బెంగళూరు: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి భారత బౌలర్‌గా శోభన ఆశ (5/22) నిలిచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో విజయం దిశగా వెళుతున్న యూపీ వారియర్స్‌ను శోభన తన అద్భుత బౌలింగ్‌తో బ్రేక్ వేసింది. శనివారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 2 పరుగుల తేడాతో యూపీని ఓడించింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. రిచా ఘోష్ (37 బంతుల్లో 62; 12 ఫోర్లు), సబ్బినేని మేఘన (44 బంతుల్లో 53; 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 50 బంతుల్లోనే 71 పరుగులు జోడించారు. కెపె్టన్ స్మృతి మంధాన (13), సోఫీ డివైన్ (1), ఎలైస్ పెరీ (8) విఫలమయ్యారు.
యూపీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో చివరి ఐదు ఓవర్లలో బెంగళూరు 42 పరుగులే చేయగలిగింది. అనంతరం యూపీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 పరుగులు చేసింది. గ్రేస్ హారిస్ (23 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్వేత సెహ్రావత్ (25 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఛేదనలో 16 ఓవర్లు ముగిసే సరికి యూపీ స్కోరు 126/3. గెలుపు కోసం 24 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన స్థితి.
అయితే శోభన జోరుకు 17వ ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి జట్టు తడబాటుకు గురైంది. తర్వాతి 2 ఓవర్లలో 19 పరుగులు రాబట్టి గెలుపుపై యూపీ ఆశలు పెంచుకుంది. చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా, తొలి 5 బంతుల్లో 6 పరుగులు వచ్చాయి. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ తరహాలోనే ఆఖరి బంతికి 5 పరుగులు అవసరం కాగా...దీప్తి శర్మ 2 పరుగులే తీయగలిగింది.
Comments
Please login to add a commentAdd a comment