
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ఇప్పటివరకు కల్పిస్తున్న సీట్లను (లేటరల్ ఎంట్రీ) అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కుదించింది. 20% ఉన్న లేటరల్ ఎంట్రీ సీట్లను 10 శాతానికే పరిమితం చేయాలని స్పష్టం చేసింది. 2019–20 విద్యా సంవత్సరం ప్రవేశాల్లో దీన్ని అమలు చేయాలని ఇటీవల ఏఐసీటీఈ జారీ చేసిన ఇంజనీరింగ్ కాలేజీల అప్రూవల్ హ్యాండ్ బుక్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దీంతో ఈ సారి డిప్లొమా విద్యార్థులకు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో లభించే ఇంజనీరింగ్ సీట్లు 10 వేలు తగ్గనున్నాయి.
ఈ–సెట్‌లో అర్హత సాధించిన వారికి ర్యాంకును బట్టి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 20% (ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో 10% సీట్లు) సీట్లలో ప్రవేశాలు కల్పిస్తోంది. దాదాపు 20 వేల సీట్లు లభిస్తున్నాయి. ఏఐసీటీఈ తాజాగా నిబంధనల ప్రకారం ఆ సీట్లు 10 వేలకే పరిమితం కానున్నాయి. డిప్లొమా విద్యార్థులకు రావాల్సిన మరో 10 వేల సీట్లకు కోత పడనుంది. 2011 వరకు రాష్ట్రంలో లేటరల్ ఎంట్రీ సీట్లు 10 శాతమే ఉండేవి. 2012లో ఏఐసీటీఈ 20 శాతానికి పెంచడంతో ప్రభుత్వం ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసి, మంజూరైన ఇన్‌టేక్‌కు అదనంగా 20% సీట్లలో డిప్లొమా పూర్తయిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తోంది. కాగా, విదేశీ విద్యార్థుల కోసం సృష్టించే సూపర్ న్యూమరరీ సీట్లు 5% కలుపుకొని లేటరల్ ఎంట్రీ కోటా 15 శాతానికి మించొద్దని స్పష్టం చేసింది. దానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపేం దుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది.
విద్యార్థుల సంఖ్య పెరుగుతోందనే..
బీటెక్‌లో ఒక్కో బ్రాంచి సెక్షన్‌లో 60 మంది విద్యార్థులకు అనుమతి ఉంది. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్స రం వచ్చే సరికి లేటరల్ ఎంట్రీ ద్వారా ఒక్కో బ్రాంచికి 12 మంది అదనంగా వస్తున్నారు. వీటికి అదనంగా జమ్మూ, కశ్మీర్ వంటి ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు సీట్లిచ్చేలా ఏఐసీటీఈ ఆదేశాలు జారీ చేస్తోంది. దీని ద్వారా మరో నలుగురైదుగురు విద్యార్థులు వస్తున్నారు. వీటికి అదనంగా విదేశీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 10% సూపర్ న్యూమరరీ సీట్లు సృష్టించి ప్రవేశాలు కల్పించాలని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా వచ్చే వారే కాకుండా లేటరల్ ఎంట్రీలో మరో 5% మంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉంది. దీంతో విద్యార్థుల సంఖ్య క్లాస్ రూమ్ నిబంధనలను మించిపోతోంది. ఈ నేపథ్యంలో లేటరల్ ఎంట్రీ విద్యార్థుల సంఖ్యను కుదించినట్లు ఉన్నత విద్యా శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment