Khadi Village Industries Commission
-
ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్‌లో ఇక ఇంటర్న్‌షిప్‌లు
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ విద్యనభ్యసించే వారికి నైపుణ్యాలు అలవర్చడంతో పాటు వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) ఆధ్వర్యంలో ఇంటర్న్‌షిప్‌ను అందించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కేవీఐసీతో ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ విభాగంలోని తమకు నచ్చిన అంశంలో ఇంటర్న్‌షిప్ చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోని ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కార్యాలయాలతో ఆయా ఉన్నత విద్యాసంస్థలు ఇంటర్న్‌షిప్ కోసం సంప్రదించవచ్చని ఏఐసీటీఈ ఆయా సంస్థలకు సూచించింది. ఈ మేరకు కమిషన్ వెబ్సైట్లో సర్క్యులర్ పొందుపరిచింది. కేవీఐసీలో ఏయే అంశాల్లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు అవకాశముందో వాటి వివరాలను ఏఐసీటీఈ వెబ్సైట్లో పొందుపర్చనున్నట్లు వివరించింది. ఈ ఇంటర్న్‌షిప్ ఆయా అంశాలకు సంబంధించి వేర్వేరు కాలవ్యవధులను నిర్ణయించనున్నారు. ఇంటర్న్‌షిప్ కాలంలో ప్రతి విద్యార్థికీ నెలకు రూ.5వేలు చొప్పున ఉపకార వేతనాన్ని అందించనున్నారు. ఇదేకాక ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ విభాగం వివిధ పథకాలకు సంబంధించిన పరిశోధనా ప్రాజెక్టులను కూడా ఏర్పాటుచేయబోతోందని ఏఐసీటీఈ పేర్కొంది. ఈ ప్రాజెక్టులకూ స్కాలర్షిప్ను అందించనున్నారు. విద్యార్థులకు ఎంతో మేలు ఇక ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్‌తో భాగస్వామ్యం ద్వారా విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుందని ఏఐసీటీఈ అభిప్రాయపడింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్‌తో అనుసంధానమై విద్యార్థులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ ఒప్పందం ఉపకరిస్తుందని పేర్కొంది. కేవీఐసీలోని అనేక స్కీముల ద్వారా విద్యార్థులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆస్కారముంటుందని, ఇది దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని వివరించింది. ఉద్యోగులుగా కాకుండా పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలుగా వారే ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగగలుగుతారని అభిప్రాయపడింది. మార్కెటింగ్, తయారీ అంశాలపై విద్యార్థులు నైపుణ్యాలను అలవర్చుకునేలా ఈ ఇంటర్న్‌షిప్ ఉంటుందని ఏఐసీటీఈ వివరించింది. -
ఖాదీ బ్రాండ్‌కు బలం, ఆ మూడు దేశాల్లో..
న్యూఢిల్లీ: ఖద్దరు మీద పూర్తి పేటెంట్ హక్కులు మన దేశానివే. అందుకే ‘ఖాదీ’ అనే బ్రాండ్‌ను పరిరక్షించే పనిని బాధ్యతగా తీసుకుంది ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్(కేవీఐసీ). ఇతర దేశాల్లో ఖాదీ ఉత్పత్తుల అమ్మకానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా మూడు దేశాలు ఖాదీ ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ పరిధిలోకి వచ్చాయి. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో కేవీఐసీ పూర్తి వివరాలను తెలిపింది. భూటాన్, యూఏఈ తోపాటు మెక్సికో దేశాలు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు పేర్కొంది. అంతేకాదు మరో నలభై దేశాల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. అమెరికాతో పాటు ఖతర్, శ్రీలంక, ఇటలీ, జపాన్, న్యూజిల్యాండ్, సింగపూర్, బ్రెజిల్ సహా మరికొన్ని దేశాలు ట్రేడ్‌మార్క్ కోసం ఎదురు చూస్తున్నాయని కేవీఐసీ చైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా వెల్లడించారు. ఖాదీ గుర్తింపు, గ్లోబల్ పాపులారిటీని కాపాడే ప్రయత్నంలో భాగంగానే ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్లను తప్పనిసరి చేసింది కేవీఐసీ. ఇందులో భాగంగానే ఈ జూన్ 28న యూఏఈకి, జులై 9న భూటాన్‌లకు ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసింది. ఈ రెండుదేశాల కంటే ముందు పోయిన డిసెంబర్లోనే మెక్సికో ఖాదీ ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్‌తో అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ లేకపోతే.. ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలకు అనుమతి లేనట్లే. ఇంతకు ముందు జర్మనీ, యూకే, చైనా, రష్యా, ఆస్ట్రేలియా, ఈయూ దేశాలకు అనుమతి దొరికాయి. తాజాగా మూడు దేశాల అనుమతులతో ఆ సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. దీంతో ఆయా దేశాలు ఖాదీ ఫ్యాబ్రిక్, ఖాదీ రెడిమేడ్ గార్మెంట్స్, ఖాదీ సోప్‌లు, ఖాదీ కాస్మటిక్స్, అగరవత్తులు ఖాదీ ఉత్పత్తుల అమ్మకానికి గ్రీన్ సిగ్నల్ దొరికినట్లయ్యింది. -
ఉత్తరాంధ్రకు భరోసా ‘పీఎం ఉపాధి కల్పన’
విజయనగరం అర్బన్: ఉత్తరాంధ్ర జిల్లాలలోని నిరుద్యోగ యువతకు ప్రధాన మంత్రి (పీఎం) ఉపాధి కల్పన పథకం భరోసాగా నిలుస్తుందని ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్(కేవీఐసీ) దక్షిణ భారత సభ్యుడు జి.చంద్రమౌళి అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా విజయనగరం పట్టణానికి మంగళవారం వచ్చిన ఆయన స్థానిక జిల్లా పరిషత్ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. కేవీఐసీ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమాన్ని దక్షిణ భారతదేశ మంతటా నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో 180కి పైగా లఘుపరిశ్రమలు ఉన్నాయని, దీని ద్వారా పారిశ్రామికంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ది చెందుతుందని చెప్పారు. నిరుద్యోగ యువత ఖాదీ విలేజ్ పరిశ్రమ కమిషన్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఆయనను బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బవిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు, జిల్లా ఉపాధ్యక్షుడు కుసుమంచి సుబ్బారావు, జిల్లా మువమోర్చా అధ్యక్షుడు మంత్రిప్రగడ విద్యాస్వరూప్, కార్యాలయ కార్యదర్శి రామచంద్రరావు, మైనార్జీ మోర్చా జిల్లా అధ్యక్షుడు షేక్షలీమ్బాషా తదితరులు సత్కరించారు.