బియాస్ దుర్ఘటన నేపథ్యంలో...
న్యూఢిల్లీ: బియాస్ నదిలో 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతైన దుర్ఘటన నేపథ్యంలో విద్యార్థుల విజ్ఞాన యాత్రలకు మార్గదర్శకాలు రూపొందించాలని యూజీసీ, ఏఐసీటీఈలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. విద్యార్థుల భద్రతే లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలు ఉండాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభకు తెలిపారు.
బియాస్ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే స్పందించానని ఆమె చెప్పారు. సహాయక చర్యలు చేపట్టాలని హిమచల్ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా తమ మంత్రులను సంఘటనా స్థలానికి పంపాయని చెప్పారు. బాచుపల్లిలోని వీఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాలకు చెందిన 24 మంది జూన్ 8న హిమచల్ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతైయ్యారు. వీరిలో ముగ్గురు మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు.