సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులు జారీ చేసింది. కొన్ని కాలేజీలు స్వచ్ఛందంగా పూర్తిగా కోర్సులను రద్దు చేసుకోవడం, మరికొన్ని కాలేజీల్లో లోపాల కారణంగా కోర్సులను ఏఐసీటీఈ రద్దు చేయడంతో గతేడాది కంటే ఈసారి కాలేజీలు, సీట్లకు భారీగా కోత పడింది. దీంతో మొత్తంగా 8,887 సీట్లు రద్దయ్యాయి. గతేడాదితో పొల్చితే రాష్ట్రంలోని 27 కాలేజీల్లో బీటెక్ మొదటి ఏడాది ప్రవేశాలు చేపట్టే వీలు లేకుండాపోయింది. కొన్ని కాలేజీలు కొన్ని బ్రాంచీలను రద్దు చేసుకోగా, మరికొన్ని కాలేజీలు బ్రాంచీల్లో సీట్లను పెంచుకున్నాయి. ఎక్కువ కాలేజీలు పలు బ్రాంచీల్లో సీట్లను ఏకంగా రద్దు చేసుకున్నాయి. మొత్తానికి ఈసారి రాష్ట్రంలోని 201 కాలేజీల్లో 1,05,360 బీటెక్ సీట్లకు అనుమతులు జారీ చేసిన ఏఐసీటీఈ గతేడాది కంటే 8,887 సీట్లను తగ్గించింది.
ఈసారి యూనివర్సిటీలు ఇచ్చేవెన్నో..
గత విద్యా సంవత్సరం (2018–19)లో రాష్ట్రంలోని 228 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,14,247 సీట్లకు ఏఐసీటీఈ అనుమతులు ఇచ్చింది. అందులో లోపాల కారణంగా జేఎన్‌టీయూ, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ లు లోపాల కారణంగా భారీగా సీట్లకు కోత పెట్టాయి. కేవలం 95,235 వేల సీట్లకు అనుబంధ గుర్తింపును ఇచ్చాయి. దీంతో వాటిల్లోనే ప్రవేశాలు చేపట్టగా, అందులోనూ 67,937 వేల సీట్లే భర్తీ అయ్యాయి. ఇక 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఏఐసీటీఈ 201 కాలేజీల్లోని 1,05,360 సీట్ల భర్తీకి అనుమతులు ఇచ్చింది. అయితే అందులో యూనివర్సిటీలు ఎన్ని సీట్ల భర్తీకి అనుబంధ గుర్తింపును ఇస్తాయో తేలాల్సి ఉంది. గతేడాది 95,235 సీట్లకు పరిమితం చేసిన యూనివర్సిటీలు ఈసారి వాటిని 90 వేలకే పరిమితం చేసే పరిస్థితి కనిపిస్తోంది.
లోపాల సవరణకు ముగిసిన గడువు
రాష్ట్రంలోని దాదాపు 250 కాలేజీల్లో తనిఖీలు చేసిన జేఎన్‌టీయూ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు (ఎఫ్‌ఎఫ్‌సీ) వాటిని సవరించుకోవాలంటూ లేఖలు రాసింది. ఆ లోపాలను సవరించుకునే గడువు శనివారంతో ముగిసిపోవడంతో వాటిపై మరోసారి కాలేజీలతో చర్చించి అనుబంధ గుర్తింపును జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. మరోవైపు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు కూడా ఇదే పనిలో ఉన్నాయి. ఈనెల 9వ తేదీతో ఎంసెట్ ప్రవేశ పరీక్షలు ముగిశాయి. శుక్రవారం వాటికి సంబంధించి కీలను ఎంసెట్ కమిటీ విడుదల చేసింది. ఈనెల 13 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తోంది. వీలైతే వచ్చే వారంలో ఎంసెట్ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఇంటర్మీడియెట్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలను కూడా ఈనెల 15 నాటికి విడుదల చేసే అవకాశం ఉండటంతో ఈలోగా ఎంసెట్ వ్యాల్యుయేషన్ పూర్తి చేసి సిద్ధంగా ఉండాలన్న ఆలోచన చేస్తోంది. వీలైతే వచ్చే వారం, లేదా ఈనెల 25 నాటికి ఎంసెట్ ఫలితాలను వెల్లడించనుంది. అలాగే కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను కూడా ఈనెలాఖరులోగా పూర్తి చేయాలన్న ఆలోచనల్లో ఉన్నాయి. ఆ ప్రక్రియ పూర్తయితే జూన్ మొదటి వారం/రెండో వారంలో ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.
కొత్త కోర్సులకు ఓకే చెప్పిన ఏఐసీటీఈ
మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కొత్త కోర్సులకు ఈసారి ఏఐసీటీఈ అనుమతులను ఇచ్చింది. కంప్యూటర్ ఇంజనీరింగ్, ఆర్టిషీయల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సు లకు అనుమతులు ఇస్తామని ఏఐసీటీఈ తమ అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్‌బుక్‌లోనే స్పష్టం చేయడంతో రాష్ట్రంలోని పలు కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. దీంతో ఏఐసీటీఈ వాటికి అనుమతి ఇచ్చింది. అయితే యూనివర్సిటీలు ఆయా కోర్సుల నిర్వహణకు అనుమతి ఇస్తాయా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. వాటి నిర్వహణకు అవసరమైన సిలబస్, స్కీం, ఫ్యాకల్టీ సరిపడ ఉన్నారా? లేదా? ఎలా నిర్వహిస్తారు? అన్న అంశాలను యూనివర్సిటీలు పరిశీలించాకే తమ బోర్డ్ స్టడీస్ సమావేశంలో చర్చించాక నిర్వహణకు ఓకే చెప్పాలా? వద్దా? అన్నది తేల్చనున్నాయి.
పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ సీట్లకు కోత
పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ ఈసారి కాలేజీలకు, సీట్లకు ఏఐసీటీఈ కోత పెట్టింది. ఈనెల 14వ తేదీ నుంచి పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సెలింగ్ చేపట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఏఐసీటీఈ అనుమతుల జాబితాలను క్రోడీకరించింది. 2019–20 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 162 కాలేజీలకు, వాటిల్లోని 42,100 సీట్లకు ఆమోదం తెలిపింది. గతేడాది రాష్ట్రంలోని 187 కాలేజీల్లోని 47,264 సీట్లకు అనుమతులు ఇచ్చిన ఏఐసీటీఈ ఈసారి 25 కాలేజీలకు, 5164 సీట్లకు కోత విధించింది.
Comments
Please login to add a commentAdd a comment