ముంబై ఇండియన్స్‌ జోరు  | Sakshi
Sakshi News home page

ముంబై ఇండియన్స్‌ జోరు 

Published Sun, Mar 3 2024 12:42 AM

Second consecutive defeat for Smriti team  - Sakshi

మూడో విజయం సాధించిన టీమ్‌ 

7 వికెట్లతో బెంగళూరు చిత్తు 

బెంగళూరు: డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ దూకుడు ముందు సొంతగడ్డపై రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు నిలవలేకపోయింది. ఫలితంగా స్మృతి సేనకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో బెంగళూరుపై ఘన విజయం సాధించింది. టోర్నీలో మూడో మ్యాచ్‌ నెగ్గిన ముంబై ఈ మూడింటినీ ఛేదనలోనే గెలుచుకోవడం విశేషం.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులకే పరిమితం కాగా...ముంబై 15.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి మరో 29 బంతులు మిగిలి ఉండగానే సునాయాస విజయాన్ని అందుకుంది. అనారోగ్యంనుంచి కోలుకోని కారణంగా ముంబై కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ ఈ మ్యాచ్‌లో కూడా ఆడలేదు.  

బెంగళూరు ఇన్నింగ్స్‌ తొలి 6 ఓవర్లు ముగిసే సరికే ఓపెనర్లు స్మృతి మంధాన (9), ఎస్‌.మేఘన (11), సోఫీ డివైన్‌ (9) వెనుదిరిగారు. రిచా ఘోష్‌ (7), సోఫీ మోలినెక్స్‌ (12) కూడా విఫలం కావడంతో స్కోరు 71/5 వద్ద నిలిచింది. ఈ దశలో ఎలైస్‌ పెరీ (38 బంతుల్లో 44 నాటౌట్‌; 5 ఫోర్లు) జట్టును ఆదుకుంది.  పెరీ, జార్జ్‌ వేర్‌హామ్‌ (20 బంతుల్లో 27; 3 ఫోర్లు) ఆరో వికెట్‌కు 40 బంతుల్లో 52 పరుగులు జోడించడంతో ఆర్‌సీబీ కాస్త గౌరవప్రదమైన స్కోరుకు చేరుకుంది.

ఒక్క సిక్సర్‌ కూడా లేకుండా బెంగళూరు ఇన్నింగ్స్‌ ముగిసింది. ముంబై బౌలర్లలో పూజ వస్త్రకర్, నాట్‌ సివర్‌ బ్రంట్‌ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం స్వల్ప ఛేదనను ముంబై దూకుడుగా మొదలు పెట్టింది. యస్తిక భాటియా (15 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), హేలీ మాథ్యూస్‌ (21 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్‌) తొలి వికెట్‌కు 23 బంతుల్లో 45 పరుగులు జోడించి శుభారంభం అందించారు.

మూడో స్థానంలో వచ్చిన తాత్కాలిక కెప్టెన్ నాట్‌ సివర్‌ బ్రంట్‌ (25 బంతుల్లో 27; 4 ఫోర్లు) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. అయితే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అమేలియా కెర్‌ (24 బంతుల్లో 40 నాటౌట్‌; 7 ఫోర్లు) ధాటైన ఆట ముంబై పనిని సులువు చేసింది. పూజ వస్త్రకర్‌ (8 నాటౌట్‌)తో కలిసి కెర్‌ వేగంగా మ్యాచ్‌ను ముగించింది. నేడు జరిగే మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతుంది.  

Advertisement
Advertisement