారు. ఫిబ్రవరి నుంచి కోర్సులు ప్రారంభం వచ్చే ఫిబ్రవరి నుంచి ఇవి ప్రారంభమవుతాయి. తాజా ఎంఓయూ ద్వారా 50వేల నుంచి 2లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం. కోర్సు మధ్యలో అసెస్మెంట్ ఉంటుంది. దాని ఆధారం గానే సర్టిఫికెట్లు జారీచేస్తాం. ఫీజులు సైతం తక్కువగానే ఉంటాయి. ఐఎస్బీకున్న బ్రాండ్‌ను బట్టి ఈ సర్టిఫికెట్లను ఉద్యోగావకాశాల కోసం వినియోగించుకోవచ్చు. – దీపామణి, డిప్యూటీ డీన్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ -
టిపుల్ఐటీ హైదరాబాద్‌లో కొత్త కోర్సు ప్రారంభం
రాయదుర్గం(హైదరాబాద్): ట్రిపుల్ఐటీ హైదరాబాద్ ఓ కొత్త కోర్సుకు శ్రీకారం చుట్టింది. రెండేళ్ల కాలపరిమితితో కూడిన ప్రొడక్ట్ డిజైన్ అండ్ మేనేజ్మెంట్(పీడీఎం)లో ఎంటెక్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. టెక్నాలజీ, ప్రొడక్ట్స్, డిజైన్, ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో అభ్యర్థులు అవగాహన సాధించేలా ఈ కోర్సును రూపొందించా రు. ప్రారంభ కెరీర్లో ఉన్న ఐటీ గ్రాడ్యుయే ట్లు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ మెరుగైన అనుభవాన్ని సాధించేందుకు, కొత్త ఉత్పత్తులు, కొత్త స్టార్టప్‌లు ప్రారంభించేలా అభ్యర్థులను సన్నద్ధులను చేయడంలో ఈ కోర్సు దోహదపడుతుంది. ఈ కోర్సు ఐటీసీ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టితో సాంకేతికత, డిజైన్, నిర్వహణ అం శా ల్లో సమతుల్యత కలిగి ఉందని పీడీఎం ప్రోగ్రా మ్ హెడ్ ప్రొ. రఘురెడ్డి తెలిపారు. శీతా కాల ప్రవేశాల్లో భాగంగా ఈ కోర్సులో చేరడానికి నవంబర్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. -
భవిష్యత్ సవాళ్లకు సన్నద్ధం కావాలి!
న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటున్న కరోనా వైరస్ విసరనున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదన్నారు. ఈ మహమ్మారి ఎంత ప్రమాదకర సవాళ్లను విసరగలదన్నది రెండో వేవ్ ద్వారా అర్థమైందన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు లక్షకు పైగా కోవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్లు నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఉద్దేశించిన స్వల్పకాలిక కోర్సును శుక్రవారం ప్రధాని ప్రారంభించారు. భవిష్యత్‌లో కరోనాతో రానున్న సవాళ్లను ఎదుర్కొనే సంసిద్ధతను పెంచుకునే దిశగా ఈ కోర్సు రూపొందిందని ప్రధాని తెలిపారు. జూన్ 21 నుంచి దేశంలో 18 ఏళ్ల వయస్సు పైబడిన అందరికీ ఉచితంగా టీకా ఇవ్వడానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. రెండో వేవ్ సమయంలో మెడికల్ ఆక్సిజన్ లభ్యత విషయంలో ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని, త్వరలో దాదాపు ప్రతి జిల్లాలో మెడికల్ ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా, యుద్ధ ప్రాతిపదికన 1,500 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని వెల్లడించారు. ఫ్రంట్‌లైన్ వారియర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్వల్పకాలిక కోర్సు వివరాలను వెల్లడిస్తూ.. హోం కేర్ సపోర్ట్, బేసిక్ కేర్ సపోర్ట్, అడ్వాన్స్డ్ కేర్ సపోర్ట్, ఎమర్జెన్సీ కేర్ సపోర్ట్, శాంపిల్ కలెక్షన్ సపోర్ట్, మెడకల్ ఎక్విప్మెంట్ సపోర్ట్.. అనే 6 కీలక విధుల్లోని వారియర్లకు ఉపయోగపడేలా దీనిని రూపొందించారని తెలిపారు. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లోని 111 సెంటర్లలో ఈ కోర్సును ప్రారంభించారు. నైపుణ్యాలను పరిస్థితులకు అనుగుణంగా మెరుగుపర్చుకోవాల్సిన అవసరాన్ని కరోనా మనకు తెలియజేసిందని ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0లో భాగంగా రూ. 276 కోట్లతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఆరోగ్య రంగంలో మానవ వనరుల ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను తీర్చేలా ఈ కోర్సు రూపొందిందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, సమాజాలు, వ్యవస్థలు, కుటుంబాలు, వ్యక్తుల శక్తి సామర్థ్యాలను కరోనా సవాలు చేసిందని ప్రధాని పేర్కొన్నారు. అదే సమయంలో నైపుణ్యాల పెంపు అవసరాన్ని గుర్తు చేసిందన్నారు. ఆరోగ్య రంగానికి, ఫ్రంట్‌లైన్ యోధులకు రెండు నుంచి మూడు నెలల వ్యవధిలో నేర్చుకోగల ఈ కోర్సు కొత్త జవజీవాలను ఇస్తుందన్నారు. అలాగే, యువతకు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుందన్నారు. భారత్‌లో వైద్యనిపుణుల అవసరం చాలా ఉందని, జనాభాతో పోలిస్తే వైద్యులు, నర్సులు, పారామెడిక్స్ సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపారు. అందువల్ల ఏడేళ్లలో కొత్తగా ఎయిమ్స్‌ను, మెడికల్ కాలేజీలను, నర్సింగ్ కళాశాలలను పెంచేందుకు చర్యలు తీసుకున్నామని మోదీ తెలిపారు. అలాగే, వైద్య విద్యలో సంస్కరణలను తీసుకువచ్చామన్నారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎమ్, అంగన్వాడీ కార్యకర్తలను ప్రధాని ప్రశంసించారు. -
కొత్త కోర్సుల్లో 10,000 సీట్లు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి కొత్త కోర్సుల్లో 10 వేల వరకు సీట్లకు అనుమతులు వచ్చే అవకాశముంది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కొత్త కోర్సుల్లో 15,690 సీట్లకు అనుమతులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం, యూనివర్సిటీలు 10 వేల వరకు సీట్లకే అనుబంధ గుర్తింపునిచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కంప్యూటర్ సైన్స్ నెట్వర్క్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి కోర్సులను 2020–21 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్రంలోని 100కు పైగా కాలేజీలు ఏఐసీటీఈకి దరఖాస్తు చేసుకున్నాయి. దీంతో ఏఐసీటీఈ పాత కోర్సులతో పాటు కొత్త కోర్సుల్లో 15,690 సీట్లకు అనుమతులు ఇచ్చింది. ఇక రాష్ట్రంలో అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు యూనివర్సిటీలు కసరత్తు ప్రారంభించాయి. కరోనా కారణంగా ఇంతవరకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల (ఎఫ్ఎఫ్సీ) ఆధ్వర్యంలో కాలేజీల్లో ఫ్యాకల్టీ, వసతులు, తదితర అంశాలపై ఎలాంటి తనిఖీలు చేపట్టలేదు. ఇకపై చేపట్టే అవకాశం లేదు. గతేడాది చేసిన తనిఖీల ఆధారంగా ఫ్యాకల్టీ, వసతులపై ఓ అంచనాకు రావడంతో పాటు, కాలేజీలు ఇచ్చే అఫిడవిట్ ఆధారంగా అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. 10 వేల సీట్ల వరకే.. కొత్త కోర్సుల ప్రారంభానికి సంబంధించిన ఆమోదం కోసం యూనివర్సిటీలు ప్రభుత్వానికి లేఖలు రాశాయి. దీంతో ప్రభుత్వం వాటిపైనా కసరత్తు ప్రారంభించింది. వచ్చే వారంలో అనుమతులు ఇచ్చే అవకాశముంది. ఏఐసీటీఈ కొత్త కోర్సుల్లో అనుమతినిచ్చిన 15,690 సీట్లకు యథాతథంగా అనుమతులు ఇవ్వకుండా, కాలేజీల స్థాయి, వసతులు, గత మూడేళ్లలో కాలేజీల్లో పరిస్థితులను బట్టి 10 వేల వరకు సీట్లకే అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి 5 వేలకు పైగా సీట్లకు కోత పెట్టి ఈ ప్రక్రియను వచ్చే వారంలో పూర్తి చేసే అవకాశముంది. ఆ వెంటనే కాలేజీలకు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపును జారీ చేసేందుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాయి. ఈనెల 6వ తేదీన ఇంజనీరింగ్ ఎంసెట్ ఫలితాలను విడుదల చేసేందుకు ప్రవేశాల కమిటీ కసరత్తు ప్రారంభించింది. ఫలితాలు వెలువడిన తర్వాత 10వ తేదీలోగానే ప్రవేశాల నోటిఫికేషన్‌ను జారీ చేసి, 10 నుంచి 12వ తేదీల మధ్య ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించేందుకు సాంకేతిక విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఈసారి ఎన్ని సీట్లకు అనుబంధ గుర్తింపు..? రాష్ట్రంలోని 201 ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ కోర్సులో 1,10,873 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుబంధ గుర్తింపును జారీ చేసింది. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి కొత్త కోర్సులు కూడా ఉన్నాయి. అయితే ప్రతి ఏటా ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన కాలేజీల్లోని అన్ని కాలేజీలకు, సీట్లకు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇవ్వడం లేదు. చాలావరకు కోత పెడుతున్నాయి. 2019–20 విద్యా సంవత్సరంలో 216 కాలేజీల్లో 1,11,790 సీట్లకు ఏఐసీటీఈ అనుమతి ఇవ్వగా, యూనివర్సిటీలు 187 కాలేజీల్లో 93,790 సీట్లకు మాత్రమే అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. అంటే దాదాపు 14 వేల వరకు సీట్లకు కోత పెట్టాయి. ఇక ఈసారి ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన కాలేజీలు, సీట్లలో యూనివర్సిటీలు ఎన్నింటికి అనుబంధ గుర్తింపు ఇస్తాయి.. ఎన్నింటికి కోత పెడతాయన్నది వచ్చే వారంలో తేలనుంది. -
కొత్త కోర్సుల్లో 15,690 సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 201 ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ కోర్సులో 1,10,873 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుబంధ గుర్తింపును జారీ చేసింది. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి కొత్త కోర్సుల్లో 15,690 సీట్లకు అనుమతులను జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డాటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కంప్యూటర్ సైన్స్ నెట్వర్క్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి కోర్సులను 2020–21 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టేందుకు ఏఐసీటీ విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇందులో భాగంగా ఆయా కోర్సులను ప్రవేశపెట్టేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో రాష్ట్రంలోని 100కు పైగా కాలేజీలు కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. ఆయా కోర్సుల్లో 15,690 సీట్లకు ఏఐసీటీఈ ఓకే చెప్పింది. వీటితోపాటు కంప్యూటర్ సైన్స్‌లో 23,040 సీట్లు, ఈసీఈలో 18,495 సీట్లకు, ఈఈఈలో 8,430 సీట్లు, ఇతర కోర్సుల్లో మిగతా సీట్లకు అనుమతి ఇచ్చింది. ఈసారి అనుబంధ గుర్తింపు లభించేదెన్నింటికో.. రాష్ట్రంలో ప్రతి ఏటా ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన కాలేజీల్లోని అన్ని కాలేజీలకు, సీట్లకు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇవ్వడం లేదు. చాలా వరకు కోత పెడుతున్నాయి. 2019–20 విద్యా సంవత్సరంలో 216 కాలేజీల్లో 1,11,790 సీట్లకు ఏఐసీటీఈ అనుమతి ఇవ్వగా, యూనివర్సిటీలు 187 కాలేజీల్లో 93,790 సీట్లకు మాత్రమే అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. అంటే దాదాపు 14 వేల వరకు సీట్లకు కోత పెట్టాయి. ఈసారి కూడా ఏఐసీటీఈ రాష్ట్రంలోని 201 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,10,873 సీట్లకు అనుమతి ఇచ్చింది. అయితే యూనివర్సిటీలు అందులో ఎన్ని సీట్ల భర్తీకి అనుబంధ గుర్తింపు ఇస్తాయో వేచి చూడాల్సిందే. అయితే ఇందులో కొత్త కోర్సుల కోసం దరఖాస్తు చేసుకున్న సీట్లే 15,690 ఉన్నాయి. ఇపుడు వాటన్నింటికి అనుబంధ గుర్తింపును ఇస్తాయా? కాలేజీల స్థాయిని బట్టి, వసతులను బట్టి కోత పెడతాయా? అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు ఈసారి చాలా కాలేజీలు తమ కాలేజీల్లో పాత కోర్సులను, బ్రాంచీలను, సీట్లను రద్దు చేసుకొని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త కోర్సులకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇలా దాదాపు 8 వేల సీట్లను రద్దు చేసుకున్నాయి. అలా రద్దు చేసుకున్న సీట్ల సంఖ్యతో పాటు అదనంగా సీట్లకు కూడా దరఖాస్తు చేసుకున్నాయి. అయితే అందులో యూనివర్సిటీలు ఎన్ని కాలేజీల్లో, ఎన్ని సీట్లకు అనుమతి ఇస్తాయి? ఎన్నింటికి కోత పెడతాయన్నది ఈ నెలాఖరుకు లేదా వచ్చే నెలలో తేలనుంది. -
న్యూ కోర్స్
గాంధీనగర్, కాన్పూర్లలో కాగ్నిటివ్ సైన్స్ వ్యక్తుల మానసిక పరిస్థితిని అంచనా వేయడంలో నైపుణ్యం అందించే శాస్త్రం కాగ్నిటివ్ సైన్స్. దీని ఆధారంగా వ్యక్తుల సామర్థ్య స్థాయి, పనితీరు విషయంలో అనుసరించే విధానాలను తెలుసుకునే సౌలభ్యం లభిస్తుంది. కాగ్నిటివ్ సైన్స్ అన్ని రంగాల్లోనూ ఆవశ్యకంగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దేశంలో తొలిసారిగా 2013-14 నుంచి ఐఐటీ-గాంధీనగర్ కాగ్నిటివ్ సైన్స్‌లో పీజీ కోర్సుకు రూపకల్పన చేసింది. తాజాగా ఐఐటీ కాన్పూర్ కాగ్నిటివ్ సైన్స్‌లో పీజీ, డాక్టోరల్ ప్రోగ్రామ్‌లను ఈ విద్యా సంవత్సరం నుంచి అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. -
న్యూ కోర్సు
బిజినెస్ అనలిటిక్స్ కోర్సు ఐఐఎం-కోల్‌కతా, ఐఐటీ-ఖరగ్‌పూర్, ఐఎస్ఐ-కోల్‌కతా సంయుక్తంగా పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ అనలిటిక్స్ కోర్సును ప్రారంభించాయి. పీజీడీబీఏ పేరుతో పిలిచే ఈ కోర్సుకు రెండేళ్ల వ్యవధి ఉంటుంది. బిజినెస్ అనలిటిక్స్‌కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ కోర్సుకు రూపకల్పన చేశారు. 10+2+4 విధానంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి, క్యాట్, జీమ్యాట్, జీఆర్ఈ, గేట్లలో ఏదో ఒక స్కోర్ కలిగి ఉన్నవారు ప్రవేశాలకు అర్హులు. వెబ్సైట్: www.iimcal.ac.in -
అంబేడ్కర్ వర్సిటీలో కొత్త పీజీ కోర్సు
హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎంఏ మాస్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కోర్సు కొత్తగా అందుబాటులోకి వచ్చింది. ఈ రంగంలో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉండడంతో ఈ కోర్సును తీసుకొచ్చారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు అవకాశం కల్పించారు. ఇంగ్లిష్ మీడియంలో ఉన్న ఈ కోర్సుకు ఏదేని డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 8 గడువుగా నిర్ణయించారు. మరిన్ని వివరాలు వర్సిటీ వెబ్సైట్లో చూడవచ్చు. -
తయారీ రంగంపై ఏడాది కోర్సు: ఐఎస్బీ
న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) కొత్త కోర్సును ప్రారంభిస్తోంది. తయారీ, వ్యాపార వ్యవహారాల నిర్వహణపై ఒక ఏడాది కాల పరిమితి గల ప్రోగ్రామ్‌ను మే నుంచి మొదలు పెడుతోంది. తయారీ రంగంలో అంతర్జాతీయంగా ఉన్న అవకాశాలు తెలుసుకునేందుకు వృత్తి నిపుణులకు దోహదం చేస్తుందని ఐఎస్బీ డిప్యూటీ డీన్ ప్రదీప్ సింగ్ తెలిపారు.