రాష్ట్రంలో మిగిలే ఇంజనీరింగ్‌ సీట్లు 80 వేలే! | over 25K engineering seats to be reduced in Telangana | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో మిగిలే ఇంజనీరింగ్‌ సీట్లు 80 వేలే!

Published Thu, Feb 15 2018 3:56 AM | Last Updated on Thu, Feb 15 2018 8:15 AM

over 25K engineering seats to be reduced in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ఇంజనీరింగ్‌ సీట్ల సంఖ్య మరోసారి భారీగా తగ్గనుంది. ఈ ఏడాది ఏకంగా 25 వేల సీట్లకు కోతపడనుంది. ఈసారి మొత్తంగా అందుబాటులో ఉండే ఇంజనీరింగ్‌ సీట్ల సంఖ్య 75 వేల నుంచి 80 వేల వరకే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. వరుసగా మూడేళ్ల పాటు 25 శాతం కంటే తక్కువ సీట్లు భర్తీ అయిన బ్రాంచీలను రద్దు చేస్తామని జేఎన్టీయూ ఇటీవలే స్పష్టం చేయడం, యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని వివరించిన నేపథ్యంలో సీట్ల కోత కచ్చితమేనని స్పష్టమవుతోంది.

సీట్లు నిండకపోవడంతో..
ప్రస్తుత విద్యా సంవత్సరం (2017–18)లో రాష్ట్రంలోని 212 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 1.04 లక్షల సీట్ల భర్తీకి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చింది. కానీ జేఎన్టీయూ సహా యూనివర్సిటీలు 97,961 సీట్లకు మాత్రమే అనుబంధ గుర్తింçపు ఇచ్చాయి. అయితే అనుమతించిన వాటిల్లోనూ పెద్ద సంఖ్యలో సీట్లు మిగిలిపోయాయి. చాలా కాలేజీల్లోని పలు బ్రాంచీల్లో 25 శాతం కన్నా తక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. తాజాగా అలాంటి బ్రాంచీలను రద్దు చేయనున్నారు.

112 కాలేజీల్లోని సీట్లు..
గతేడాది రాష్ట్రంలోని 112 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఉన్న పలు బ్రాంచీల్లో అతి తక్కువగా సీట్లు భర్తీ అయ్యాయి. ఈ బ్రాంచీల్లో 41,628 సీట్లు అందుబాటులో ఉండగా.. 2,874 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ 109 కాలేజీల్లోని పలు బ్రాంచీల్లో 47,640 సీట్లుండగా.. 5,687 మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ బ్రాంచీలన్నీ 30శాతం లోపు సీట్ల భర్తీ ఉన్నవే.

ఏఐసీటీఈ కూడా..
వరుసగా మూడేళ్ల పాటు 30 శాతంలోపు సీట్లు భర్తీ అయిన బ్రాంచీలను రద్దు చేస్తామని ఏఐసీటీఈ ఇప్పటికే కాలేజీలకు స్పష్టం చేసింది. ఈ లెక్కన రాష్ట్రంలో 41,628 ఇంజనీరింగ్‌ సీట్లు రద్దవుతాయి. అయితే ప్రస్తుతానికి అలాంటి బ్రాంచీల్లోని 50శాతం సీట్లకు కోత వేస్తామని ఏఐసీటీఈ ప్రకటించింది. కానీ రాష్ట్రంలో జేఎన్టీయూ మాత్రం 30 శాతం కాకుండా 25 శాతంలోపు సీట్ల భర్తీని పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఇలా 25 శాతంలోపు సీట్లు భర్తీ అయిన బ్రాంచీలను రద్దు చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో 41,628 సీట్లు కాకపోయినా 25వేల సీట్ల వరకు కోత తప్పదని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇతర వృత్తి విద్యా కోర్సుల్లోనూ..
రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లోనే కాదు ఇతర వృత్తి విద్యా కోర్సుల్లోనూ సీట్లకు కోత పడనుంది. మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఫ్యాకల్టీ కొరత వంటి కారణాలతో చాలా కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు సరిగా ఉండడం లేదు. అలాంటి కాలేజీల్లో చదివితే ప్రయోజనం ఉండదన్న ఉద్దేశంతో విద్యార్థులు మంచి విద్యాసంస్థల వైపే మొగ్గుతున్నారు. దీంతో చాలా కాలేజీల్లో సీట్లు భర్తీ కావడం లేదు. ఫలితంగా గత మూడేళ్లలో 242 కాలేజీలు రద్దు కాగా.. 53,163 సీట్లకు కోత పడింది.
2015లో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ కోర్సుల్లో 2,05,640 సీట్లు అందుబాటులో ఉండగా.. 2017 ప్రవేశాల నాటికి ఈ సంఖ్య 1,52,476కు తగ్గింది. ఇందులోనూ భర్తీ అయిన సీట్లు 1,15,420 మాత్రమే.
ప్రధానంగా ఇంజనీరింగ్‌లోనే అత్యధిక సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నాయి. గతేడాది కూడా ప్రవేశాలకు ఆమోదం పొందిన సీట్లలో 29,367 సీట్లు మిగిలిపోయాయి. ఈ పరిస్థితుల్లో 25 శాతం భర్తీ నిబంధనతో 25 వేల సీట్లకు కోతపడే అవకాశముంది.
ఇంజనీరింగ్‌ ప్రవేశాల విషయంలో దేశవ్యాప్తంగా ఇదే తరహా పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా 3,325 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 16.3 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా.. ఏటా 8.5 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి.

వచ్చే మూడేళ్లను పరిగణనలోకి తీసుకోవాలి
‘‘బ్రాంచీల రద్దు విషయంలో గడిచిన మూడేళ్ల ప్రవేశాలను కాకుండా వచ్చే మూడేళ్లలో ప్రవేశాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సూచించాం. ఆ నిబంధనపై పునః పరిశీలన చేయాలని కోరాం. అనుబంధ గుర్తింపు కోసం ఈ నెల 19వరకు దరఖాస్తు చేసుకునే వీలుంది. ఆ తర్వాత ఈ అంశంపై స్పష్టత వస్తుంది..’’ – గౌతంరావు, కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement