న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం సాగిస్తున్న వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులకు త్రివిధ దళాలు ఆదివారం ఘనమైన రీతిలో సంఘీభావం ప్రకటించాయి. కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్న ఆసుపత్రులపై హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. సుఖోయ్, మిగ్ వంటి యుద్ధ విమానాలు ప్రధాన నగరాల్లో ఫ్లై పాస్ట్‌లో పాల్గొన్నాయి. అలాగే సముద్ర తీరాల్లో యుద్ధ నౌకలు విద్యుత్ కాంతులతో నిండిపోయాయి. కరోనా భయం వదిలి, ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలన్న స్ఫూర్తిని చాటాయి.
ఆసుపత్రుల వద్ద సైనికులు ప్రత్యేక బ్యాండ్ ప్రదర్శన నిర్వహించారు. భద్రతా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా పోలీసు స్మారకాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, జైపూర్, గువాహటి, పట్నా, లక్నో, శ్రీనగర్, చండీగఢ్, భోపాల్, కోయంబత్తూరు, తిరువనంతపురం తదితర నగరాల్లో యుద్ధ విమానాల ఫ్లై పాస్టు ప్రజలను అబ్బురపరిచింది. వైమానిక దళం, నావికా దళానికి చెందిన హెలికాప్టర్లు ‘కరోనా’ ఆసుపత్రులపై పూల జల్లు కురిపించాయి. కరోనా యోధులకు మద్దతుగా త్రివిధ దళాలు నిర్వహించిన ప్రదర్శనల పట్ల హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హర్షం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ వందనాలు
కరోనా మహమ్మారిపై పోరాడుతున్న యోధులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘వైరస్ వ్యాప్తిని అంతం చేసే దిశగా ధైర్యంగా ముందుకు సాగుతున్న యోధులకు వందనాలు. మన సైనిక దళాలు వారికి గొప్పగా కృతజ్ఞతలు తెలిపాయి’ అంటూ ట్వీట్ చేశారు. కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్న ఆసుపత్రులపై పూలు చల్లుతున్న హెలికాప్టర్లు, సైనిక బ్యాండ్ ప్రదర్శన వీడియోను పోస్టు చేశారు.
ఢిల్లీలో జాతీయ పోలీసు స్మారక స్థూపంపై పూల వర్షం కురిపిస్తున్న భారత వైమానిక దళం హెలికాప్టర్
Comments
Please login to add a commentAdd a comment