Warriors
-
బెంగళూరును గెలిపించిన శోభన
బెంగళూరు: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి భారత బౌలర్‌గా శోభన ఆశ (5/22) నిలిచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో విజయం దిశగా వెళుతున్న యూపీ వారియర్స్‌ను శోభన తన అద్భుత బౌలింగ్‌తో బ్రేక్ వేసింది. శనివారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో యూపీని ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. రిచా ఘోష్ (37 బంతుల్లో 62; 12 ఫోర్లు), సబ్బినేని మేఘన (44 బంతుల్లో 53; 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 50 బంతుల్లోనే 71 పరుగులు జోడించారు. కెపె్టన్ స్మృతి మంధాన (13), సోఫీ డివైన్ (1), ఎలైస్ పెరీ (8) విఫలమయ్యారు. యూపీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో చివరి ఐదు ఓవర్లలో బెంగళూరు 42 పరుగులే చేయగలిగింది. అనంతరం యూపీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 పరుగులు చేసింది. గ్రేస్ హారిస్ (23 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్వేత సెహ్రావత్ (25 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఛేదనలో 16 ఓవర్లు ముగిసే సరికి యూపీ స్కోరు 126/3. గెలుపు కోసం 24 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన స్థితి. అయితే శోభన జోరుకు 17వ ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి జట్టు తడబాటుకు గురైంది. తర్వాతి 2 ఓవర్లలో 19 పరుగులు రాబట్టి గెలుపుపై యూపీ ఆశలు పెంచుకుంది. చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా, తొలి 5 బంతుల్లో 6 పరుగులు వచ్చాయి. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ తరహాలోనే ఆఖరి బంతికి 5 పరుగులు అవసరం కాగా...దీప్తి శర్మ 2 పరుగులే తీయగలిగింది. -
శభాష్ వారియర్స్
-
పని చేసే చేతులు.. ప్రేమించే మనసు.. స్పందించే హృదయం
సాక్షి, హైదరాబాద్: పని చేసే చేతులు.. ప్రేమించే మనసు.. స్పందించే హృదయం ఉంటే ఎంతటి కఠోర పరిస్థితులనైనా ఎదుర్కొని ముందుకు సాగవచ్చని స్వామి వివేకానందుని వచనాలను గుర్తు చేస్తున్నాయి ఆ ప్రతిమలు. కోవిడ్ మహమ్మారి కోరలు చాచిన తరుణంలో వారు చేసిన సేవలు సమాజం ఎప్పటికీ మరిచిపోదు. కూకట్పల్లి వివేకానందనగర్ కాలనీ ఎంట్రన్స్ వద్ద ఏర్పాటు చేసిన పారిశుద్ధ్య కార్మికురాలు, డాక్టర్, పోలీసు ప్రతిమలు చూపరుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కరోనా కష్టకాలంలో ప్రాణాలను పణంగా పెట్టి ఫ్రంట్‌లైన్ వారియర్స్ సేవలకు గుర్తింపుగా వీటిని ఏర్పాటు చేశారు. చదవండి: మీకు అంత సీన్ లేదు.. దమ్ముంటే పట్టుకోండి! -
ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు మరింత రక్షణ
సాక్షి, హైదరాబాద్: దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నా ముప్పు ఇప్పటికీ పూర్తిగా తొలగిపోలేదు. ముఖ్యంగా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది భవిష్యత్తులో పీపీఈ కిట్లు, శానిటైజర్లు తొడుక్కునే విధులు నిర్వహిస్తున్నారు. అయితే పీపీఈ కిట్లను సురక్షితంగా వదిలి, వైరస్‌ను ఇంటికి తీసుకెళ్లకుండా ఉండేందుకు వీలుగా త్వస్త మ్యాన్యు ఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్, సెయింట్ గోబెన్ కంపె నీలు కొత్త ఆవిష్కరణ చేశాయి. త్రీడీ ప్రింటింగ్ సాంకేతికత ద్వారా డాఫింగ్ యూనిట్లను రూపొందించారు. ఏమిటీ డాఫింగ్ యూనిట్లు..? ఆరోగ్య సిబ్బంది తమ పీపీఈ కిట్లు, గ్లోవ్స్‌ను సురక్షితంగా వదిలిపెట్టేందుకు ఉపయోగపడే నిర్మాణమే డాఫింగ్ యూనిట్. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థులు స్థాపించిన త్వస్త మ్యాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్, సెయింట్ గోబెన్ సంయుక్తంగా 2 యూనిట్లు తయారు చేశారు. ఒకదాన్ని కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటుచేశాయి. రెండో యూనిట్‌ను చెన్నైలోని ఒమండురార్ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. నిర్మాణంలో ఉన్న మూడో యూనిట్‌ను తిరువళ్లువార్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు చేయనున్నారు. అతినీల లోహిత కిరణాలు, సీ స్టెరిలైజేషన్ బాక్స్, ఆటోమెటిక్ శానిటైజర్, సోప్ డిస్పెన్సర్ వంటి సౌకర్యాలు ఇందులో ఉంటాయి. ఇవీ ప్రయోజనాలు.. డాఫింగ్ యూనిట్లో పీపీఈ కిట్లు, ఇతర వస్తువులను సురక్షితంగా విడిచిపెట్టొచ్చు. వైద్యులు, సిబ్బంది షిఫ్ట్‌లు ముగించుకుని వెళ్లేటప్పుడు లేదా విధుల్లోకి చేరేటప్పుడు తమను తాము శానిటైజ్ చేసుకునేందుకూ ఇవి ఉపయోగపడతాయి. త్వస్త మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూష న్స్ అభివృద్ధి చేసిన టెక్నాలజీకి కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అందించామని సెయింట్ గోబెన్ తెలిపింది. -
ఈసారి భారతరత్న వాళ్లకే ఇవ్వండి: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం ముందు సరికొత్త డిమాండ్‌ను ఉంచారు. కరోనాపై పోరాటంలో ముందు వరసలో నిలిచి ప్రజల ప్రాణాలు కాపాడిన భారతీయ వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి ఈ ఏడాది భారతరత్న ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక లేఖ కూడా రాశాడు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అందరికీ సమూహంగా భారత రత్న ఇవ్వాలని, అసరమైతే నిబంధనలు మార్పు చేయాలని కోరారు. ఈ ఏడాది భారతరత్నను వైద్యుడికి ఇవ్వాలని దేశం కోరుకుంటోందని అలా అని ఎవరో ఒకరికి ప్రకటించమని తాను కోరడం లేదన్నారు. దేశంలోని వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది అందరినీ కలిపి సముచిత గౌరవం కల్పించాలని కోరారు. ఈ విధంగా ప్రకటించడమే కరోనాతో పోరాడి మృతి చెందిన వైద్యులు, ఆరోగ్య సిబ్బందికిచ్చే ఘనమైన నివాళి అని తెలిపారు. చదవండి: ఉచిత విద్యుత్.. రోజంతా కరెంట్ లక్షలాది మంది వైద్య సిబ్బంది నిస్వార్థంగా సేవలందించారని, దేశం మొత్తం వైద్యులను కీర్తిస్తోందని, వారందరినీ భారతరత్నతో గౌరవిస్తే భారతీయులందరూ సంతోషిస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఐఎంఏ లెక్కల ప్రకారం.. కరోనాతో ఇప్పటిదాకా 1,492 మంది వైద్యులు చనిపోగా.. కరోనా వారియర్లుగా వేల సంఖ్యలో మిగతా వైద్య సిబ్బంది మృత్యువాత పడ్డారు. -
భవిష్యత్ సవాళ్లకు సన్నద్ధం కావాలి!
న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటున్న కరోనా వైరస్ విసరనున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదన్నారు. ఈ మహమ్మారి ఎంత ప్రమాదకర సవాళ్లను విసరగలదన్నది రెండో వేవ్ ద్వారా అర్థమైందన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు లక్షకు పైగా కోవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్లు నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఉద్దేశించిన స్వల్పకాలిక కోర్సును శుక్రవారం ప్రధాని ప్రారంభించారు. భవిష్యత్‌లో కరోనాతో రానున్న సవాళ్లను ఎదుర్కొనే సంసిద్ధతను పెంచుకునే దిశగా ఈ కోర్సు రూపొందిందని ప్రధాని తెలిపారు. జూన్ 21 నుంచి దేశంలో 18 ఏళ్ల వయస్సు పైబడిన అందరికీ ఉచితంగా టీకా ఇవ్వడానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. రెండో వేవ్ సమయంలో మెడికల్ ఆక్సిజన్ లభ్యత విషయంలో ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని, త్వరలో దాదాపు ప్రతి జిల్లాలో మెడికల్ ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా, యుద్ధ ప్రాతిపదికన 1,500 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని వెల్లడించారు. ఫ్రంట్‌లైన్ వారియర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్వల్పకాలిక కోర్సు వివరాలను వెల్లడిస్తూ.. హోం కేర్ సపోర్ట్, బేసిక్ కేర్ సపోర్ట్, అడ్వాన్స్డ్ కేర్ సపోర్ట్, ఎమర్జెన్సీ కేర్ సపోర్ట్, శాంపిల్ కలెక్షన్ సపోర్ట్, మెడకల్ ఎక్విప్మెంట్ సపోర్ట్.. అనే 6 కీలక విధుల్లోని వారియర్లకు ఉపయోగపడేలా దీనిని రూపొందించారని తెలిపారు. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లోని 111 సెంటర్లలో ఈ కోర్సును ప్రారంభించారు. నైపుణ్యాలను పరిస్థితులకు అనుగుణంగా మెరుగుపర్చుకోవాల్సిన అవసరాన్ని కరోనా మనకు తెలియజేసిందని ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0లో భాగంగా రూ. 276 కోట్లతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఆరోగ్య రంగంలో మానవ వనరుల ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను తీర్చేలా ఈ కోర్సు రూపొందిందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, సమాజాలు, వ్యవస్థలు, కుటుంబాలు, వ్యక్తుల శక్తి సామర్థ్యాలను కరోనా సవాలు చేసిందని ప్రధాని పేర్కొన్నారు. అదే సమయంలో నైపుణ్యాల పెంపు అవసరాన్ని గుర్తు చేసిందన్నారు. ఆరోగ్య రంగానికి, ఫ్రంట్‌లైన్ యోధులకు రెండు నుంచి మూడు నెలల వ్యవధిలో నేర్చుకోగల ఈ కోర్సు కొత్త జవజీవాలను ఇస్తుందన్నారు. అలాగే, యువతకు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుందన్నారు. భారత్‌లో వైద్యనిపుణుల అవసరం చాలా ఉందని, జనాభాతో పోలిస్తే వైద్యులు, నర్సులు, పారామెడిక్స్ సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపారు. అందువల్ల ఏడేళ్లలో కొత్తగా ఎయిమ్స్‌ను, మెడికల్ కాలేజీలను, నర్సింగ్ కళాశాలలను పెంచేందుకు చర్యలు తీసుకున్నామని మోదీ తెలిపారు. అలాగే, వైద్య విద్యలో సంస్కరణలను తీసుకువచ్చామన్నారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎమ్, అంగన్వాడీ కార్యకర్తలను ప్రధాని ప్రశంసించారు. -
ఫ్రంట్‌లైన్ వర్కర్ల కోసం ‘దారే లేదా’ అంటున్న నాని
హైదరాబాద్: టాలీవుడ్లో వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించాడు యంగ్ హీరో సత్యదేవ్. తాజాగా ఈ బ్లఫ్‌మాస్టర్ నటిస్తున్న చిత్రంలో‘దారే లేదా’ అనే పాట విడుదల అయ్యింది. ఈ పాటను కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో తమ జీవితాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు అండగా ఉంటూ, వారికి సేవలు అందించిన కోవిడ్ ఫ్రంట్‌లైన్ వర్కర్స్ కు ఈ ‘దారే లేదా’ స్పెషల్ సాంగ్‌ను అంకితం ఇస్తున్నట్లు నేచురల్ స్టార్ నాని తెలిపారు. ఈ సందర్భంగా తన ట్విటర్ ఖాతా ద్వారా ఈ సాంగ్‌ను విడుదల చేశారు. నాని స్వీయ నిర్మాణసంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై ఈ మ్యూజిక్ వీడియోను సమర్పిస్తున్నారు. విజయ్ బులగానిన్ ‘దారే లేదా’ పాటకు సంగీతం అందించారు. ఈ స్పూర్తి దాయకమైన పాటకు కేకే లిరిక్స్ అందించారు. నాని, సత్యదేవ్‌లతో పాటు రూప కడువయుర్ కూడా ఈ ‘దారే లేదా’ పాటలో అసోసియేట్ అయ్యారు. ఈ నెల 18న సాయంత్రం 4గంటల 32 నిమిషాలకు ఈ సాంగ్ విడుదల చేశారు. Our little tribute to our Heroes, incidentally on the day lakhs of doctors are protesting against the violence on them 💔 Share it with every frontline warrior you know. I’m sure it will put a smile on them 🙏🏼#DhaareLedha https://t.co/aQ7dzQvXQ6 pic.twitter.com/raGLISS82G — Nani (@NameisNani) June 18, 2021 చదవండి: రూ. 4.65 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్న బ్రహ్మాజీ!.. ట్వీట్ వైరల్ -
వైట్ కోట్ డైరీస్ on 29 may 2021
-
రియల్ వారియర్స్: మా కష్టం కన్నా రోగుల ప్రాణాలే ముఖ్యం
చిత్తూరుకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు కరోనా సోకడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి (అపోలో)లో చేరాడు. వారం తర్వాత మెరుగైన చికిత్స కోసం వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. బాధితుడు 108కు సమాచారం అందించడంతో వెంటనే సిబ్బంది ఆక్సిజన్ సాయంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తిరుపతిలో ఓ వృద్ధురాలికి వైరస్ సోకింది. ఆస్పత్రికి నడిచి వెళ్లలేని పరిస్థితి. తోడు లేకపోవడంతో ఇంట్లోనే ఉండిపోయింది. శ్వాస సమస్య ఎదురవ్వడంతో 108కు సమాచారం అందించింది. అడ్రస్ వెతుక్కుంటూ నిమిషాల్లో సిబ్బంది బాధితురాలి ఇంటిముందు వాలిపోయారు. వెంటనే రోగిని రుయాకు తరలించి ప్రాణాలు నిలబెట్టారు. పుత్తూరుకు చెందిన నిండు గర్భిణికి అర్ధరాత్రి వేళ పురుటి నొప్పులు వచ్చాయి. భర్త లారీ డ్రైవర్. అదే రోజు డ్యూటీకి వెళ్లాడు. దిక్కుతోచని స్థితిలో 108కు ఫోన్ చేసి అడ్రస్ చెప్పింది.వెంటనే సిబ్బంది ఆమెను స్థానికప్రభుత్వాస్పత్రికి తరలించారు. సకాలంలో ఆస్పత్రికి రావడం వల్ల తల్లీబిడ్డకు ప్రాణాపాయం తప్పింది. .. ఇవి మచ్చుకు మూడు మాత్రమే. ఇలాంటి ఘటనలు జిల్లాలో కోకొల్లలు. 108 సిబ్బంది రియల్ వారియర్స్‌గా నిలుస్తున్నారు. కోవిడ్ విజృంభిస్తున్న వేళ ప్రభుత్వం తమపై పెట్టిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడుతున్నారు. కొందరు సిబ్బంది కుటుంబాలకు దూరంగా ఉంటూ రోగుల సేవలో తలమునకలవుతున్నారు. బాధితుల ప్రాణాలు కాపాడడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. తమ కష్టం కన్నా రోగుల ప్రాణాలే ముఖ్యమని వారు పేర్కొంటున్నారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 108 సేవల్లో మొదటి స్థానం రావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 108 సిబ్బంది, వారి సేవలపై ‘సాక్షి’ స్పెషల్ ఫోకస్.. సాక్షి, చిత్తూరు: జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఎదుటి వ్యక్తితో దగ్గర నుంచి మాట్లాడాలంటేనే హడలిపోతున్నారు. కరోనా పాజిటివ్ అంటే తెలిసిన వారు సైతం మొహం చాటేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 108 సిబ్బంది మేమున్నామంటూ.. ముందుకొస్తున్నారు. ఆపత్కాలంలో పేద రోగులకు అండగా నిలుస్తున్నారు. కరోనాకు ఎదురొడ్డి బాధితుల ప్రాణాలు కాపాడుతున్నారు. ప్రజారోగ్యానికి పెద్దపీట రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. ఖర్చుకు వెనుకాడకుండా పేదల ప్రాణాలు కాపాడడమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. గత ప్రభుత్వానికి భిన్నంగా 108 రూపురేఖలు మార్చేసింది. సిబ్బంది నుంచి వాహనంలో వసతుల వరకు అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దింది. రోగి ఏ స్థాయిలో ఉన్నా ప్రాణాలతో ఆస్పత్రికి తరలించే విధంగా వసతులు సమకూర్చింది. బాధితులు ఫోన్ చేసిన వెంటనే స్పందించేలా సిబ్బందికి దిశానిర్దేశం చేసింది. ఇందులో భాగంగానే పేదలకు 108 అపరసంజీవినిగా కనిపిస్తోంది. అవసరాన్ని బట్టి వాహనాల వినియోగం జిల్లాలో మొత్తం 108 వాహనాలు 75 వరకు ఉన్నాయి. ఇందులో 14 వాహనాలను కరోనా తరలింపునకు వినియోగిస్తున్నారు. ఒక్కో అంబులెన్స్‌లో ఈఎంటీ(ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్), పైలెట్(డ్రైవర్) ఉంటున్నారు. వీరు రోజుకు 12 గంటల చొప్పున షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. ఒకవేళ కోవిడ్ రోగుల తరలింపులో బిజీగా ఉంటే మిగిలిన వాహనాలను వినియోగిస్తున్నారు. వసతులు లేని హోం ఐసోలేషన్ రోగులను సమీపంలోని కోవిడ్ కేర్ సెంటర్లకు, శ్వాస సంబంధిత ఇబ్బందులున్న వారిని ఆక్సిజన్ వెంటిలేటర్ సదుపాయంతో కోవిడ్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సిబ్బంది విధి నిర్వహణలో.. కోవిడ్ బాధితులను ఇంటి నుంచి ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం బయట ప్రాంతాతాలకు తీసుకెళ్లడంలో 108 సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరికి ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలను తూచాతప్పక పాటిస్తున్నారు. రోగిని సురక్షితంగా ఆస్పత్రికి తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. పైలెట్, ఈఎన్టీ శానిటైజర్, మాస్క్, పీపీఈ కిట్లు ధరించి కోవిడ్ బాధితులను అంబులెన్స్‌లో ఎక్కించుకుని ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. అత్యవసర సమయంలో బాధితులకు శ్వాస సమస్య ఏర్పడితే ఈఆర్సీపీ (ఎమర్జెన్సీ రెస్పాన్డ్ సెంటర్ ఫిజీషియన్) సలహాలతో ఆక్సిజన్ పెడుతున్నారు. ఆరుగురు కోవిడ్ గర్భిణులకు పురుడు పోశారు. జిల్లాలో ఇప్పటివరకు వైద్యుల సూచనల మేరకు 108 అంబులెన్స్‌లో ఆస్పత్రులకు తరలిస్తూ ఆరుగురు కోవిడ్ గర్భిణులకు పురుడు పోశారు. పాఠశాలలు, కళాశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆపరేషన్ ఎగ్జిక్యూటీవ్‌లు, సిబ్బంది విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. కోవిడ్, నాన్ కోవిడ్ సేవలకు అంతరాయం లేకుండా వేర్వేరు వాహనాలను ఏర్పాటు చేసుకుని వైద్యసేవలు అందిస్తున్నారు. స్టే హోం – స్టే సేఫ్ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. అధికారుల ఆదేశాలను తూచాతప్పకుండా పాటిస్తున్నారు. ► మొత్తం అంబులెన్స్‌లు– 75 ► కోవిడ్ కేసులను తరలించే వాహనాలు– 14 ► గత ఏడాది జూలై నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు తరలించిన ► కోవిడ్ బాధితులు– 16,601 మంది ► ఒక్క ఏప్రిల్‌లోనే తరలించిన కేసులు– 2,554 ► ఇప్పటివరకు తీసుకెళ్లిన అన్ని రకాల కేసులు– 68,253 ► జిల్లాలో మొత్తం 108 సిబ్బంది 320 మంది చిత్తూరు నుంచి కోవిడ్ రోగిని చికిత్స కోసం 108లో తిరుపతికి తరలిస్తున్న సిబ్బంది -
చేయి చేయి కలిపారు సేవకు సై అన్నారు...
ప్రపంచం ఎట్లా పోతేనేం? మాకెందుకు లెండి...అంటూ సెల్ఫోన్లో ముఖం దాచుకోవడం లేదు యువత. దుఃఖప్రపంచంలోకి తొంగిచూడడమే కాదు... ట్విట్టర్, గూగుల్ డ్రైవ్, వాట్సాప్, టెలిగ్రామ్... సాంకేతిక జ్ఞానాన్ని సమాజసేవకు ఉపయోగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.... వినయ్ శ్రీవాస్తవ (65) ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో సీనియర్ జర్నలిస్ట్. కోవిడ్ బారిన పడి చనిపోయారు శ్రీవాస్తవ. చనిపోయే ముందు వైద్యసహాయాన్ని అర్థిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సరిౖయెన టైమ్‌లో, సరిౖయెన వైద్యసౌకర్యం అందితే ఆయన బతికే ఉండేవారు. శ్రీవాస్తవ ట్విట్ ముంబైలోని నైరిత్ గలన్ను కుదిపేసింది. 20 సంవత్సరాల గలన్ ఆ రోజంతా ఆ పోస్ట్ గురించే ఆలోచించాడు. కోవిడ్–19 సెకండ్ వేవ్ ధాటికి మన వైద్యవ్యవస్థ మోయలేనంత భారంతో ఉన్న నేపథ్యానికి శ్రీవాస్తవ మరణం ఒక ఉదాహరణ మాత్రమే. హాస్పిటల్ బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్స్, ప్లాస్మా... ఇలా రకరకాల సహాయాలను అర్థిస్తున్న ఎన్నో పోస్ట్‌లను మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో చూసి ఉన్నాడు గలన్. ఇండోర్‌లో అనుష్క జైన్ (20) పరిస్థితి కూడా అంతే. వైద్యసహాయాన్ని అర్థిస్తూ సామాజిక మాధ్యమాల్లో కనిపించే విన్నపాలు ఆమెను బాగా కదిలించాయి. ముంబైలో ఉండే నైరిత్‌కు, ఇండోర్‌లో ఉండే అనుష్క జైన్‌కు ట్విట్టర్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఒకరి భావాలను ఒకరు పంచుకున్నారు. ఇద్దరుగా మొదలైన ఈ ప్రయాణంలో సమభావాలు ఉన్న యువతీయువకులు తోడయ్యారు. మొత్తం 60 మంది ఒక గ్రూప్‌గా ఏర్పడ్డారు. 18 నుంచి 26 సంవత్సరాల మధ్య వయసు వారు ఇందులో ఉన్నారు. వీరిలో ఒకరితో ఒకరికి ఇంతకుముందు పరిచయమేదీ లేదు. ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించాలనే భావన వారిని దగ్గర చేసింది. దేశవ్యాప్తంగా కోవిడ్ బాధితులకు సేవలు అందించడానికి ఈ 60 మంది రెండు బృందాలుగా ఏర్పడ్డారు. ఒక బృందం... సహాయం కోసం ఆశించే వారి వివరాలు సేకరిస్తుంది. మరో బృందం... ఆ సహాయం అందించడానికి కావలసిన వనరుల ఏర్పాటు చేస్తుంది. హాస్పిటల్ బెడ్స్, అంబులెన్స్ సర్వీస్, ఆక్సిజన్, ప్లాస్మా... మొదలైన వాటికి సంబంధించి సాధికారికమైన సమాచారంతో గూగుల్ డ్రైవ్‌లో డేటాబేస్ ఏర్పాటు చేశారు. ‘బాట్ ఆన్ ట్విట్టర్’ను కూడా ఉపయోగించుకున్నారు. డేటాబేస్ లింక్‌తో ఈ బాట్ ఆటోమేటిక్‌గా రీట్విట్ చేయడం, రిక్వెస్ట్‌లకు రిప్లే ఇవ్వడం చేస్తుంది. 14 గంటల్లో 1,500 రిక్వెస్ట్‌లు వచ్చాయి! ట్విట్టర్ మాత్రమే కాకుండా వాట్సాప్, టెలిగ్రామ్‌లను కూడా ఉపయోగిస్తున్నారు. ఇవేమీ ఉపయోగించని వారికోసం ప్రత్యేకంగా వెబ్సైట్ డిజైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని స్వచ్ఛందసంస్థలతో అవగాహన కుదుర్చుకొని ప్లాస్మా డొనేషన్ డ్రైవ్‌లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ 60 మందిలో కొందరు అనారోగ్యం బారిన పడినా, కోలుకున్నారో లేదో వెంటనే పనిలోకి దిగేవారు. ‘ఎప్పడైనా బద్దకంగానో, దిగులుగానో అనిపిస్తే శ్రీవాస్తవ ట్విట్స్ స్క్రీన్ షాట్స్ చూస్తాను. అవి కర్తవ్యబోధ చేసినట్లు అనిపిస్తాయి. మరింత శక్తి పుంజుకొని పనిలోకి దిగుతాను’ అంటున్నాడు గలన్. పాలో కోయిలో ప్రసిద్ధ పుస్తకం ‘ఆల్కెమిస్ట్’లో ఒక మంచి వాక్యం ఉంది.... ‘మీరు ఏదైనా కావాలనుకున్నప్పుడు దాన్ని సాధించడంలో మీకు సహాయపడడానికి ఈ విశ్వమంతా కుట్ర చేస్తుంది’ ఎంత నిజం! -
కోవిడ్ వారియర్స్‌కు కొత్త బీమా పథకం
సాక్షి న్యూఢిల్లీ: ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ(పీఎంజీకేపీ) కింద కోవిడ్-19 వారియర్స్‌కు ఏప్రిల్ 24వ తేదీ నుంచి కొత్త బీమా విధానం అమల్లోకి రానుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అప్పటిలోగా బీమా క్లెయిమ్‌ల చెల్లింపులను పూర్తి చేస్తామని ప్రకటించింది. కరోనా వారియర్స్ కోసం కొత్తగా అమల్లోకి తేనున్న బీమా కవరేజీ విధానంపై న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. కరోనా వారియర్స్‌కు సంబంధించి 287 క్లెయిమ్‌ల చెల్లింపులను ఇప్పటి వరకు బీమా కంపెనీ పూర్తి చేసినట్లు ట్విట్టర్లో వివరించింది.విధి నిర్వహణలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఆరోగ్య కార్యకర్తల కుటుంబాలకు దీని ద్వారా రూ.50 లక్షలు అందుతాయి. మరోవైపు దేశంలో కరోనా చాపకింద నీరులా త్వరితగతిన విస్తరిస్తోంది. రికార్డు స్తాయిలో రోజువారీ పాజిటివ్ కేసుల మంగళవారం 2.59 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో భారతదేశం 1,761 కోవిడ్ మరణాలను నమోదు చేసింది, మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 1.53 కోట్లకు పైగా ఉంది. దీంతో పలు రాష్ట్రాల్లో కఠినమైన కరోనా ఆంక్షలు అమలవుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ వారం రోజుల పూర్తి లాక్డౌన్ ప్రకటించగా, మరో కరోనా ప్రభావిత రాష్ట్రం మహారాష్ట్ర కూడా లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. చదవండి : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్‌కు కరోనా: పరిస్థితి విషమం కరోనా రోగులకు డీఆర్డీవో అద్భుత పరికరం -
ఆశ్చర్యంలో ముంచెత్తిన ప్రధాని
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన బీఎస్సీ మూడో సంవత్సరం విద్యార్థి ప్రణవ్ మహాజన్ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి అతడికి లేఖ రావడమే ఇందుకు కారణం. తాను రాసిన లేఖకు ప్రధానమంత్రి ప్రతిస్పందించడం పట్ల ప్రణవ్ ఆనందం వ్యక్తం చేశాడు. పరీక్షల సందర్భంగా ఒత్తిడిని తగ్గించుకోవడం, మంచి మార్కులు సాధించడం ఎలాగో వివరిస్తూ మోదీ రాసిన ‘ఎగ్జామ్ వారియర్స్’ అనే పుస్తకాన్ని చదివి స్ఫూర్తి పొందానంటూ ప్రధానికి లేఖ రాశాడు. మోదీ సూచించినట్లుగా నిత్యం యోగా, వ్యాయామం చేస్తున్నానని, అవి తనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పాడు. ప్రణవ్ లేఖపై మోదీ ప్రతిస్పందిస్తూ తాజాగా లేఖ రాశారు. ‘‘నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కఠోర శ్రమ, అంకితభావంతో నీ పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను, సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోవాలి. నిన్ను నీవు మెరుగుపర్చుకోవాలి. అదే నిన్ను జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది’’ అని ప్రణవ్‌కు రాసిన లేఖలో ప్రధాని మోదీ ఉద్బోధించారు. చదవండి: రైతులకు మద్దతు : గ్రెటా థన్‌బర్గ్‌పై కేసు వ్యాక్సిన్ తీసుకుంటారా? లేదా? ఆసక్తికరమైన సర్వే -
ఐరోపా దేశాల్లో 17 సెకన్లకు ఒక మరణం
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ సెకండ్‌వేవ్ రూపంలో మళ్లీ విరుచుకుపడితే..? వైరస్ విజృంభించిన మొదట్లో ఎదురైన గడ్డు పరిస్థితులు మళ్లీ పునరావృతమైతే మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామా?, గత 8 – 9 నెలలుగా అవిశ్రాంతంగా శ్రమిస్తూ కరోనా నియంత్రణలో ముందుండి పోరాడిన ఫ్రంట్‌లైన్ వారియర్స్.. డాక్టర్లు, వైద్య సిబ్బంది, హెల్త్కేర్వర్కర్లు మరోసారి అదే తెగువను చూపుతారా? ఇప్పటికే ఎన్నో ఒత్తిళ్లు, ఆందోళనలతో పాటు ఈ సుదీర్ఘ యుద్ధంలో తమ సహచరులను కొందరిని కోల్పోయిన వారియర్స్ మళ్లీ అలాంటి శారీరక, మానసిక సంఘర్షణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారా?, పరిస్థితి మళ్లీ చేతులు దాటి.. దేశవ్యాప్తంగా మరింత కఠిన లాక్డౌన్ విధించాల్సి వస్తే..?.. ఇప్పుడివే ప్రశ్నలు అందరి మదినీ తొలుస్తున్నాయి. ఐరోపా దేశాల్లో 17 సెకన్లకు ఒక మరణం అమెరికా, ఫ్రాన్స్, మెక్సికో సహా వివిధ ఐరోపా దేశాల్లో సెకండ్‌వేవ్‌లో కేసుల తీవ్రత పెరగడంతో పాటు మరణాల సంఖ్యా ›పెరుగుతోంది. వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో పాటు పశ్చిమదేశాల్లోని వాతా వరణ పరిస్థితుల్లో కోవిడ్ చికిత్సలో వాడే కొన్ని ముఖ్యమైన మందులు పనిచేయట్లేదనే వార్తలొస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ‘మాస్క్ మాత్రమే వ్యాక్సిన్’అని వైద్య నిపుణులు అంటున్నారు. మాస్క్‌ను నిర్లక్ష్యం చేసిన దేశాల్లో కేసులు బాగా పెరుగుతున్నాయి. సెకండ్‌వేవ్ కుదుపునకు గురైన ఐరోపా దేశాల్లో ప్రస్తుతం ప్రతీ 17 సెకన్లకు ఒకరు మరణిస్తున్నారని అంచనా. అదే మాస్క్‌ల వాడకంలో ముందున్న తైవాన్ ఇతర ఆసియా దేశాల్లో తక్కువ కేసులు నమోదవుతున్నాయి. చికిత్సకు లొంగని కేసులు కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే కొద్దీ అది మరింత తట్టుకునే శక్తి (రెసిస్టెన్స్ పవర్)ని పెంచుకుంటుందని, దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరణాల సంఖ్య పెరగొచ్చని గత కొన్ని నెలలుగా కోవిడ్ ప్రత్యేక ట్రీట్మెంట్లో నిమగ్నమైన వైద్య నిపుణులు అంటున్నారు. ఒకటి రెండు వారాలుగా మన దగ్గర కూడా సాధారణ చికిత్సకులొంగని కేసులు ఒకటొకటిగా పెరుగుతున్నట్టు చెబుతున్నారు. ఇలాంటిì కొరుకుడుపడని కేసులకు సంబంధించి ‘జెనిటిక్ అనాలిసిస్’చేస్తే అసలు కారణం తెలుస్తుందని అంటున్నారు. కొన్ని నెలలుగా కరోనా రోగులకు చికిత్సనందిస్తూ, వైరస్‌తో ముడిపడిన వివిధ అంశాలను నిశితంగా గమనిస్తూ, దీనిపై దేశవిదేశాల్లో జరుగుతున్న పరిశోధనలను విశ్లేషిస్తున్న పల్మనాలజిస్ట్లు డాక్టర్ హరికిషన్ గోనుగుంట్ల, డాక్టర్ వీవీ రమణప్రసాద్, డాక్టర్ విశ్వనాథ్ గెల్లా ‘సాక్షి’తో పంచుకున్న తమ అనుభవాలు వారి మాటల్లోనే.. ఎదుర్కొనేందుకు సిద్ధం కరోనా సెకండ్‌వేవ్ నేపథ్యంలో రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ సైతం పరిస్థితిని ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది. ముందస్తుగా చేపట్టిన చర్యలతో తొలిదశ కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొన్న యంత్రాంగం వివిధ రాష్ట్రాలు, నగరాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్న క్రమంలో అప్రమత్తమైంది. సెకండ్‌వేవ్ వచ్చే అవకాశాలుండటంతో శాఖాపరంగా కచ్చితమైన కార్యాచరణను సిద్ధం చేసినట్టు వైద్య,ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ‘తెలంగాణలో మళ్లీ కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సెకండ్‌వేవ్ వచ్చినా ఎదుర్కొనేలా చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రికవరీ రేటు 94 శాతంగా ఉంది. సెకండ్‌వేవ్ నేపథ్యంలో ప్రజలు కచ్చితంగా మాస్క్ ధరించాలి. గుమికూడరాదు. ఇతర కోవిడ్ ప్రొటోకాల్స్ పాటించడం ద్వారా ప్రజలు సహకారమందిస్తే సమస్యను సులభంగా అధిగమించవచ్చు’అని వైద్య,ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటికిప్పుడు మాస్కే వ్యాక్సిన్ ఐరోపా నుంచి వస్తున్న నివేదికలను బట్టి సెకండ్‌వేవ్ తీవ్రంగా ఉన్న దేశాల్లో ప్రతీ 17 సెకన్లకు ఒక మరణం సంభవిస్తోంది. గత వారంలోనే 29 వేల మంది చనిపోయారు. ఇప్పటికే మెక్సికోలో లక్ష మందిపైగా మత్యువాతపడ్డారు. ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో మరోసారి లాక్డౌన్ విధించారు. భారత్‌లో సెకండ్‌వేవ్ తీవ్రంగా వస్తే అది సునామీగా మారే ప్రమాదముంది. ఢిల్లీ, ముంబై తదితర చోట్ల కేసులు పెరుగుతున్నాయి. హాస్పటల్స్‌లో బెడ్స్ మళ్లీ నిండిపోతున్నాయి. కొన్నిచోట్ల అడ్మిట్ అయ్యేందుకు పేషెంట్లు వేచిచూడాల్సిన పరిస్థితులున్నాయి. సాధారణ ప్రజలు వైరస్ ప్రభావం తగ్గిపోయిందనే భావనలో ఉన్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పండుగలు, పబ్బాలు చేసుకుంటున్నారు. మన దగ్గరా సెకండ్‌వేవ్ వస్తే దానిని తట్టుకునే, ఎదుర్కొనే సంసిద్ధత ఉందా? అనేది ప్రశ్న. హెల్త్‌కేర్ వర్కర్లు ఒత్తిళ్లకు గురవుతున్నారు. ప్రజల్లో కనిపిస్తోన్న నిర్లక్ష్యం, వైరస్ మ్యుటేటయ్యే అవకాశాలు, ఇంకా వ్యాక్సిన్ సిద్ధం కాకపోవడం వంటివి సవాల్‌గా మారతాయి. వైరస్ స్ట్రెయిన్లు మార్పు చెందుతూ ఉంటే మరణాల సంఖ్య పెరుగుతుంది. యూఎస్, ఇతర పశ్చిమ దేశాలతో పోలిస్తే తైవాన్‌లో మాస్క్‌లు తప్పనిసరి చేయడంతో అక్కడ గతంలో రోజుకు 40 వేల కేసులు నమోదైతే ఇప్పుడు పదిలోపే వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు మాస్కే వ్యాక్సిన్. – డాక్టర్ హరికిషన్ గోనుగుంట్ల, యశోద ఆసుపత్రి చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అలసత్వంతో మొదటికే మోసం కరోనా ప్రభాం తగ్గిపోయింది.. ఇక ఏమీ కాదనే అతి విశ్వాసం, అజాగ్రత్త, నిర్లక్ష్యం ప్రజల్లో కనిపిస్తోంది. మాస్క్‌లు పెట్టుకోకపోవడమే కాక భౌతికదూరాన్ని కూడా సరిగ్గా పాటించట్లేదు. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటివరకు జరిగిన కృషి అంతా ఈ నిర్లక్ష్యంతో వృథాగా మారే ప్రమాదముంది. ప్రజల అలసత్వం, నిర్లక్ష్యం వల్లే సెకండ్‌వేవ్ వస్తుంది. ఢిల్లీ, ముంబై మాదిరిగా మళ్లీ కేసులు పెరిగి ఐసీయూ బెడ్స్ దొరకని పరిస్థితి రాకుండా చూసుకోవాలి. సాధారణంగా మహమ్మారులు వచ్చినపుడు సెకండ్‌వేవ్ అనేది ఉంటుంది. అయితే కోవిడ్ విషయంలో మరిన్ని ముందుజాగ్రత్తలు, వ్యాధి తీవ్రంగా మారకుండా చూసుకోవాల్సిన అవసరముంది. చలికాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ఇకపై వీటిలో కరోనా, న్యూమోనియా భాగం కానున్నందున అప్రమత్తత చాలా అవసరం. వయసుపైబడిన వారు, అనారోగ్య సమస్యలున్న వారు, చిన్నపిల్లల విషయంలో ఎక్కువ కేర్ తీసుకోవాలి. కనీసం మరో 6 నెలల పాటు జాగ్రత్తలు పాటిస్తే సెకండ్‌వేవ్‌ను కూడా ఎదుర్కోగలుగుతాం. మన దగ్గర ఇప్పటికే 40 శాతం మందిలో యాంటీబాడీస్ ఏర్పడ్డాయనే వార్తలొస్తున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ పరిస్థితులు మెరుగ్గానే ఉన్నాయి. ట్రీట్మెంట్పరంగా కూడా ప్రొటోకాల్స్ ఏర్పడ్డాయి. కరోనా వస్తే ఏంచేయాలన్న దానిపై ప్రజల్లోనూ అవగాహన పెరిగింది. మన దగ్గర వైరస్ మార్పుచెంది మరింత వైర్యులెంట్గా మారిందనడానికి ఆధారాల్లేవు. – డాక్టర్ వీవీ రమణప్రసాద్, కిమ్స్ ఆసుపత్రి కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ నిర్లక్ష్యం అసలు వద్దు మన దగ్గరా సెకెండ్‌వేవ్ వచ్చే అవకాశాలు కచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇటీవల చిన్నా, పెద్ద పండుగల్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా జరుపుకుంటున్నారు. చకాలంలో వైరస్ తీవ్రత మరింత పెరగొచ్చు. మాస్క్‌లు ధరించకపోవడం, గుమికూడటం వంటివి ప్రమాదకరం. వ్యాక్సిన్ రాకముందే ఈ స్థాయిలో అన్నిచోట్లా ఓపెన్ కావడం మంచిది కాదు. కరోనాకు సంబంధించి ప్రస్తుత దశే కీలకం. కోవిడ్ చికిత్సకు సంబంధించి ఇంకా కొత్త మందులు రాలేదు. కొన్నిచోట్ల రెమ్‌డెసివిర్ వంటివి సరిగా పనిచేయడం లేదంటున్నారు. స్టెరాయిడ్స్ వినియోగం తప్ప మెరుగైన ఆయుధం లేదు. ఇప్పటికే వైరస్‌తో చాలా నష్టం జరిగిపోయింది. మనకు కావాల్సిన వారిని, ఆప్తులను చాలామందినే కోల్పోయాం. ఇంత జరిగాక కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తెలిసి తెలిసీ మనకు మనమే నష్టం కలిగించుకుంటున్నట్టు. – డాక్టర్ విశ్వనాథ్ గెల్లా, ఏఐజీ పల్మనాలజీ, స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్ -
వారియర్స్ ఎలెవెన్ గెలుపు
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఆంధ్ర టి20 క్రికెట్ లీగ్ టోర్నమెంట్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో చాంపియన్స్ ఎలెవన్‌పై వారియర్స్ ఎలెవన్ ఆరు వికెట్ల తేడాతో... లెజెండ్స్ ఎలెవన్‌పై కింగ్స్ ఎలెవన్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించాయి. వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చాంపియన్స్ జట్టు తొలుత 20 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. అశ్విన్ హెబ్బర్ (57 నాటౌట్), వంశీ కృష్ణ (28), రికీ భుయ్ (24) రాణించగా... తేజస్వి 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అనంతరం వారియర్స్ జట్టు 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి నెగ్గింది. ఎం.శ్రీరామ్ (60 బంతుల్లో 75 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ప్రశాంత్ కుమార్ (33) ఆకట్టుకున్నాడు. ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) సీఈఓ ఎం.వి.శివారెడ్డి నుంచి శ్రీరామ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం అందుకున్నాడు. సంక్షిప్త స్కోరు: కింగ్స్ ఎలెవన్: 128/8 (20 ఓవర్లలో) (సీఆర్ జ్ఞానేశ్వర్ 47, ధీరజ్ 28, ఆశిష్ రెడ్డి 3/20, జి.మనీశ్ 2/22); లెజెండ్స్ ఎలెవన్: 125 ఆలౌట్ (20 ఓవర్లలో) (జోగేశ్ 43, కార్తీక్ 26, నరేన్ రెడ్డి 4/15, ఆశిష్ 2/27). -
కరోనా: వారికి ఎం అండ్ ఎం బంపర్ ఆఫర్లు
సాక్షి, ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా కరోనా వారియర్స్‌కు, మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. వైద్యులు, పోలీసులు, మహిళా కొనుగోలుదారుల కోసం కొత్త పథకాలను లాంచ్ చేసింది. ముఖ్యంగా డాక్లర్ల కోసం బై నౌ పే లేటర్ అనే పథకాన్ని అందుబాటులో వుంచింది. కరోనా వైరస్, లాక్డౌన్ సంక్షోభ సమయంలో తమ వినియోగదారులకు, ప్రధానంగా కరోనా వారియర్స్‌కు ఆర్థిక సౌలభ్యంగల ప్రత్యేకమైన ఫైనాన్సింగ్ పథకాలను తీసుకొచ్చామని సంస్థ (ఆటోమోటివ్ డివిజన్) సీఈవో వీజయ్ నక్రా ప్రకటించారు. ఈ పథకం కింద వైద్యులకు ప్రాసెసింగ్ ఫీజుపై 50 శాతం రద్దు. అలాగే 8 సంవత్సరాల రుణ కాలపరిమితిపై 90 రోజుల మారటోరియాన్ని కూడా వర్తింప చేయనుంది. దీంతోపాటు 100 శాతం ఆన్-రోడ్ ఫైనాన్సింగ్ వంటి ప్రత్యేక ఆఫర్లతో ఈ కొత్త పథకాన్ని ఎం అండ్ ఎండ్ మంగళవారం విడుదల చేసింది. లాక్డౌన్, ఫైనాన్సింగ్ లాంటి సమస్యల మధ్య సులువుగా వాహనాల కొనుగోలుకు ఈ ఆఫర్లు సహాయపడనున్నాయి. (పరిశ్రమలకు ఊరట, ఉద్యోగులకు షాక్) పోలీసు సిబ్బందికి భారీ ఫైనాన్సింగ్ సదుపాయాన్ని అందివ్వనుంది. అలాగే మహిళా వినియోగదారులకు ఫైనాన్సింగ్ వ్యయంపై 10 బేసిస్ పాయింట్ తగ్గింపు వుంటుందని కంపెనీ తెలిపింది. అలాగే ఎస్యువీ కొనుగోళ్లపై కూడా బై నౌ , పే లేటర్ ఆఫర్ వర్తించనుంది. ఇపుడే వాహనాన్ని సొంతం చేసుకొని, 2021 నుండి ఇఎంఐ ప్రారంభమయ్యే వెసులుబాటు కల్పించింది . మరో పథకం కింద, ఫైనాన్స్డ్ వాహనం కొనుగోలుపై లక్షకు ఇఎంఐ అతి తక్కువగా రూ .1,234 నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ వెల్లడించింది.. (కరోనా : లాక్డౌన్ సడలింపుల వేళ గుడ్ న్యూస్!) -
యోధులారా.. వందనం
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం సాగిస్తున్న వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులకు త్రివిధ దళాలు ఆదివారం ఘనమైన రీతిలో సంఘీభావం ప్రకటించాయి. కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్న ఆసుపత్రులపై హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. సుఖోయ్, మిగ్ వంటి యుద్ధ విమానాలు ప్రధాన నగరాల్లో ఫ్లై పాస్ట్‌లో పాల్గొన్నాయి. అలాగే సముద్ర తీరాల్లో యుద్ధ నౌకలు విద్యుత్ కాంతులతో నిండిపోయాయి. కరోనా భయం వదిలి, ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలన్న స్ఫూర్తిని చాటాయి. ఆసుపత్రుల వద్ద సైనికులు ప్రత్యేక బ్యాండ్ ప్రదర్శన నిర్వహించారు. భద్రతా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా పోలీసు స్మారకాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, జైపూర్, గువాహటి, పట్నా, లక్నో, శ్రీనగర్, చండీగఢ్, భోపాల్, కోయంబత్తూరు, తిరువనంతపురం తదితర నగరాల్లో యుద్ధ విమానాల ఫ్లై పాస్టు ప్రజలను అబ్బురపరిచింది. వైమానిక దళం, నావికా దళానికి చెందిన హెలికాప్టర్లు ‘కరోనా’ ఆసుపత్రులపై పూల జల్లు కురిపించాయి. కరోనా యోధులకు మద్దతుగా త్రివిధ దళాలు నిర్వహించిన ప్రదర్శనల పట్ల హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ వందనాలు కరోనా మహమ్మారిపై పోరాడుతున్న యోధులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘వైరస్ వ్యాప్తిని అంతం చేసే దిశగా ధైర్యంగా ముందుకు సాగుతున్న యోధులకు వందనాలు. మన సైనిక దళాలు వారికి గొప్పగా కృతజ్ఞతలు తెలిపాయి’ అంటూ ట్వీట్ చేశారు. కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్న ఆసుపత్రులపై పూలు చల్లుతున్న హెలికాప్టర్లు, సైనిక బ్యాండ్ ప్రదర్శన వీడియోను పోస్టు చేశారు. ఢిల్లీలో జాతీయ పోలీసు స్మారక స్థూపంపై పూల వర్షం కురిపిస్తున్న భారత వైమానిక దళం హెలికాప్టర్ -
తెలంగాణ వారియర్స్‌కు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆల్‌స్టార్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ వారియర్స్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. వైఎంసీఏ గ్రేటర్ హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో సీనియర్ బాలికల విభాగంలో టైటిల్‌ను కైవసం చేసుకుంది. గురువారం జరిగిన తుదిపోరులో తెలంగాణ వారియర్స్ 37–30తో చాలెంజర్స్ జట్టుపై గెలుపొందింది. సీనియర్ బాలుర విభాగంలో నవాబ్స్ జట్టు విజేతగా నిలిచింది. టైటిల్‌పోరులో నవాబ్స్ 65–42తో శాతవనస్పై నెగ్గింది. జూనియర్ బాలబాలికల విభాగాల్లో బుల్స్, హాక్స్ జట్లు టైటిళ్లను గెలుచుకున్నాయి. జూనియర్ బాలుర ఫైనల్లో బుల్స్ జట్టు 36–24తో వోల్వ్స్ జట్టుపై, బాలికల టైటిల్‌పోరులో హాక్స్ జట్టు 61–39తో లయన్స్ జట్టుపై అలవోకగా గెలుపొందాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బాస్కెట్‌బాల్ సంఘం కోశాధికారి ప్రేమ్ సోలోమన్ పాల్గొన్నారు. -
వారియర్స్‌కు చెన్నై స్మాషర్స్ షాక్
బెంగళూరు: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్–2) పోటీలను చెన్నై స్మాషర్స్ జట్టు విజయంతో ముగిం చింది. అవధ్ వారియర్స్‌తో బుధవా రం జరిగిన మ్యాచ్‌లో చెన్నై స్మాషర్స్ 4–3 పాయింట్ల తేడాతో గెలిచింది. తమ లీగ్ మ్యాచ్‌లనూ ముగించుకున్న వారియర్స్ జట్టు 21 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా... చెన్నై 17 పాయింట్లతో మూడో స్థానంలో, ముంబై రాకెట్స్ 19 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నాయి. పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో విన్సెంట్ వోంగ్ వింగ్ కీ (వారియర్స్) 6–11, 11–9, 12–10తో తనోంగ్సక్ సేన్‌సోమ్‌బున్‌సుక్ (చెన్నై)పై గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్‌లో క్రిస్ అడ్కాక్–గాబ్రియెలా అడ్కాక్ (చెన్నై) జంట 11–4, 11–9తో బోదిన్ ఇసారా–ప్రజక్తా సావంత్ జోడీని ఓడించడంతో స్కోరు 1–1తో సమమైంది. ‘ట్రంప్’ మ్యాచ్‌గా ఎంపిక చేసుకున్న పురుషుల సింగిల్స్ మూడో మ్యా చ్లో కశ్యప్ (చెన్నై) 11–7, 5–11, 11–7తో ఆదిత్య జోషి (వారియర్స్)ను ఓడించడంతో చెన్నై 3–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో పీవీ సింధు 11–4, 11–6తో రితూపర్ణ దాస్ (వారియర్స్)పై నెగ్గడంతో చెన్నై 4–1తో విజయాన్ని ఖరారు చేసుకుంది. పురుషుల డబుల్స్ ‘ట్రంప్’ మ్యాచ్‌లో గో షెమ్–మార్కిస్ కిడో జంట 12–10, 11–8తో సుమీత్ రెడ్డి–కోల్డింగ్ జోడీపై గెలిచినా వారియర్స్ తుదకు 3–4తో ఓటమి చవిచూసింది. గురువారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఢిల్లీ ఏసర్స్‌తో హైదరాబాద్ హంటర్స్ తలపడుతుంది. ఈ మ్యాచ్ ఫలితం ఆధారంగా నాలుగో సెమీస్ బెర్త్ ఖరారు అవుతుంది.