12.3 ఓవర్లలోనే విజయం
మెరిసిన స్మృతి, మేఘన, రేణుక
మళ్లీ ఓడిన గుజరాత్ జెయింట్స్
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీ రెండో సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ధనాధన్ ఆటతీరుతో వరుసగా రెండో విజయాన్ని సాధించింది. మంగళవారం జరిగిన పోరులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. 7.3 ఓవర్లు మిగిలుండగానే స్మృతి మంధాన బృందం లక్ష్యాన్ని ఛేదించింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 107 పరుగులే చేసింది. ఓపెనర్ హర్లీన్ డియోల్ (31 బంతుల్లో 22; 3 ఫోర్లు), హేమలత (25 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుక సింగ్ (2/14) స్వింగ్ బౌలింగ్‌కు మేటి బ్యాటర్లు బెత్ మూనీ (8), లిచ్‌ఫీల్డ్ (5) తలవంచారు. వేద కృష్ణమూర్తి (9), ఆష్లే గార్డ్‌నర్ (7)లు కూడా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫీ మోలినెక్స్ (3/25) గుజరాత్‌ను కోలుకోని విధంగా దెబ్బతీసింది. ఆర్‌సీబీ ఏకంగా ఏడుగురు బౌలర్లను ప్రయోగించింది. అనంతరం సులువైన లక్ష్యాన్ని బెంగళూరు 12.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన (27 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగింది.
సహచర ఓపెనర్ సోఫీ డివైన్ (6) ఆరంభంలోనే నిష్క్రమించినా... వన్‌డౌన్ బ్యాటర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన (28 బంతుల్లో 36 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి చకాచకా పరుగులు సాధించింది. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో తనూజ (1/20) స్మృతి వేగానికి కళ్లెం వేసింది.
అయితే మేఘన, ఎలీస్ పెరీ (14 బంతుల్లో 23 నాటౌట్; 4 ఫోర్లు) మరో వికెట్ పడకుండా తమ కెపె్టన్‌లాగే ధనాధన్ ఆటతీరును కొనసాగించారు. దాంతో 13వ ఓవర్ పూర్తికాకముందే బెంగళూరు విజయతీరాలకు చేరుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో యూపీ వారియర్స్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment