నేడు ముంబై, బెంగళూరు మధ్య ఎలిమినేటర్ పోరు
రాత్రి గం. 7:30 నుంచి ‘స్పోర్ట్స్–18’లో ప్రత్యక్ష ప్రసారం
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో అమీతుమీకి అర్హత సాధించేందుకు ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్లు సమరానికి సిద్ధమయ్యాయి. శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఇరుజట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై టైటిల్ నిలబెట్టుకునే పనిలో ఉండగా, గత సీజన్‌లో నిరాశపరిచిన బెంగళూరు కొత్తగా ఫైనల్ చేరేందుకు తహతహలాడుతోంది.
ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన బృందం గెలిస్తే గత రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది. ముంబై గెలిస్తే మాత్రం 2023 సీజన్ ఫైనల్ పునరావృతం అవుతుంది. ఇక ఈ సీజన్ విషయానికొస్తే బెంగళూరు మెరుగుపడింది. లీగ్ ఆరంభ దశలో యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్‌లపై వరుస విజయాలతో టచ్‌లోకి వచ్చింది. అయితే గత ఫైనలిస్టులతో తలపడిన మ్యాచ్‌ల్లో ఓటమి పాలైనప్పటికీ అడపాదడపా విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానాన్ని పదిలపర్చుకుంది. దీంతో పాటు ఆఖరి మ్యాచ్‌లో ముంబైలాంటి ప్రత్యర్థిని చిత్తుగా ఓడించడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
ఆర్‌సీబీ స్టార్ ఎలీస్ పెరీ ఆల్‌రౌండ్ షో ముంబైని ముంచేసింది. కీలకమైన పోరులో ఓపెనర్లు స్మృతి, సోఫీలు విఫలమైనా బ్యాట్‌తోనూ పెరీ జట్టును నడిపించింది. హిట్టింగ్‌తో రిచా ఘోష్ జట్టులో కీలకపాత్ర పోషిస్తోంది. సోఫీ డివైన్, జార్జియా వేర్‌హామ్‌లు కూడా ధాటిగా ఆడితే ముంబై బౌలర్లకు కష్టాలు తప్పవు. ఈ సీజన్‌లో ఆఖరి లీగ్ మ్యాచ్‌ను మినహాయించి ఓవరాల్‌గా చూసుకుంటే ముంబై డిఫెండింగ్ చాంపియన్ పాత్రకు న్యాయం చేసేలా ఆడింది.
హేలీ మాథ్యూస్, సజన, నటాలీ సీవర్ బ్రంట్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్, అమెలియా కెర్‌లతో కూడిన బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. బౌలింగ్ విభాగంలో స్పీడ్‌స్టర్ షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్, అమెలియాలు రాణిస్తే బెంగళూరును ఓడించడం ఏమంత కష్టం కానేకాదు. ఐదు జట్లు పోటీపడ్డ డబ్ల్యూపీఎల్‌లో లీగ్ దశలో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment