సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్ సహా వివిధ సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల ప్రవేశాలను గతంలో మాదిరిగానే యథాతథంగా నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. పాత విధానంలోనే ఏపీ ఎంసెట్–2021ను నిర్వహించనుంది. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఇటీవల అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కొత్త నిబంధనలను పేర్కొంటూ 2021–22 అప్రూవల్ హ్యాండ్‌బుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇంజనీరింగ్ చదవాలంటే ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరిగా చదివి ఉండాలి. ఈ మూడు సబ్జెక్టులు చదవని ఇతర గ్రూపుల ఇంటర్ విద్యార్థులకూ ఇంజనీరింగ్ కోర్సుల్లోకి ప్రవేశాలు కల్పించేలా ఏఐసీటీఈ ఇటీవల నిబంధనలను విడుదల చేసింది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు అవసరమయ్యే కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఈసీఈ, సివిల్ ఇంజనీరింగ్ వంటి కోర్సులకు ఆ సబ్జెక్టులను తప్పనిసరి చేస్తూనే ఇతర కోర్సులకు ఇతర గ్రూపుల విద్యార్థులను అనుమతించాలని సూచించింది. ఇందుకు 14 ఆప్షనల్ సబ్జెక్టులను పేర్కొంటూ వీటిలో ఏ మూడింటి కాంబినేషన్‌తో ఇంటర్ చదివినా ఇంజనీరింగ్ కోర్సుల్లోకి అనుమతించవచ్చని తెలిపింది. అయితే అంతిమంగా ఈ నిబంధనలను అనుసరించడంపై నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాల ఇష్టానికే వదిలేసింది.
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతోనే ఎంసెట్–2021
ఈ నేపథ్యంలో గతంలోని నిబంధనల ప్రకారమే ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. 2021–22 అప్రూవల్ హ్యాండ్‌బుక్‌లో ఏఐసీటీఈ పొందుపరిచిన వివిధ సబ్జెక్టుల కాంబినేషన్లు రాష్ట్రంలో లేకపోవడంతో పాత పద్ధతిలోనే అంటే.. ఇంటర్ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)తోనే ఇంజనీరింగ్‌లో అడ్మిషన్లు ఇవ్వనుంది. ఏపీ ఎంసెట్–2021లో కూడా ఇవే సబ్జెక్టులు ఉంటాయి. అయితే విద్యార్థులు ఇంటర్‌లో 45 శాతం (రిజర్వుడ్ కేటగిరీలకు 40 శాతం) మార్కులు సాధించి ఉండాలి. కరోనా నేపథ్యంలో ఇంటర్ తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎంసెట్‌లో కూడా సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించనున్నారు. ఏయే అంశాలపై బోధన జరిగిందో అవే అంశాల పరిధిలో ప్రశ్నలుండేలా ఉన్నత విద్యామండలి జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఎంసెట్ నిర్వహణ బాధ్యత జేఎన్‌టీయూ–కాకినాడకే..
ఏపీ ఎంసెట్–2021 నిర్వహణ బాధ్యతను ఈసారి కూడా కాకినాడ జేఎన్‌టీయూకే అప్పగిస్తున్నారు. ఇప్పటికే వివిధ సెట్ల నిర్వహణ సంస్థలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఎంసెట్–2021 నిర్వహణ కమిటీ చైర్మన్‌గా జేఎన్‌టీయూకే వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.రామలింగరాజు వ్యవహరించనున్నారు. కన్వీనర్‌గా ప్రొఫెసర్ వి.రవీంద్ర ఉంటారు. ఎంసెట్‌ను కంప్యూటరాధారితంగా నిర్వహించనున్న నేపథ్యంలో ఐటీ సంస్థ ఎంపికపై ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి నివేదిక పంపింది. ప్రభుత్వ ఆమోదం రాగానే ఎంసెట్ సహా ఇతర సెట్ల షెడ్యూళ్లపై తదుపరి చర్యలు ప్రారంభించనుంది. కరోనా వల్ల గతేడాది ప్రవేశాలు ఆలస్యమైన నేపథ్యంలో ఈసారి కొంతముందుగానే పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నారు.
పాత విధానంలోనే ఎంసెట్
– ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి
ఇంజనీరింగ్ కోర్సులపై ఏఐసీటీఈ.. 2021–22 విద్యా సంవత్సరపు అప్రూవల్ హ్యాండ్‌బుక్‌లో కొన్ని కొత్త నిబంధనలు చేర్చినా వాటి అమలుపై రాష్ట్రాలకు వెసులుబాటు ఉంటుందని చెబుతోంది. కాబట్టి ఏపీ ఎంసెట్‌ను పాత విధానంలోనే నిర్వహిస్తాం. ఏఐసీటీఈ 14 సబ్జెక్టులతో ఆప్షన్లు పెట్టినా ఆ సబ్జెక్టులతో స్పెషల్ బ్రాంచ్‌ల కాంబినేషన్లు మన రాష్ట్రంలో లేవు. బీటెక్ బయోటెక్నాలజీలోకి ఇంటర్మీడియెట్ బైపీసీ విద్యార్థులను అనుమతిస్తున్నాం. ఆ విద్యార్థులకు మ్యాథ్స్‌లో బ్రిడ్జి కోర్సులు ప్రవేశపెట్టాం. కోవిడ్‌తో ఇంటర్ సిలబస్‌ను తగ్గించినందున ఎంసెట్‌ను కుదించిన సిలబస్ మేరకే నిర్వహిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment