తిరుపతి సిటీ/ఏర్పేడు: సంస్కృత భాషాభివృద్ధికి తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (ఎన్‌ఎస్‌యూ) ఎనలేని కృషి చేస్తోందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొనియాడారు. గురువారం తిరుపతి ఎన్‌ఎస్‌యూలో ఉత్కల పీఠం (ఒడిశా చైర్) ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన రజతోత్సవ కార్యక్రమానికి ఆయన వర్చువల్ విధానంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
శ్రీవారి పాదాల చెంత వెలసిన సంస్కృత వర్సిటీ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రచారం చేసి పరిరక్షించడంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. వర్చువల్ విధానంలో వర్సిటీలో నూతన హాస్టల్ భవనాలను, తరగతి గదులను ప్రారంభించారు. ఉత్కల పీఠం రజతోత్సవ పైలాన్, శిలాఫలకాన్ని ఇస్కాన్ టెంపుల్ అధ్యక్షులు రేవతి రమణదాన ప్రభు ప్రారంభించారు.
ఇన్నోవేషన్ హబ్‌గా తిరుపతి ఐఐటీ
తిరుపతి కేంద్రంగా ఏర్పేడులో స్థాపించిన ఐఐటీ విద్యాసంస్థ అనతి కాలంలోనే ఇన్నోవేషన్ హబ్‌గా పేరుగాంచడం గర్వంగా ఉందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. గురువారం తిరుపతి ఐఐటీలో జరిగిన నాల్గొవ, ఐదవ స్నాతకోత్సవ వేడుకల్లో ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ప్రసంగించారు.
జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ మాట్లాడుతూ తిరుపతి ఐఐటీలో అత్యాధునిక సదుపాయాలు, నాణ్యమైన విద్య అందించడం శుభపరిణామమన్నారు. మొత్తం 355మంది బీటెక్, 106 మంది ఎంటెక్, ఇద్దరు డ్యూయల్ డిగ్రీ, 74మంది ఎమ్మెస్సీ, 17మంది ఎంఎస్, 21మంది పీహెచ్‌డీ పూర్తి చేసిన విద్యార్థులకు స్నాతకోత్సవ పట్టాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment