
బెంగళూరుపై 9 వికెట్లతో ఘన విజయం
ఆర్‌సీబీకి వరుసగా నాలుగో ఓటమి
చెలరేగిన షఫాలీ, జొనాసెన్
బెంగళూరు: డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) సొంత ప్రేక్షకుల్ని మళ్లీ నిరాశపర్చింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో బెంగళూరు గడ్డపై వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓడింది. తద్వారా ఈ వేదికపై ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ పరాజయం చవిచూసిన స్మృతి మంధాన సేన ప్లేఆఫ్స్ రేసుకు దాదాపు దూరమైంది. మరో వైపు లీగ్‌లో ఐదో విజయాన్ని నమోదు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.
శనివారం జరిగిన పోరులో మెగ్‌లానింగ్ నేతృత్వంలోని ఢిల్లీ 9 వికెట్ల తేడాతో బెంగళూరుపై ఘన విజయం సాధించింది. టాస్ నెగ్గిన క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి (8) పేలవంగా ఆడి నిష్క్ర మించగా, ఎలైస్ పెరీ (47 బంతుల్లో 60 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడింది. రాఘ్వీ బిస్త్ (32 బంతుల్లో 33; 2 సిక్స్‌లు)తో కలిసి మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించింది.
ప్రత్యర్థి బౌలర్లలో శిఖా పాండే, శ్రీచరణి చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 15.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 151 పరుగులు చేసి గెలిచింది. కెపె్టన్ మెగ్‌లానింగ్ (2) సింగిల్ డిజిట్‌కే అవుటవగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షఫాలీ వర్మ (43 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా బెంగళూరు బౌలింగ్‌ను దంచేసింది.
వన్‌డౌన్ బ్యాటర్ జెస్ జొనాసెన్ (38 బంతుల్లో 61 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి వీరవిహారం చేసిన షఫాలీ అబేధ్యమైన రెండో వికెట్‌కు 146 పరుగులు జోడించింది. జెస్, షఫాలీ ఇద్దరు కూడా 30 బంతుల్లోనే ఫిఫ్టీలను పూర్తి చేసుకున్నారు.
స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (సి)లానింగ్ (బి) శిఖా 8; డానీవ్యాట్ (సి) బ్రైస్ (బి) మరిజాన్ 21; పెర్రీ నాటౌట్ 60; రాఘ్వీ బిస్త్ (స్టంప్డ్) బ్రైస్ (బి) శ్రీచరణి 33; రిచాఘోష్ (సి) లానింగ్ (బి) శ్రీచరణి 5; కనిక (సి) షఫాలీ (బి) శిఖా 2; జార్జియా నాటౌట్ 12; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 147. వికెట్ల పతనం: 1–9, 2–53, 3–119, 4–125, 5–128.
బౌలింగ్: మరిజాన్ కాప్ 4–0–18–1, శిఖా పాండే 4–0–24–2, జెస్ జొనాసెన్ 3–0–33–0, అనాబెల్ 4–0–27–0, శ్రీచరణి 4–0–28–2, మిన్నుమణి 1–0–14–0.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: లానింగ్ (సి) పెర్రీ (బి) రేణుక 2; షఫాలీ నాటౌట్ 80; జెస్ జొనాసెన్ నాటౌట్ 61; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (15.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 151. వికెట్ల పతనం: 1–5.
బౌలింగ్: రేణుక 4–1–28–1, కిమ్‌గార్త్ 3–0–25–0, ఎలిస్ పెర్రీ 2–0–24–0, జార్జియా 3–0–21–0, స్నేహ్ రాణా 1.3–0–22–0, ఏక్తాబిస్త్ 1–0–15–0, రాఘ్వీ బిస్త్ 1–0–11–0.
Comments
Please login to add a commentAdd a comment