సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలు, సీట్లకు కోత పడింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) గుర్తింపు ఇచ్చిన వాటిల్లోనే 23 కాలేజీలతోపాటు 7,199 సీట్లు తగ్గిపోయాయి. రాష్ట్రంలోని 168 పాలిటెక్నిక్ కాలేజీల్లో 42,100 సీట్లకు ఏఐసీటీఈ ఇటీవల అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అందులో కొన్ని కాలేజీలు సీట్లను తగ్గించుకోగా, కొన్ని కాలేజీలు ప్రవేశాలకు ముందుకు రాలేదు.
మరికొన్ని కాలేజీల్లో లోపాల కారణంగా రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. ఇలా 23 కాలేజీలు, 7,199 సీట్లకు కోత పడింది. ఈసారి ప్రవేశాల కౌన్సెలింగ్‌లో 145 కాలేజీల్లో 34,901 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ వెల్లడించారు. శుక్రవారం ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించామని తెలిపారు. దీంతో 12,511 మంది విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించారని, అందులో 12,303 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్లను బుక్ చేసుకున్నట్లు ఆయన వివరించారు.
24 వరకు ప్రాధాన్యక్రమంలో ఆప్షన్లు..
ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని బి.శ్రీనివాస్ పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు ఈనెల 24 వరకు ప్రాధాన్య క్రమంలో కాలేజీలకు ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి ఈనెల 27న సీట్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఎన్‌సీసీ, వికలాంగులు, సాయుధ దళాల కుటుంబాలకు చెందిన పిల్లలు/ఆంగ్లో ఇండియన్ కుటుంబాలకు చెందిన పిల్లలు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్‌లో మాసాబ్‌ట్యాంకులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఎంచుకోవాలని పేర్కొన్నారు.
కులీకుతుబ్ షాహి అర్బన్ డెవలప్‌మెంట్ ప్రాంతం లోని విద్యార్థులు అక్కడి క్యూక్యూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్న సీట్లను ఎంచుకోవచ్చని, అయితే వారు తమ రేషన్‌కార్డు జిరాక్స్ కాపీ తప్పక సబ్మిట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అక్కడి విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు స్లాట్ బుకింగ్‌లో క్యూక్యూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఎంచుకోవాలని పేర్కొన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం వెళ్లే విద్యార్థులు వెంట తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్ల వివరాలను తమ వెబ్‌సైట్‌లో (https://tspolycet. nic.in) చూడొచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment