మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల కొరత కారణంగా వృత్తి విద్యా కోర్సులు వెలవెలబోతున్నాయి. ఇంజనీరింగ్ ఫార్మసీ వంటి కోర్సుల్లో ఏటా సగం వరకు సీట్లు మిగిలిపోతున్నాయి. అనుమతుల సమయంలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), అనుబంధ గుర్తింపు ఇచ్చేటప్పుడు యూనివర్సిటీలు పట్టించుకోని కారణంగా నాణ్యతా ప్రమాణాలు పాటించని కాలేజీల్లో సీట్లు కుప్పలుతెప్పలుగా పెరిగాయి. దీంతో మెరుగైన బోధన అందక విద్యార్థులకు ఉపాధి అవకాశాలు దూరమవుతున్నాయి. ఇంజనీరింగ్ చేసిన వారిలో 69 శాతం మందికి ఉపాధి దొరకడం లేదు. గత ఐదారేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో తల్లిదండ్రులు ఉపాధి అవకాశాలు కల్పించే కాలేజీలపైనే దృష్టి పెడుతున్నారు. ఆర్థికంగా కష్టమైనా ప్లేస్‌మెంట్స్ ఉన్న కాలేజీల్లో.. మేనేజ్‌మెంట్ కోటాలోనూ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా ఏటా ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల సంఖ్య తగ్గిపోతోంది.