సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో విద్యార్థుల ప్రవేశాలు, కాలేజీల గుర్తింపునకు సంబంధించి కొత్త నిబంధనలు వెలువడ్డాయి. ఇప్పటివరకు ఉన్న నిబంధనలను సవరిస్తూ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) నూతన మార్గదర్శకాలను ఖరారు చేసింది. శనివారం ఈ మేరకు అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్‌బుక్‌ను విడుదల చేసింది. ఏఐసీటీఈ వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచింది. కొత్తగా జారీ చేసిన నిబంధనలు 2018–19 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేటు యూనివర్సిటీలకు ఏఐసీటీఈ గుర్తింపు తప్పనిసరి. కొత్తగా విద్యా సంస్థ అనుమతికి సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజును అదనంగా రూ.లక్ష పెంచింది.
విద్యా సంస్థ క్యాంపస్ విస్తీర్ణాన్ని పట్టణ ప్రాంతాల్లో 2.5 ఎకరాల నుంచి 1.5 ఎకరాలకు, గ్రామీణ ప్రాంతాల్లో 7.5 ఎకరాల నుంచి 4 ఎకరాలకు కుదించింది. ప్రస్తుతం ఇంజనీరింగ్, హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులకు సంబంధించి యూజీ స్థాయిలో ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండాలనే నిబంధన ఉంది. తాజాగా ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండేలా 1:20 నిష్పత్తిగా నిబంధనను సవరించింది. పీజీ స్థాయిలో ఫార్మసీలో 1:10 నుంచి 1:5గా ఫ్యాకల్టీ ని నిర్ధారించింది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 1:15 నుంచి 1:20గా నిర్దేశించింది. దీంతో కాలేజీల్లో ఫ్యాకల్టీ తగ్గే అవకాశం ఉంది. ఇది యాజమాన్యాలకు కొంత ఊరట కలిగించే అంశం. డిప్లొమాలోని అన్ని కోర్సుల్లో ప్రతి 20 మందికి ఒక ఫ్యాకల్టీ ఉండగా.. ఆ నిష్పత్తిని 1:25గా ఏఐసీటీఈ సవరించింది.
ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు కూడా ఇండక్షన్ ట్రైనింగ్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో కనీసం 48 ఎంబీపీఎస్ స్పీడ్‌తో కూడిన ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని సూచించింది. గతంలో 16 ఎంబీపీఎస్, 32 ఎంబీపీఎస్ స్పీడుతో అవకాశం ఇవ్వగా దాన్ని పెంచింది. దీంతో విద్యార్థులు ప్రాజెక్టు వర్క్‌ను వీలైనంత వేగంగా చేసుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థుల సంఖ్య పెరిగితే ఇంటర్నెట్ వేగాన్ని సైతం పెంచాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment