కొత్త విజేత ఎవరో! | Sakshi
Sakshi News home page

కొత్త విజేత ఎవరో!

Published Sun, Mar 17 2024 4:24 AM

Today is the WPL final - Sakshi

నేడు డబ్ల్యూపీఎల్‌ ఫైనల్‌  

ఢిల్లీతో బెంగళూరు టైటిల్‌ పోరు నేడు 

జోరు మీదున్న మంధాన సేన 

సమరోత్సాహంతో క్యాపిటల్స్‌ 

న్యూఢిల్లీ: ఇంకొన్ని రోజుల్లో ఐపీఎల్‌... ఈ రోజేమో డబ్ల్యూపీఎల్‌ ఫైనల్‌... ముందున్న క్రికెట్‌ పండగకు నేడు జరిగే టైటిల్‌ పోరు ఏమాత్రం తీసిపోదు. ఎందుకంటే ఈ సీజన్‌లో అతివల మ్యాచ్‌లు ఆషామాషీగా సాగలేదు. కాబట్టి ఫైనల్‌ కూడా హోరాహోరీ ఖాయం. పైగా గత రన్నరప్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈ సారీ అలా వెళ్లడానికి సిద్ధంగా లేదు. అలాగని వరుస విజయాలతో డిఫెండింగ్‌ చాంపియన్‌ను చిత్తు చేసిన బెంగళూరును తక్కువ అంచనా వేయలేం.

ఏదేమైనా మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) క్లైమాక్స్‌లో కొత్త విజేత కోసం గట్టి పోరు తప్పదు! ఈ సీజన్‌లో కొన్ని ఉత్కంఠభరిత మ్యాచ్‌లైతే రెగ్యులర్‌ ఐపీఎల్‌ (పురుషుల టోర్నీ)ను తలపించేలా భారత క్రికెట్‌ ప్రేక్షకుల్ని ఊర్రూతలూగించాయి. ఈ నేపథ్యంలో మెరుపులు మెరిపించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సై అంటే సై అంటున్నాయి.  

ఉత్సాహంతో బెంగళూరు 
డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబైని వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడించిన బెంగళూరు ఈ ఒక్క మ్యాచ్‌లో ఫైనలిస్టును ఓడిస్తే ఎంచక్కా టైటిల్‌ ఎగరేసుకుపోతుంది. కానీ టాపార్డర్‌ వైఫల్యం జట్టును కలవరపెడుతోంది.

గత రెండు మ్యాచ్‌ల్లోనూ జట్టు ను గట్టెక్కించింది ఎలీస్‌ పెరీనే! బ్యాట్‌తో, బంతితో రాణిస్తున్న ఆమెకు కెప్టెన్ స్మృతి మంధాన, సోఫీ మోలినెక్స్, సోఫీ డివైన్‌ల నుంచి సహకారం లభిస్తే బెంగళూరు భారీ స్కోరు సాధిస్తుంది. లేదంటే బౌలర్లపైనే భారం పడుతుంది. ప్రధాన బౌలర్‌ రేణుకా సింగ్‌ ఈ మ్యాచ్‌లో సత్తా చాటాల్సిన అవసరముంది. శ్రేయాంక, ఆశ శోభన, పెరీ, మోలినెక్స్‌లు ఆశించిన మేర రాణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. 

ఈ సారి ట్రోఫీ లక్ష్యంగా... 
గతేడాది ముంబై జోరుతో రన్నరప్‌గా సరిపెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈ సారి ట్రోఫీనే లక్ష్యంగా ఈ టోర్నీలో ఆరంభం నుంచి శ్రమించింది. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంతో నేరుగా ఫైనల్‌కు దూసుకొ చ్చిన మెగ్‌ లానింగ్‌ సేన ఈ సారి భారీ స్కోర్లతో తమ బ్యాటింగ్‌ ప్రతాపాన్ని చూపించింది.

తాజా ఫైనల్‌ ప్రత్యర్థి బెంగళూరుతో తలపడిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారీ స్కోర్లు చేసే గెలిచింది. లానింగ్, షఫాలీ, జెమీమా, క్యాప్సీ అంతా సూపర్‌ఫామ్‌లో ఉండటం వారి బ్యాటింగ్‌ లైనప్‌ను దుర్భేద్యంగా మార్చింది. బౌలింగ్‌లో మరిజన్, శిఖా పాండే, జెస్‌ జొనాసెన్‌లు ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు.
 
పిచ్‌–వాతావరణం 
అరుణ్‌ జైట్లీ స్టేడియంలో గత మూడు మ్యాచ్‌లనూ బౌలర్లే శాసించారు. బౌలర్లకు కలిసొచ్చే వికెట్‌పై మెరుపుల కోసం బ్యాటర్లు శక్తికి మించి శ్రమించాలి. వేసవి మొదలవుతున్న వేళ వర్ష సూచనైతే లేదు.  

తుది జట్లు (అంచనా) 
ఢిల్లీ క్యాపిటల్స్‌: మెగ్‌ లానింగ్‌ (కెపె్టన్‌), షఫాలీ వర్మ, అలైస్‌ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్, మరిజన్‌ కప్, జెస్‌ జొనాసెన్, అరుంధతి, రాధా యాదవ్, మిన్నుమణి, తానియా, శిఖాపాండే. 
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్‌), సోఫీ డివైన్, ఎలీస్‌ పెరీ, దిశా కాసత్, రిచా ఘోష్, సోఫీ మోలినెక్స్, వేర్‌హమ్, శ్రేయాంక, ఆశ శోభన, శ్రద్ధ, రేణుకా సింగ్‌. 

- రా.గం.7.30 నుంచి  ‘స్పోర్ట్స్‌–18’లో ప్రత్యక్ష ప్రసారం 

Advertisement

తప్పక చదవండి

Advertisement