Delhi: 16 ఏళ్ల లోపు వారిని చేర్చుకోవద్దు | Ministry Of Education Issues Guidelines For Coaching Centres, Check Them Inside- Sakshi
Sakshi News home page

Coaching Centres New Guidelines:16 ఏళ్ల లోపు వారిని చేర్చుకోవద్దు

Published Fri, Jan 19 2024 4:50 AM | Last Updated on Fri, Jan 19 2024 9:59 AM

Ministry of Education issues guidelines for coaching centres - Sakshi

న్యూఢిల్లీ: పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లను కట్టడి చేసేందుకు, వాటిని చట్టపరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర విద్యాశాఖ మార్గదర్శకాలు ప్రకటించింది. 16 ఏళ్లలోపు విద్యార్థులను కోచింగ్‌ సెంటర్లలో చేర్చుకోవద్దని, ర్యాంకులు, మంచి మార్కులు గ్యారెంటీ అంటూ తప్పుదోవ పట్టించే ప్రకటనలివ్వరాదని గురువారం జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

కోచింగ్‌ కేంద్రాల్లో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు, అగ్ని ప్రమాదాలు, అసౌకర్యాలు, విద్యాబోధన విధానాలకు సంబంధించిన పలు ఫిర్యాదులు ప్రభుత్వానికి అందుతున్న నేపథ్యంలో వీటిని ప్రకటించింది. ‘గ్రాడ్యుయేషన్‌ కంటే తక్కువ అర్హత కలిగిన వారిని ట్యూటర్లుగా పెట్టుకోరాదు. విద్యార్థులను ఆకర్షించేందుకు మంచి మార్కులు, ర్యాంకు గ్యారెంటీ అంటూ వారి తల్లిదండ్రులకు తప్పుడు హామీలు ఇవ్వకూడదు. 16 ఏళ్ల లోపు వారిని చేర్చుకోరాదు.

సెకండరీ స్కూలు పరీక్ష రాసిన వారిని మాత్రమే తీసుకోవాలి’అని తెలిపింది. కోచింగ్‌ నాణ్యత, వారికి కల్పించే సౌకర్యాలు, సాధించిన ఫలితాల గురించి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ తప్పుదోవ పట్టించే ఎలాంటి ప్రకటనలను కోచింగ్‌ సంస్థలు ఇవ్వరాదని స్పష్టం చేసింది.  మానసిక ఒత్తిడికి గురయ్యే వారికి తక్షణమే అవసరమైన సాయం అందించే యంత్రాంగం ఉండాలి. సైకాలజిస్టులు, కౌన్సిలర్ల పేర్లను విద్యార్థులు, తల్లిదండ్రులకు అందజేయాలని కేంద్ర విద్యాశాఖ ఆ మార్గదర్శకాల్లో వివరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement