ఆఖర్లో అనూహ్య విజయంతో ఫైనల్‌కు అర్హత
పరుగుల వేటలో ముంబై ఇండియన్స్ బోల్తా
రాణించిన ఎలీస్ పెరీ, శ్రేయాంక, ఆశ
రేపు జరిగే ఫైనల్లో ఢిల్లీతో ఆర్‌సీబీ అమీతుమీ
న్యూఢిల్లీ: గెలుపు వాకిట ముంబై ఇండియన్స్ బోల్తా పడింది. ఉన్నపళంగా ఉత్కంఠ రేపిన ఆఖరి ఓవర్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) 5 పరుగుల తేడాతో గట్టెక్కింది. తద్వారా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌లో స్మృతి మంధాన నాయకత్వంలోని బెంగళూరు జట్టు ఫైనల్ చేరింది.
డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ సులువుగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఎలిమినేట్ అయ్యింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో బెంగళూరు తలపడుతుంది.
మలుపు తిప్పిన శ్రేయాంక...
శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం 17వ ఓవర్ ముగిసేవరకు గెలిచే స్థితిలోనే ఉంది. 18 బంతుల్లో 20 పరుగులు సులువైన సమీకరణం కాగా... 18వ ఓవర్ వేసిన శ్రేయాంక పాటిల్ 4 పరుగులిచ్చి కీలకమైన హర్మన్‌ప్రీత్ వికెట్‌ను పడగొట్టింది. దాంతో ముంబై విజయసమీకరణం 12 బంతుల్లో 16 పరుగులుగా మారింది. 19వ ఓవర్ వేసిన సోఫీ మోలినెక్స్ నాలుగే పరుగులిచ్చి సజన (1) వికెట్‌ను తీసింది.
ఇక చివర్లో 6 బంతుల్లో 12 పరుగులు చేయడం కూడా ముంబై జట్టుకు కష్టం కాదు. కానీ లెగ్ స్పిన్నర్ ఆశ శోభన మాయాజాలం చేసింది. తొలి 3 బంతులకు 4 పరుగులే ఇచ్చింది. ఆశ వేసిన నాలుగో బంతికి పూజ వస్త్రకర్ ముందుకొచ్చి ఆడి (4) స్టంపౌట్ అయ్యింది. దాంతో ముంబై నెగ్గాలంటే 2 బంతుల్లో 8 పరుగులు చేయాలి. కొత్త బ్యాటర్ అమన్‌జ్యోత్ ఐదో బంతికి ఒక పరుగు తీసింది.
చివరి బంతికి ముంబై 7 పరుగులు చేయాలి. క్రీజులో అమెలియా కెర్ ఉంది. సిక్స్ కొడితే స్కోర్లు సమమై ‘సూపర్ ఓవర్’కు దారి తీస్తుందా అని ఉత్కంఠ కలిగింది. కానీ ఆశ వేసిన ఆఖరి బంతికి అమెలియా ఒక్క పరుగు మాత్రమే తీయగలిగింది. దాంతో ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో బెంగళూరు 5 పరుగులతో గెలిచి తొలిసారి డబ్ల్యూపీఎల్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఆదుకున్న పెరీ...
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి (10), సోఫీ డివైన్ (10), దిశ (0), హిట్లర్లు రిచా ఘోష్ (14), సోఫీ మోలినెక్స్ (11) అంతా నిరాశపరిచారు. 15 ఓవర్లలో ఆర్‌సీబీ స్కోరు 84/5! కనీసం వంద కూడా చేయలేదు.
ఈ దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఎలీస్ పెరీ (50 బంతుల్లో 66; 8 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసింది. ఆఖర్లో జార్జియా వేర్‌హమ్ (10 బంతుల్లో 18 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) బ్యాట్ ఝుళిపించింది. హేలీ మాథ్యూస్, నటాలీ సీవర్ బ్రంట్, సైకా ఇషాక్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం సునాయాసమైన లక్ష్యాన్ని ఛేదించలేక ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులకే పరిమితమైంది.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (30 బంతుల్లో 33; 4 ఫోర్) టాప్ స్కోరర్ కాగా.. అమెలియా కెర్ (25 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు), నటాలీ సీవర్ బ్రంట్ (17 బంతుల్లో 23; 4 ఫోర్లు) 20 పైచిలుకు పరుగులు చేశారంతే! శ్రేయాంక (4–0–16–2) జట్టుకు అవసరమైన స్పెల్ వేయగా, పెరీ, సోఫీ, వేర్‌హమ్, ఆశ తలా ఒక వికెట్ తీశారు.
స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (సి) ఇస్మాయిల్ (బి) సీవర్ 10; సోఫీ డివైన్ (బి) హేలీ 10; పెరీ (సి) సీవర్ (బి) సైకా 66; దిశ (సి) పూజ (బి) సైకా 0; రిచా ఘోష్ (సి) సీవర్ (బి) హేలీ 14; సోఫీ మోలినెక్స్ (బి) సీవర్ 11; వేర్‌హమ్ (నాటౌట్) 18; శ్రేయాంక (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 135. వికెట్ల పతనం: 1–20, 2–20, 3–23, 4–49, 5–84, 6–126. బౌలింగ్: షబ్నిమ్ 4–1–30–0, హేలీ మాథ్యూస్ 4–0–18–2, నటాలీ సీవర్ బ్రంట్ 4–0–18–2, సైకా ఇషాక్ 3–0–27–2, పూజ వస్త్రకర్ 3–0–21–0, అమెలియా కెర్ 2–0–18–0.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక (బి) పెరీ 19; హేలీ (సి) వేర్‌హమ్ (బి) శ్రేయాంక 15; నటాలీ సీవర్ (బి) వేర్‌హమ్ 23; హర్మన్‌ప్రీత్ (సి) డివైన్ (బి) శ్రేయాంక 33; అమెలియా కెర్ (నాటౌట్) 27; సజన (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) సోఫీ మోలినెక్స్ 1; పూజ (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) ఆశ శోభన 4; అమన్‌జోత్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 130. వికెట్ల పతనం: 1–27, 2–50, 3–68, 4–120, 5–123, 6–128. బౌలింగ్: రేణుక 1–0–6–0, శ్రేయాంక పాటిల్ 4–0–16–2, సోఫీ డివైన్ 1–0–9–0, ఎలీస్ పెరీ 4–0–29–1, సోఫీ మోలినెక్స్ 4–0–16–1, వేర్‌హమ్ 4–0–37–1, ఆశ శోభన 2–0–13–1.
Comments
Please login to add a commentAdd a comment