ప్రపంచం ఎట్లా పోతేనేం? మాకెందుకు లెండి...అంటూ సెల్‌ఫోన్‌లో ముఖం దాచుకోవడం లేదు యువత.
దుఃఖప్రపంచంలోకి తొంగిచూడడమే కాదు... ట్విట్టర్, గూగుల్ డ్రైవ్, వాట్సాప్, టెలిగ్రామ్... సాంకేతిక జ్ఞానాన్ని సమాజసేవకు ఉపయోగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు....
వినయ్ శ్రీవాస్తవ (65) ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో సీనియర్ జర్నలిస్ట్. కోవిడ్ బారిన పడి చనిపోయారు శ్రీవాస్తవ. చనిపోయే ముందు వైద్యసహాయాన్ని అర్థిస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సరిౖయెన టైమ్‌లో, సరిౖయెన వైద్యసౌకర్యం అందితే ఆయన బతికే ఉండేవారు.
శ్రీవాస్తవ ట్విట్ ముంబైలోని నైరిత్ గలన్‌ను కుదిపేసింది. 20 సంవత్సరాల గలన్ ఆ రోజంతా ఆ పోస్ట్ గురించే ఆలోచించాడు. కోవిడ్–19 సెకండ్ వేవ్ ధాటికి మన వైద్యవ్యవస్థ మోయలేనంత భారంతో ఉన్న నేపథ్యానికి శ్రీవాస్తవ మరణం ఒక ఉదాహరణ మాత్రమే. హాస్పిటల్ బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్స్, ప్లాస్మా... ఇలా రకరకాల సహాయాలను అర్థిస్తున్న ఎన్నో పోస్ట్‌లను మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో చూసి ఉన్నాడు గలన్.
ఇండోర్‌లో అనుష్క జైన్ (20) పరిస్థితి కూడా అంతే. వైద్యసహాయాన్ని అర్థిస్తూ సామాజిక మాధ్యమాల్లో కనిపించే విన్నపాలు ఆమెను బాగా కదిలించాయి. ముంబైలో ఉండే నైరిత్‌కు, ఇండోర్‌లో ఉండే అనుష్క జైన్‌కు ట్విట్టర్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఒకరి భావాలను ఒకరు పంచుకున్నారు. ఇద్దరుగా మొదలైన ఈ ప్రయాణంలో సమభావాలు ఉన్న యువతీయువకులు తోడయ్యారు.
మొత్తం 60 మంది ఒక గ్రూప్‌గా ఏర్పడ్డారు. 18 నుంచి 26 సంవత్సరాల మధ్య వయసు వారు ఇందులో ఉన్నారు. వీరిలో ఒకరితో ఒకరికి ఇంతకుముందు పరిచయమేదీ లేదు. ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించాలనే భావన వారిని దగ్గర చేసింది. దేశవ్యాప్తంగా కోవిడ్ బాధితులకు సేవలు అందించడానికి ఈ 60 మంది రెండు బృందాలుగా ఏర్పడ్డారు.
ఒక బృందం... సహాయం కోసం ఆశించే వారి వివరాలు సేకరిస్తుంది.
మరో బృందం... ఆ సహాయం అందించడానికి కావలసిన వనరుల ఏర్పాటు చేస్తుంది.
హాస్పిటల్ బెడ్స్, అంబులెన్స్ సర్వీస్, ఆక్సిజన్, ప్లాస్మా... మొదలైన వాటికి సంబంధించి సాధికారికమైన సమాచారంతో గూగుల్ డ్రైవ్‌లో డేటాబేస్ ఏర్పాటు చేశారు. ‘బాట్ ఆన్ ట్విట్టర్’ను కూడా ఉపయోగించుకున్నారు. డేటాబేస్ లింక్‌తో ఈ బాట్ ఆటోమేటిక్‌గా రీట్విట్ చేయడం, రిక్వెస్ట్‌లకు రిప్లే ఇవ్వడం చేస్తుంది. 14 గంటల్లో 1,500 రిక్వెస్ట్‌లు వచ్చాయి!
ట్విట్టర్ మాత్రమే కాకుండా వాట్సాప్, టెలిగ్రామ్‌లను కూడా ఉపయోగిస్తున్నారు. ఇవేమీ ఉపయోగించని వారికోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్ డిజైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని స్వచ్ఛందసంస్థలతో అవగాహన కుదుర్చుకొని ప్లాస్మా డొనేషన్ డ్రైవ్‌లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ 60 మందిలో కొందరు అనారోగ్యం బారిన పడినా, కోలుకున్నారో లేదో వెంటనే పనిలోకి దిగేవారు.
‘ఎప్పడైనా బద్దకంగానో, దిగులుగానో అనిపిస్తే శ్రీవాస్తవ ట్విట్స్ స్క్రీన్ షాట్స్ చూస్తాను. అవి కర్తవ్యబోధ చేసినట్లు అనిపిస్తాయి. మరింత శక్తి పుంజుకొని పనిలోకి దిగుతాను’ అంటున్నాడు గలన్.
పాలో కోయిలో ప్రసిద్ధ పుస్తకం ‘ఆల్కెమిస్ట్’లో ఒక మంచి వాక్యం ఉంది....
‘మీరు ఏదైనా కావాలనుకున్నప్పుడు దాన్ని సాధించడంలో మీకు సహాయపడడానికి ఈ విశ్వమంతా కుట్ర చేస్తుంది’ ఎంత నిజం!
Comments
Please login to add a commentAdd a comment