
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాడు–నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ‘తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల ఏర్పాటుకు నిర్ణయించాం.. ఇందుకు సంబంధించి నాడు–నేడులో టీసీఎస్ ద్వారా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి వినియోగించారు. ఇది మంచి ప్రయోజనకరంగా ఉంది. మేం కూడా ఈ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకుంటాం. దీనిపై నిరభ్యంతర ఉత్తర్వులివ్వాలి’ అని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఏపీ విద్యాశాఖ కార్యదర్శికి లేఖ రాసింది.
ఈ అంశాన్ని అధికారులు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ.. ఇలాంటి కార్యక్రమాలు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల అభివృద్ధికి దోహదం చేస్తాయని, సాఫ్ట్‌వేర్ వినియోగించుకునేందుకు నిరభ్యంతర ఉత్తర్వులివ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకునేందుకు సోమవారం నిరభ్యంతర(నో అబ్జెక్షన్) ఉత్తర్వులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment