న్యూఢిల్లీ: పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన బీఎస్సీ మూడో సంవత్సరం విద్యార్థి ప్రణవ్ మహాజన్ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి అతడికి లేఖ రావడమే ఇందుకు కారణం. తాను రాసిన లేఖకు ప్రధానమంత్రి ప్రతిస్పందించడం పట్ల ప్రణవ్ ఆనందం వ్యక్తం చేశాడు. పరీక్షల సందర్భంగా ఒత్తిడిని తగ్గించుకోవడం, మంచి మార్కులు సాధించడం ఎలాగో వివరిస్తూ మోదీ రాసిన ‘ఎగ్జామ్ వారియర్స్’ అనే పుస్తకాన్ని చదివి స్ఫూర్తి పొందానంటూ ప్రధానికి లేఖ రాశాడు. మోదీ సూచించినట్లుగా నిత్యం యోగా, వ్యాయామం చేస్తున్నానని, అవి తనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పాడు.
ప్రణవ్ లేఖపై మోదీ ప్రతిస్పందిస్తూ తాజాగా లేఖ రాశారు. ‘‘నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కఠోర శ్రమ, అంకితభావంతో నీ పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను, సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోవాలి. నిన్ను నీవు మెరుగుపర్చుకోవాలి. అదే నిన్ను జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది’’ అని ప్రణవ్‌కు రాసిన లేఖలో ప్రధాని మోదీ ఉద్బోధించారు.
Comments
Please login to add a commentAdd a comment