Andhra Pradesh: APEAP Set Counselling Dates Announced - Sakshi
Sakshi News home page

25 నుంచి ఏపీఈఏపీ సెట్‌ కౌన్సెలింగ్‌

Published Fri, Oct 22 2021 4:34 AM | Last Updated on Fri, Oct 22 2021 11:08 AM

APEAP Set Counseling from 25th October - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌–2021 అడ్మిషన్ల వెబ్‌ కౌన్సెలింగ్‌ ఈ నెల 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు గురువారం విజయవాడలో కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 26 నుంచి 31 వరకు జరుగుతుందన్నారు. నవంబర్‌ 1 నుంచి 5 వరకు విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అదే నెల 10న సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు.

నవంబర్‌ 15 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. వెబ్‌ కౌన్సెలింగ్‌కు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన ఆన్‌లైన్‌లో జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియలో ఆటంకాలు ఎదురైతే రాష్ట్రవ్యాప్తంగా 25 హెల్ప్‌లైన్‌ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఏపీ ఈఏపీసెట్‌కు 1,66,460 మంది హాజరు కాగా 1,34,205 మంది అడ్మిషన్లకు అర్హత సాధించారని చెప్పారు. అడ్మిషన్ల వెబ్‌ కౌన్సెలింగ్‌ వివరాల కోసం https:// sche. ap. gov. in చూడొచ్చన్నారు. 

409 కళాశాలల్లో 1,39,862 సీట్లు
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతించిన ఇన్‌టేక్‌ ప్రకారం.. రాష్ట్రంలో 409 కళాశాలల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫార్మాడీ కోర్సుల్లో 1,39,862 సీట్లు ఉన్నాయని మంత్రి సురేష్‌ వివరించారు. అయితే వీటిలో యూనివర్సిటీల గుర్తింపు పొందినవాటికే సీట్లు కేటాయిస్తామన్నారు. ఇప్పటివరకు అఫ్లియేషన్‌ ప్రక్రియ పూర్తయిన కళాశాలలు 337 ఉన్నాయని తెలిపారు. ఇందులో 81,597 సీట్లు ఉన్నాయని చెప్పారు. వర్సిటీలకు ఫీజులు బకాయిపడిన 91 ఇంజనీరింగ్‌ కాలేజీలు, 21 ఫార్మసీ కాలేజీలకు ఇంకా అఫ్లియేషన్‌ పూర్తి కాలేదన్నారు. ఇవి అఫ్లియేషన్‌ పొందితే వెంటనే వాటిలోని సీట్లను కూడా కౌన్సెలింగ్‌లో చేర్చుతామని తెలిపారు.

వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ప్రైవేటు వర్సిటీల్లో సీట్ల భర్తీ
ఈసారి తొలిసారిగా ప్రైవేటు యూనివర్సిటీల్లోని బీఈ, బీటెక్‌ తదితర కోర్సుల్లో 35 శాతం సీట్లను కూడా రిజర్వేషన్లు, మెరిట్‌ ప్రకారం భర్తీ చేస్తామని మంత్రి సురేష్‌ తెలిపారు. వీఐటీ, ఎస్‌ఆర్‌ఎం, సెంచూరియన్, బెస్ట్‌ ఇన్నోవేషన్‌ యూనివర్సిటీల్లోని సీట్లను వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా కన్వీనర్‌ కోటాలో భర్తీ చేస్తామన్నారు. విద్యార్థులు సందేహాల నివృత్తికి "convenerapeapcet 2021@ gmail.com' కు లేదా 8106876345, 8106575234, 7995865456లలో సంప్రదించాలని సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement