ప్లే ఆఫ్స్‌కు బెంగళూరు | Sakshi
Sakshi News home page

ప్లే ఆఫ్స్‌కు బెంగళూరు

Published Wed, Mar 13 2024 3:58 AM

Bangalore for the play offs - Sakshi

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఎలీస్‌ పెరీ

6 వికెట్లు తీయడంతోపాటు 40 పరుగులు చేసిన ఆర్‌సీబీ ప్లేయర్‌

చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 7 వికెట్లతో నెగ్గిన బెంగళూరు 

న్యూఢిల్లీ: ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా దర్జాగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నీలో ప్లే ఆఫ్స్‌ దశకు అర్హత సాధించింది. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే గెలవాల్సిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో స్మృతి మంధాన నాయకత్వంలోని ఆర్‌సీబీ జట్టు అదరగొట్టే ప్రదర్శన చేసింది. ఏడు వికెట్లతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను ఓడించిన బెంగళూరు చివరిదైన మూడో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

ముందుగా ముంబై ఇండియన్స్‌ 19 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్‌కాగా... బెంగళూరు 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసి గెలిచింది. ఆ్రస్టేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఎలీస్‌ పెరీ అద్భుత ఆటతీరుతో బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించింది. ముందుగా బంతితో మెరిసిన పెరీ 4 ఓవర్లలో కేవలం 15 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాట్‌తో అదరగొట్టి 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో అజేయంగా 40 పరుగులు సాధించింది.
 
నేడు జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిస్తే 12 పాయింట్లతో లీగ్‌ టాపర్‌గా నిలిచి నేరుగా ఫైనల్‌కు అర్హత పొందుతుంది. ఫైనల్లో స్థానం కోసం ముంబై, బెంగళూరు జట్ల మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఒకవేళ గుజరాత్‌ చేతిలో ఢిల్లీ ఓడిపోతే... ఢిల్లీ, ముంబై రెండు జట్లలో మెరుగైన రన్‌రేట్‌ ఉన్న జట్టు ఫైనల్‌ చేరుతుంది.   

ముంబైతో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్‌ ఎంచుకోగా... ఓపెనర్లు హేలీ మాథ్యూస్‌ (23 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), సజన (21 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్‌) 43 పరుగులు జోడించి ముంబైకు శుభారంభం ఇచ్చారు. అయితే ఆరో ఓవర్‌ చివరి బంతికి సోఫీ డివైన్‌ బౌలింగ్‌లో హేలీ అవుటవ్వడంతో ముంబై పతనం మొదలైంది. అనంతరం పెరీ తన పేస్‌ బౌలింగ్‌తో సజన, హర్మన్‌ప్రీత్‌ (0), అమెలియా కెర్‌ (2), అమన్‌జ్యోత్‌ (4), పూజ వస్త్రకర్‌ (6), నటాలీ సీవర్‌ బ్రంట్‌ (10)లను అవుట్‌ చేసింది. దాంతో ఒకదశలో 43/0తో ఉన్న ముంబై 82/7తో కష్టాల్లో పడింది.

చివర్లో ప్రియాంక బాలా (19 నాటౌట్‌; 2 ఫోర్లు) రాణించడంతో ముంబై స్కోరు 100 దాటింది. 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. స్మతి (11; 2 ఫోర్లు), సోఫీ మోలినెక్స్‌ (9; 2 ఫోర్లు), సోఫీ డివైన్‌ (4) తక్కు వ స్కోరుకే వెనుదిరిగారు. అయితే రిచా ఘోష్‌ (28 బంతుల్లో 36 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), పెరీ నాలుగో వికెట్‌కు 76 పరుగులు జోడించి బెంగళూరును విజయతీరాలకు చేర్చారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement