బెంగళూరు జట్టుకు తొలి ఓటమి
25 పరుగులతో నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్
మరిజాన్ కాప్, జెస్ జొనాసెన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
షఫాలీ వర్మ అర్ధ సెంచరీ
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ‘హ్యాట్రిక్’ నమోదు చేయాలని ఆశించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకు నిరాశ ఎదురైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో స్మృతి మంధాన సారథ్యంలోని బెంగళూరు జట్టు 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ ప్లేయర్లు మరిజాన్ కాప్, జెస్ జొనాసెన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ లీగ్‌లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన బెంగళూరుకు ఇదే మొదటి పరాజయం కావడం గమనార్హం.
ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి ఓడిపోయింది. స్మృతి మంధాన కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకపోయింది. ఆరంభం నుంచే ఢిల్లీ బౌలర్ల భరతం పట్టిన స్మృతి 43 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74 పరుగులు చేసింది. సోఫీ డివైన్ (17 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు)తో తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించిన స్మృతి... రెండో వికెట్‌కు ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన (31 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్) జత చేసింది.
మరిజాన్ కాప్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో చివరి బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి గురి తప్పిన స్మృతి క్లీన్ బౌల్డ్ అయింది. అప్పటికి బెంగళూరు స్కోరు 112. స్మృతి అవుటయ్యాక వచ్చిన బ్యాటర్లు ఇలా వచ్చి అలా పెవిలియన్ బాట పట్టడంతో బెంగళూరు విజయతీరానికి చేరలేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మరిజాన్ కాప్ (2/35), జెస్ జొనాసెన్ (3/21), అరుంధతి రెడ్డి (2/38) రాణించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగులు సాధించింది.
కెప్టెన్ మెగ్ లానింగ్ (17 బంతుల్లో 11; 2 ఫోర్లు) విఫలమైనా... షఫాలీ వర్మ (31 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), అలైస్ క్యాప్సీ (33 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. రెండో వికెట్‌కు 83 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక మరిజాన్ కాప్ (16 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), జెస్ జొనాసెన్ (16 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించి ఢిల్లీకి భారీ స్కోరును అందించారు. నేడు జరిగే మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో గుజరాత్ జెయింట్స్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment