న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటున్న కరోనా వైరస్ విసరనున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదన్నారు. ఈ మహమ్మారి ఎంత ప్రమాదకర సవాళ్లను విసరగలదన్నది రెండో వేవ్ ద్వారా అర్థమైందన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు లక్షకు పైగా కోవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్లు నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఉద్దేశించిన స్వల్పకాలిక కోర్సును శుక్రవారం ప్రధాని ప్రారంభించారు.
భవిష్యత్‌లో కరోనాతో రానున్న సవాళ్లను ఎదుర్కొనే సంసిద్ధతను పెంచుకునే దిశగా ఈ కోర్సు రూపొందిందని ప్రధాని తెలిపారు. జూన్ 21 నుంచి దేశంలో 18 ఏళ్ల వయస్సు పైబడిన అందరికీ ఉచితంగా టీకా ఇవ్వడానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. రెండో వేవ్ సమయంలో మెడికల్ ఆక్సిజన్ లభ్యత విషయంలో ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని, త్వరలో దాదాపు ప్రతి జిల్లాలో మెడికల్ ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా, యుద్ధ ప్రాతిపదికన 1,500 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని వెల్లడించారు.
ఫ్రంట్‌లైన్ వారియర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్వల్పకాలిక కోర్సు వివరాలను వెల్లడిస్తూ.. హోం కేర్ సపోర్ట్, బేసిక్ కేర్ సపోర్ట్, అడ్వాన్స్‌డ్ కేర్ సపోర్ట్, ఎమర్జెన్సీ కేర్ సపోర్ట్, శాంపిల్ కలెక్షన్ సపోర్ట్, మెడకల్ ఎక్విప్‌మెంట్ సపోర్ట్.. అనే 6 కీలక విధుల్లోని వారియర్లకు ఉపయోగపడేలా దీనిని రూపొందించారని తెలిపారు. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లోని 111 సెంటర్లలో ఈ కోర్సును ప్రారంభించారు. నైపుణ్యాలను పరిస్థితులకు అనుగుణంగా మెరుగుపర్చుకోవాల్సిన అవసరాన్ని కరోనా మనకు తెలియజేసిందని ప్రధాని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0లో భాగంగా రూ. 276 కోట్లతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఆరోగ్య రంగంలో మానవ వనరుల ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను తీర్చేలా ఈ కోర్సు రూపొందిందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, సమాజాలు, వ్యవస్థలు, కుటుంబాలు, వ్యక్తుల శక్తి సామర్థ్యాలను కరోనా సవాలు చేసిందని ప్రధాని పేర్కొన్నారు. అదే సమయంలో నైపుణ్యాల పెంపు అవసరాన్ని గుర్తు చేసిందన్నారు. ఆరోగ్య రంగానికి, ఫ్రంట్‌లైన్ యోధులకు రెండు నుంచి మూడు నెలల వ్యవధిలో నేర్చుకోగల ఈ కోర్సు కొత్త జవజీవాలను ఇస్తుందన్నారు.
అలాగే, యువతకు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుందన్నారు. భారత్‌లో వైద్యనిపుణుల అవసరం చాలా ఉందని, జనాభాతో పోలిస్తే వైద్యులు, నర్సులు, పారామెడిక్స్ సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపారు. అందువల్ల ఏడేళ్లలో కొత్తగా ఎయిమ్స్‌ను, మెడికల్ కాలేజీలను, నర్సింగ్ కళాశాలలను పెంచేందుకు చర్యలు తీసుకున్నామని మోదీ తెలిపారు. అలాగే, వైద్య విద్యలో సంస్కరణలను తీసుకువచ్చామన్నారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎమ్, అంగన్వాడీ కార్యకర్తలను ప్రధాని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment