‘ఇంజనీరింగ్’కు జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష!
నిర్ణయం తీసుకున్న ఏఐసీటీఈ ∙గెజిట్ నోటిఫికేషన్ అనంతరం అమల్లోకి..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కోర్సులకు ఒకే పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్ణయం తీసుకుంది. 2018–19 విద్యా సంవత్సరం నుంచి ఒకే ప్రవేశ పరీక్షను అమల్లోకి తేవాలని మంగళవారం ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదిం చినట్లు తెలిసింది.
ప్రస్తుతం ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల విధానం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంది. కొన్ని రాష్ట్రాలు జేఈఈ మెయిన్ ద్వారానే ప్రవేశాలు చేపడుతుండగా, కొన్ని రాష్ట్రాలు సొంతంగా పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ ద్వారా ప్రవేశాలు జరుగుతున్నాయి. ఇక జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఇతర కేంద్ర ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యా సంస్థలు జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు చేపడుతున్నాయి. ఐఐటీల్లో మాత్రం జేఈఈ అడ్వాన్స్‌డ్ ద్వారా ప్రవేశాలు చేపడుతున్నారు.
ఈ నేపథ్యంలో మెడికల్‌కు ‘నీట్’ద్వారా ప్రవేశాలు చేపడుతున్న తరహాలోనే దేశంలోని అన్ని కాలేజీల్లో జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగానే ప్రవేశాలు చేపట్టాలని ఏఐసీటీఈ నిర్ణయించింది. దీనిపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. అది జారీ అయిన వెంటనే ఒకే ప్రవేశ పరీక్ష విధానం అమల్లోకి రానుంది. 2018–19 విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయనుంది. దీంతో రాష్ట్రంలో ఇక ఇంజనీరింగ్ ప్రవేశాలకు భవిష్యత్తులో ఎంసెట్ ఉండదు. మరోవైపు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు అన్నింటిని నేషనల్ టెస్టింగ్ సర్వీసు (ఎన్‌టీఎస్) ద్వారా నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చింది. 2018లో జేఈఈ మెయిన్ పరీక్షను కూడా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) కాకుండా ఎన్‌టీఎస్ ద్వారా నిర్వహించే అవకాశం ఉంది.