* జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికకు ఆమోదముద్ర
* ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ఫీజుల నిర్ధారణ
* ఇక దేశవ్యాప్తంగా ఒకే ఫీజుల విధానం అమలు
* నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఏఐసీటీఈ
* ఏపీలో ఇంజనీరింగ్ గరిష్ట ఫీజు 1.05 లక్షలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది నుంచి నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సుకు ఏడాది గరిష్ట ఫీజు రూ.1.44 లక్షల నుంచి రూ.1.58 లక్షల మధ్య నిర్ధారిస్తూ అఖిలభారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకూ మార్గదర్శకాలను గురువారం విడుదల చేసింది.
రెండేళ్ల ఎంబీఏ కోర్సుకు ఏడాదికి గరిష్ట ఫీజును రూ.1.57 లక్షల నుంచి రూ.1.71 లక్షల వరకు నిర్ణయించింది. ఈ గరిష్ట ఫీజు ఏటా బీ ఆర్క్ (ఆర్కిటెక్చర్)లో 2.05 లక్షల నుంచి 2.25లక్షలు, బీ ఫార్మా కోర్సులకు రూ.1.41 లక్షల నుంచి రూ.1.55 లక్షల వరకు ఎంసీఏ కోర్సులకు రూ.1.57 లక్షల నుంచి రూ.1.70 లక్షల వరకు ఉండొచ్చని నిర్ధారించింది. ఎంటెక్ కోర్సుల్లో ఏడాది గరిష్ట ఫీజు రూ.2.31 లక్షల నుంచి 2.51 లక్షలుగా నిర్ణయించింది. ఆయా విద్యాసంస్థలు నెలకొన్న ప్రాంతాలు, నిర్వహణ ఖర్చులను అనుసరించి ఫీజులను ఆయా రాష్ట్రాల ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ మండళ్లు (ఏఎఫ్‌ఆర్‌సీ)లు నిర్ణయించాలని ఏఐసీటీఈ పేర్కొంది.
స్వయం ప్రతిపత్తి (అటానమస్) విద్యాసంస్థలు ఈ గరిష్ట ఫీజుల మొత్తంలో 10శాతం, అక్రిడేటెడ్ విద్యాసంస్థలు 20 శాతం చొప్పున పెంచుకోవచ్చు. జాతీయస్థాయిలో ఉన్నత సాంకేతిక, వృత్తివిద్యా కోర్సులకు సంబంధించి కేంద్రం ఏర్పాటుచేసిన జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని ‘నేషనల్ ఫీజుల కమిటీ’ గరిష్ట ఫీజులను నిర్ణయిస్తూ గతేడాది ఆగస్టులో ఇచ్చిన నివేదికను కేంద్రమానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆమోదించడంతో ఏఐసీటీఈ ఆదేశాలు జారీ చేసింది.
నిర్ధారిత గరిష్ట ఫీజులకు మించి విద్యాసంస్థలు వసూలు చేయడానికి వీల్లేదని, భిన్నంగా వ్యవహరిస్తే ఆయా సంస్థల గుర్తింపును రద్దుచేయడంతో పాటు కాలేజీలను మూసివేస్తామని హెచ్చరించింది. జస్టిస్ శ్రీకృష్ణ సారథ్యంలో పది మంది సభ్యులతో 2014లో ఏర్పాటైన కమిటీ ఈ గరిష్ట ఫీజులను నిర్ణయించి ఇచ్చిన నివేదిక సిఫార్సులను 2016-17 నుంచి అమల్లోకి తేవాలని ఆదేశాలు జారీచేసింది.
అయిదేళ్లవరకూ ఇదే ఫీజుల విధానం
ప్రస్తుతం ఆయా రాష్ట్రాల ఏఎఫ్‌ఆర్సీలు మూడేళ్లకోసారి ఫీజులను నిర్ధారిస్తున్నాయి. ఈ గరిష్ట ఫీజులు అయిదేళ్లవరకు అమల్లో ఉండాలని కమిటీ సూచించింది.
* ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం భూమి, భవనాలు, ఇతర సదుపాయాలు, లాబొరేటరీలు, ఫ్యాకల్టీ, ఇతర సిబ్బంది, ఆయాకాలేజీలకు మంజూరైన సీట్ల సంఖ్య, చేరిన విద్యార్థుల సంఖ్య తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ఫీజులను కమిటీ నిర్ధారించింది. ఆయా సంస్థలు జీతభత్యాలు, సంస్థల నిర్వహణకు చేస్తున్న ఖర్చులను అనుసరించి వీటిని నిర్ణయించారు.
* సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆయా రాష్ట్రాలు, కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అనుసరించి మాత్రమే ఫీజులు వసూలుచేయాలని కమిటీ స్పష్టం చేసింది. విదేశీ, ప్రవాస భారతీయ విద్యార్థులకు సూపర్‌న్యూమరరీ సీట్లు కేటాయించాల్సి వచ్చినప్పుడు గరిష్ట ఫీజులకు మూడురెట్లు వసూలుచేసి ప్రవేశాలు కల్పించవచ్చు.
* ఆయా కాలేజీల్లో మేనేజ్‌మెంటు, కన్వీనర్ కోటాలతో పాటు ఇతర ఏ రకమైన ప్రవేశాలకైనా ఇవే గరిష్ట ఫీజులకు మించి వసూలు చేయరాదని కమిటీ స్పష్టం చేసింది. విద్యార్థుల నుంచి బీమా రుసుము వసూలు చేయవచ్చు.
* అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు, పీజీ కోర్సులు, డిప్లొమో, పోస్టు డిప్లొమో, పార్టు టైమ్, డ్యూయెల్ డిగ్రీ, సమీకృత ప్రోగ్రాముల ప్రకారం గరిష్ట ఫీజులను నిర్ణయించారు.
ఏపీలో గరిష్ట ఫీజు 1.05 లక్షలు
ఏఐసీటీఈ నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కాలేజీలకు నిర్వహణ వ్యయాలను అనుసరించి ఈ గరిష్ట ఫీజులను నిర్ణయించింది. రాష్ట్రంలో ఈ సిఫార్సులను అనుసరిస్తూనే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గరిష్ట ఫీజులను నిర్ణయించనున్నారు. ఈదిశగా రాష్ట్ర ప్రవేశాలు, పీజుల నియంత్రణ మండలి కసరత్తు చేస్తోంది. ఏపీలో ఇంజనీరింగ్ కోర్సులకు కనిష్టం రూ.30వేలనుంచి గరిష్ట ఫీజు రూ.1.05 లక్షల వరకు ఉంటుందని మండలి వర్గాలు వివరించాయి.
అంతకు ముందు సంవత్సరాల్లో కాలేజీల నిర్వహణకు అయిన వ్యయాలను అనుసరించి ఫీజులుండాలని కోర్టు చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాయి. రూ.లక్షకు మించి ఫీజులుండే కాలేజీలు నాలుగైదుకు లోపే ఉండనున్నాయి. తక్కినవన్నీ రూ.30వేల నుంచి 80వేల లోపే ఉండ వచ్చంటున్నారు. ఫీజులపై ఏఎఫ్‌ఆర్సీ ఈనెల 12 నుంచి 28వరకు ఆయా కాలేజీల వాదనలు విననుంది. మే రెండో వారంలో ఫీజులను నిర్థారించనుంది.
జాతీయ ఫీజుల కమిటీ నిర్ధారించిన ఆయా కోర్సుల గరిష్ట ఫీజులు
కోర్సు టైప్-ఎక్స్ నగరం టైప్-వై నగరం టైప్-జెడ్ నగరం
(ఫీజు/రూపాయల్లో) (ఫీజు/రూపాయల్లో) par (ఫీజు/రూపాయల్లో)
4 ఏళ్ల ఇంజనీరింగ్ డిగ్రీ 1,58,317 1,50,473 1,44,882
5 ఏళ్ల ఆర్కిటెక్చర్ డిగ్రీ 2,25,283 2,13,469 2,05,034
4ఏళ్ల టౌన్‌ప్లానింగ్ 2,25,582 2,13,768 2,05,333
5ఏళ్ల అప్లయిడ్ ఆర్ట్స్,క్రాఫ్ట్స్ 2,25,582 2,13,768 2,05,333
4 ఏళ్ల ఫార్మాస్యుటికల్ డిగ్రీ 1,55,125 1,47,250 1,41,628
పీజీ కోర్సులు..
ఎంఈ, ఎంటెక్ 2,51,361 2,39,953 2,31,361
ఎం ఆర్క్ 2,69,714 2,56,107 2,45,877
2ఏళ్ల టౌన్‌ప్లానింగ్ 2,69,714 2,56,107 2,45,877
2 ఏళ్ల అప్లయిడ్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్ 2,69,714 2,56,107 2,45,877
ఎం ఫార్మ్ 2,27,519 2,16,111 2,07,518
హోటల్‌మేనేజ్‌మెంటు, కేటరింగ్ 2,27,519 2,16,111 2,07,518
3ఏళ్ల ఎంసీఏ 1,71,137 2,16,111 2,07,518
2 ఏళ్ల ఎంబీఏ 1,71,286 1,63,410 1,57,787
ఈ ఫీజులకు సంబంధించి కమిటీ నివేదికలు, మార్గదర్శకాలను ఏపీలోనూ అమలు చేయడానికి వీలుగా తమకు వాటి కాపీలను అందించాలని ఏపీ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం ఏఐసీటీఈని కోరింది. ఈమేరకు సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎం.శాంతిరాముడు ఏఐసీటీఈ చైర్మన్‌కు లేఖ రాశారు.
ఇంజనీరింగ్‌లో ఏడాది గరిష్ట ఫీజు 1.58 లక్షలు
Published Fri, Apr 8 2016 6:12 AM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM
Advertisement