చిత్తూరుకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు కరోనా సోకడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి (అపోలో)లో చేరాడు. వారం తర్వాత మెరుగైన చికిత్స కోసం వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. బాధితుడు 108కు సమాచారం అందించడంతో వెంటనే సిబ్బంది ఆక్సిజన్ సాయంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
తిరుపతిలో ఓ వృద్ధురాలికి వైరస్ సోకింది. ఆస్పత్రికి నడిచి వెళ్లలేని పరిస్థితి. తోడు లేకపోవడంతో ఇంట్లోనే ఉండిపోయింది. శ్వాస సమస్య ఎదురవ్వడంతో 108కు సమాచారం అందించింది. అడ్రస్ వెతుక్కుంటూ నిమిషాల్లో సిబ్బంది బాధితురాలి ఇంటిముందు వాలిపోయారు. వెంటనే రోగిని రుయాకు తరలించి ప్రాణాలు నిలబెట్టారు.
పుత్తూరుకు చెందిన నిండు గర్భిణికి అర్ధరాత్రి వేళ పురుటి నొప్పులు వచ్చాయి. భర్త లారీ డ్రైవర్. అదే రోజు డ్యూటీకి వెళ్లాడు. దిక్కుతోచని స్థితిలో 108కు ఫోన్ చేసి అడ్రస్ చెప్పింది.వెంటనే సిబ్బంది ఆమెను స్థానికప్రభుత్వాస్పత్రికి తరలించారు. సకాలంలో ఆస్పత్రికి రావడం వల్ల తల్లీబిడ్డకు ప్రాణాపాయం తప్పింది.
.. ఇవి మచ్చుకు మూడు మాత్రమే. ఇలాంటి ఘటనలు జిల్లాలో కోకొల్లలు. 108 సిబ్బంది రియల్ వారియర్స్‌గా నిలుస్తున్నారు. కోవిడ్ విజృంభిస్తున్న వేళ ప్రభుత్వం తమపై పెట్టిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడుతున్నారు. కొందరు సిబ్బంది కుటుంబాలకు దూరంగా ఉంటూ రోగుల సేవలో తలమునకలవుతున్నారు. బాధితుల ప్రాణాలు కాపాడడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. తమ కష్టం కన్నా రోగుల ప్రాణాలే ముఖ్యమని వారు పేర్కొంటున్నారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 108 సేవల్లో మొదటి స్థానం రావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 108 సిబ్బంది, వారి సేవలపై ‘సాక్షి’ స్పెషల్ ఫోకస్..
సాక్షి, చిత్తూరు: జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఎదుటి వ్యక్తితో దగ్గర నుంచి మాట్లాడాలంటేనే హడలిపోతున్నారు. కరోనా పాజిటివ్ అంటే తెలిసిన వారు సైతం మొహం చాటేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 108 సిబ్బంది మేమున్నామంటూ.. ముందుకొస్తున్నారు. ఆపత్కాలంలో పేద రోగులకు అండగా నిలుస్తున్నారు. కరోనాకు ఎదురొడ్డి బాధితుల ప్రాణాలు కాపాడుతున్నారు.
ప్రజారోగ్యానికి పెద్దపీట
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. ఖర్చుకు వెనుకాడకుండా పేదల ప్రాణాలు కాపాడడమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. గత ప్రభుత్వానికి భిన్నంగా 108 రూపురేఖలు మార్చేసింది. సిబ్బంది నుంచి వాహనంలో వసతుల వరకు అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దింది. రోగి ఏ స్థాయిలో ఉన్నా ప్రాణాలతో ఆస్పత్రికి తరలించే విధంగా వసతులు సమకూర్చింది. బాధితులు ఫోన్ చేసిన వెంటనే స్పందించేలా సిబ్బందికి దిశానిర్దేశం చేసింది. ఇందులో భాగంగానే పేదలకు 108 అపరసంజీవినిగా కనిపిస్తోంది.
అవసరాన్ని బట్టి వాహనాల వినియోగం
జిల్లాలో మొత్తం 108 వాహనాలు 75 వరకు ఉన్నాయి. ఇందులో 14 వాహనాలను కరోనా తరలింపునకు వినియోగిస్తున్నారు. ఒక్కో అంబులెన్స్‌లో ఈఎంటీ(ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్), పైలెట్(డ్రైవర్) ఉంటున్నారు. వీరు రోజుకు 12 గంటల చొప్పున షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. ఒకవేళ కోవిడ్ రోగుల తరలింపులో బిజీగా ఉంటే మిగిలిన వాహనాలను వినియోగిస్తున్నారు. వసతులు లేని హోం ఐసోలేషన్ రోగులను సమీపంలోని కోవిడ్ కేర్ సెంటర్లకు, శ్వాస సంబంధిత ఇబ్బందులున్న వారిని ఆక్సిజన్ వెంటిలేటర్ సదుపాయంతో కోవిడ్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
సిబ్బంది విధి నిర్వహణలో..
కోవిడ్ బాధితులను ఇంటి నుంచి ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం బయట ప్రాంతాతాలకు తీసుకెళ్లడంలో 108 సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరికి ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలను తూచాతప్పక పాటిస్తున్నారు. రోగిని సురక్షితంగా ఆస్పత్రికి తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. పైలెట్, ఈఎన్‌టీ శానిటైజర్, మాస్క్, పీపీఈ కిట్లు ధరించి కోవిడ్ బాధితులను అంబులెన్స్‌లో ఎక్కించుకుని ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. అత్యవసర సమయంలో బాధితులకు శ్వాస సమస్య ఏర్పడితే ఈఆర్‌సీపీ (ఎమర్జెన్సీ రెస్పాన్డ్ సెంటర్ ఫిజీషియన్) సలహాలతో ఆక్సిజన్ పెడుతున్నారు. ఆరుగురు కోవిడ్ గర్భిణులకు పురుడు పోశారు.
జిల్లాలో ఇప్పటివరకు వైద్యుల సూచనల మేరకు 108 అంబులెన్స్‌లో ఆస్పత్రులకు తరలిస్తూ ఆరుగురు కోవిడ్ గర్భిణులకు పురుడు పోశారు. పాఠశాలలు, కళాశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆపరేషన్ ఎగ్జిక్యూటీవ్‌లు, సిబ్బంది విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. కోవిడ్, నాన్ కోవిడ్ సేవలకు అంతరాయం లేకుండా వేర్వేరు వాహనాలను ఏర్పాటు చేసుకుని వైద్యసేవలు అందిస్తున్నారు. స్టే హోం – స్టే సేఫ్ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. అధికారుల ఆదేశాలను తూచాతప్పకుండా పాటిస్తున్నారు.
► మొత్తం అంబులెన్స్‌లు– 75
► కోవిడ్ కేసులను తరలించే వాహనాలు– 14
► గత ఏడాది జూలై నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు తరలించిన
► కోవిడ్ బాధితులు– 16,601 మంది
► ఒక్క ఏప్రిల్‌లోనే తరలించిన కేసులు– 2,554
► ఇప్పటివరకు తీసుకెళ్లిన అన్ని రకాల కేసులు– 68,253
► జిల్లాలో మొత్తం 108 సిబ్బంది 320 మంది
చిత్తూరు నుంచి కోవిడ్ రోగిని చికిత్స కోసం 108లో తిరుపతికి తరలిస్తున్న సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment