సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు గణనీయంగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే సమయంలో ప్రైవేటు పాఠశాలలు భారీ సంఖ్యలో మూతపడ్డాయని వెల్లడించింది. ఈ మేరకు గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సోమవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
ప్రభుత్వ పాఠశాలల్లో 46.27 లక్షల మంది..
2020–21 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో 4.37 లక్షల మంది విద్యార్థులు ప్రవేశం పొందారని కేంద్ర సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి చెప్పారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 46.27 లక్షలకు చేరిందని వెల్లడించారు. అదే సమయంలో ప్రైవేట్ పాఠశాలల్లో చేరినవారు కేవలం 2.5 లక్షల మంది మాత్రమే ఉన్నారన్నారు. దీంతో కొత్తగా చేరినవారితో కలిపి ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 35.05 లక్షలకు పడిపోయిందని స్పష్టం చేశారు. అలాగే ఏపీలో 2020–21లో కొత్తగా ప్రైవేట్ పాఠశాలలు తెరిచేందుకు 77 దరఖాస్తులు మాత్రమే రాగా 948 ప్రైవేట్ పాఠశాలలు మూతపడ్డాయన్నారు.
తెలంగాణలో ప్రైవేటు పాఠశాలల్లో పెరిగిన చేరికలు.
2020–21 విద్యా సంవత్సరంలో తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల్లో 3.20 లక్షల మంది విద్యార్థులు కొత్తగా చేరారని కేంద్ర సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి తెలిపారు. దీంతో అక్కడ చదువుతున్న విద్యార్థుల సంఖ్య 39.64 లక్షలకు చేరిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1.54 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశం పొందారని.. దీంతో మొత్తం విద్యార్థుల సంఖ్య 28.96 లక్షలకు చేరిందని తెలిపారు. కాగా తెలంగాణలో 2020–21లో కొత్తగా ప్రైవేట్ పాఠశాలలు తెరిచేందుకు 528 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఒక్క ప్రైవేట్ పాఠశాల కూడా మూతపడలేదని వెల్లడించారు.
పాఠశాల విద్యలో ఎన్నో సంస్కరణలు
ఏపీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పాఠశాల విద్యపై దృష్టి సారించారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేలా.. వాటిలో సకల వసతులు ఉండేలా.. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దడానికి నాడు–నేడు: మనబడి పథకాన్ని ప్రవేశపెట్టారు. అలాగే జగనన్న గోరుముద్ద పథకం కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారాన్ని మధ్యాహ్న భోజనం కింద అందిస్తున్నారు. అదేవిధంగా తమ పిల్లలను పాఠశాలలకు పంపే ప్రతి తల్లికి జగనన్న అమ్మఒడి కింద రూ.15 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. అంతేకాకుండా జగనన్న విద్యా కానుక కింద పాఠ్యపుస్తకాలు, బెల్టు, షూ, యూనిఫామ్, స్కూల్ బ్యాగు తదితరాలను అందిస్తున్నారు. వీటి ఫలితంగానే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు అమాంతం పెరిగాయని ఉపాధ్యాయ సంఘాల నేతలు, విద్యావేత్తలు చెబుతున్నారు.
ప్రభుత్వ స్కూళ్లకే పట్టం
Published Tue, Aug 2 2022 4:43 AM | Last Updated on Tue, Aug 2 2022 3:19 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment