![Longer internships in Khadi Village Industries - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/6/aicte.jpg.webp?itok=nKMd9uvR)
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ విద్యనభ్యసించే వారికి నైపుణ్యాలు అలవర్చడంతో పాటు వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) ఆధ్వర్యంలో ఇంటర్న్‌షిప్‌ను అందించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కేవీఐసీతో ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ విభాగంలోని తమకు నచ్చిన అంశంలో ఇంటర్న్‌షిప్ చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోని ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కార్యాలయాలతో ఆయా ఉన్నత విద్యాసంస్థలు ఇంటర్న్‌షిప్ కోసం సంప్రదించవచ్చని ఏఐసీటీఈ ఆయా సంస్థలకు సూచించింది.
ఈ మేరకు కమిషన్ వెబ్‌సైట్లో సర్క్యులర్ పొందుపరిచింది. కేవీఐసీలో ఏయే అంశాల్లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు అవకాశముందో వాటి వివరాలను ఏఐసీటీఈ వెబ్‌సైట్లో పొందుపర్చనున్నట్లు వివరించింది. ఈ ఇంటర్న్‌షిప్ ఆయా అంశాలకు సంబంధించి వేర్వేరు కాలవ్యవధులను నిర్ణయించనున్నారు. ఇంటర్న్‌షిప్ కాలంలో ప్రతి విద్యార్థికీ నెలకు రూ.5వేలు చొప్పున ఉపకార వేతనాన్ని అందించనున్నారు. ఇదేకాక ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ విభాగం వివిధ పథకాలకు సంబంధించిన పరిశోధనా ప్రాజెక్టులను కూడా ఏర్పాటుచేయబోతోందని ఏఐసీటీఈ పేర్కొంది. ఈ ప్రాజెక్టులకూ స్కాలర్‌షిప్‌ను అందించనున్నారు.
విద్యార్థులకు ఎంతో మేలు
ఇక ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్‌తో భాగస్వామ్యం ద్వారా విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుందని ఏఐసీటీఈ అభిప్రాయపడింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్‌తో అనుసంధానమై విద్యార్థులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ ఒప్పందం ఉపకరిస్తుందని పేర్కొంది. కేవీఐసీలోని అనేక స్కీముల ద్వారా విద్యార్థులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆస్కారముంటుందని, ఇది దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని వివరించింది. ఉద్యోగులుగా కాకుండా పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలుగా వారే ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగగలుగుతారని అభిప్రాయపడింది. మార్కెటింగ్, తయారీ అంశాలపై విద్యార్థులు నైపుణ్యాలను అలవర్చుకునేలా ఈ ఇంటర్న్‌షిప్ ఉంటుందని ఏఐసీటీఈ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment