Sanskrit language
-
సంస్కృత భాషాభివృద్ధికి ఎన్ఎస్యూ కృషి అభినందనీయం
తిరుపతి సిటీ/ఏర్పేడు: సంస్కృత భాషాభివృద్ధికి తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (ఎన్ఎస్యూ) ఎనలేని కృషి చేస్తోందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొనియాడారు. గురువారం తిరుపతి ఎన్‌ఎస్‌యూలో ఉత్కల పీఠం (ఒడిశా చైర్) ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన రజతోత్సవ కార్యక్రమానికి ఆయన వర్చువల్ విధానంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. శ్రీవారి పాదాల చెంత వెలసిన సంస్కృత వర్సిటీ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రచారం చేసి పరిరక్షించడంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. వర్చువల్ విధానంలో వర్సిటీలో నూతన హాస్టల్ భవనాలను, తరగతి గదులను ప్రారంభించారు. ఉత్కల పీఠం రజతోత్సవ పైలాన్, శిలాఫలకాన్ని ఇస్కాన్ టెంపుల్ అధ్యక్షులు రేవతి రమణదాన ప్రభు ప్రారంభించారు. ఇన్నోవేషన్ హబ్‌గా తిరుపతి ఐఐటీ తిరుపతి కేంద్రంగా ఏర్పేడులో స్థాపించిన ఐఐటీ విద్యాసంస్థ అనతి కాలంలోనే ఇన్నోవేషన్ హబ్‌గా పేరుగాంచడం గర్వంగా ఉందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. గురువారం తిరుపతి ఐఐటీలో జరిగిన నాల్గొవ, ఐదవ స్నాతకోత్సవ వేడుకల్లో ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ప్రసంగించారు. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ మాట్లాడుతూ తిరుపతి ఐఐటీలో అత్యాధునిక సదుపాయాలు, నాణ్యమైన విద్య అందించడం శుభపరిణామమన్నారు. మొత్తం 355మంది బీటెక్, 106 మంది ఎంటెక్, ఇద్దరు డ్యూయల్ డిగ్రీ, 74మంది ఎమ్మెస్సీ, 17మంది ఎంఎస్, 21మంది పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు స్నాతకోత్సవ పట్టాలను అందజేశారు. -
గుజరాత్లో సల్మా ఘనత
‘భాషకు కులం, మతం ఉండవు’ అంటోంది సల్మా. ‘ఇతర మతస్తులు ఉర్దూ, పర్షియన్ భాషలు అధ్యయనం చేస్తున్నప్పుడు నేను సంస్కృతం ఎందుకు చదవకూడదు?’ అని కూడా అంటోంది. గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఆమె తాజాగా సంస్కృతం భాషలో పిహెచ్.డి తీసుకుంది. రోజు కూలీ కుమార్తె అయిన సల్మా సంస్కృతంలో ప్రొఫెసర్ అయ్యేందుకు సంకల్పించింది. గుజరాత్లో ఈ ఘనత సాధించిన తొలి ముస్లిం అమ్మాయి సల్మా. ఇటీవల గుజరాత్ యూనివర్సిటీలో జరిగిన ఒక పిహెచ్.డి ప్రదానం అక్కడి వైస్ చాన్సలర్‌తో సహా చాలా మందిని సంతోషపెట్టింది. దానికి కారణం ఎవరూ పై చదువులు చదువుకోని ఒక ముస్లిం కుటుంబం నుంచి ఒక అమ్మాయి పిహెచ్.డి చేసింది. అందునా సంస్కృతం లో చేసింది. ప్రతి భాష ప్రతి ఒక్కరిది అని ఆమె ఈ విధానం ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది. అంతేకాదు, ఇష్టమైన భాషలో పరిశోధన ఇచ్చే గుర్తింపు కూడా గొప్పది అని చాటి చెప్పింది. ఆ అమ్మాయి 26 సంవత్సరాల సల్మా ఖురేషి. ‘సంస్కృతం దేవతల భాష అంటారు కొందరు. మరికొందరు అది బ్రాహ్మణుల భాష అని అంటారు. కాని ఏ భాషకూ కులం, మతం, ప్రాంతం ఉండవు. నేను నా హైస్కూల్ చదువు నుంచి సంస్కృతం చదువుతున్నాను. ఎందుకంటే ఆ సబ్జెక్ట్‌లో నాకు మార్కులు ఎక్కువ వచ్చేవి. అయితే మార్కులతో నిమిత్తం లేని ఆసక్తి మెల్లగా ఆ భాషను చదివే కొద్దీ నాకు పెరిగింది. పురాణాలు, ఉపనిషద్‌లు, వేదాలు... వీటిని చదువుతూ ఆ భాష పట్ల ఆసక్తి పెంచుకున్నాను’ అంది సల్మా ఖురేషి. సౌరాష్ట్ర యూనివర్సిటీ నుంచి సంస్కృతంలో డిగ్రీ చేసిన సల్మా భావ్‌నగర్ యూనివర్సిటీ నుంచి ఎం.ఏ. సంస్కృతం చేసి గుజరాత్ యూనివర్సిటీలో పిహెచ్.డి.కి ఎన్రోల్ అయ్యింది. ‘నేను 15 మంది ఉండే ఉమ్మడి కుటుంబంలో నుంచి వచ్చాను. సంస్కృతం చదువుకుంటానంటే ఒక్కరూ వద్దనలేదు. మా నాన్న కూలి పని చేస్తాడు. ఆయన నేను చదువుకుంటే సంతోషపడ్డాడు’ అంది సల్మా. సల్మా పిహెచ్.డి టాపిక్ ‘పురాణేషు నిరూపిత శిక్షపద్ధతి ఏకధ్యాయనం’. పురాణ కాలం నుంచి గురు శిష్య పరంపర ద్వారా విద్యావిధానం ఎలా కొనసాగింది అనేది దీని వివరణ. ఆమెకు గైడ్‌గా వ్యవహరించిన అతుల్ ఉనగర్ తన శిష్యురాలిని చూసి గర్వపడుతున్నారు. ‘గుజరాత్ యూనివర్సిటీలో ఇద్దరు విద్యార్థినులే సంస్కృతం లో పిహెచ్.డి చేస్తున్నారు. సల్మా కాకుండా ఇంకొక అమ్మాయి కూడా ముస్లిమే. ఆమె పేరు ఫరీదా. సల్మా కజిన్ ఆ అమ్మాయి. కాళిదాసు, భాసుడు సంస్కృతంలో కావ్యాలు రాసినప్పుడు వాటిని ఫలానా వారు మాత్రమే చదవాలని ఎక్కడా చెప్పలేదు. కాలక్రమంలో సంస్కృతాన్ని కొందరి భాషగా చేసి పెట్టారు. సంస్కృత భాష ద్వారా మన ప్రాచీన సాహిత్యాన్ని అర్థం చేసుకుని ప్రజలకు చేర్చాల్సిన అవసరం ఉంది’ అన్నాడాయన. సల్మా సంస్కృతంలో పిహెచ్.డి చేయడాన్ని ప్రశంసించిన గుజరాత్ యూనివర్సిటీ వి.సి హిమాంశు ‘వివిధ భాషల అధ్యయనం ద్వారా కెరీర్ పొందాలనుకునేవారు సల్మాను చూసి స్ఫూర్తి పొందుతారని ఆశిస్తాను’ అన్నారు. సల్మా స్ఫూర్తినిస్తుందనే ఆశిద్దాం. -
సంస్కృతంలో న్యూజిలాండ్ ఎంపీ ప్రమాణ స్వీకారం
మెల్బోర్న్: న్యూజిలాండ్ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన భారతీయ సంతతి వ్యక్తి డాక్టర్ గౌరవ్ శర్మ ఆ దేశ పార్లమెంట్లో సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన శర్మ లేబర్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. శర్మ తొలుత న్యూజిలాండ్ స్థానిక భాష మౌరిలో అనంతరం సంస్కృతంలో ప్రమాణస్వీకారం చేశారని న్యూజిలాండ్‌లో భారత హైకమిషనర్ ముక్తేశ్ పర్దేశి చెప్పారు. ఇలా చేయడం ద్వారా రెండు దేశాల సంస్కృతులను ఆయన గౌరవించారన్నారు. శర్మ ఆక్లాండ్‌లో ఎంబీబీఎస్, వాషింగ్టన్లో శర్మ ఎంబీఏ పూర్తి చేశారు. హిందీ కన్నా సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా భారతీయ భాషలన్నింటినీ గౌరవించినట్లవుతుందని శర్మ చెప్పారు. న్యూజిలాండ్ ప్రభుత్వంలో భారతీయ సంతతికి చెందిన ప్రియాంక రాధాకృష్ణన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
బోధనపై ఆంక్షలా?
వివేచనపైనా, వివేకంపైనా పిడివాదమే గెలిచింది. వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యా లయం(బీహెచ్‌యూ)లోని సంస్కృత విద్యా ధర్మ విజ్ఞాన్(ఎస్వీడీవీ) విభాగంలో సంస్కృత విద్యా బోధన కోసం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితుడైన ఫిరోజ్‌ఖాన్ దాన్నుంచి తప్పుకుని మరో విభాగంలో చేరవలసి వచ్చింది. విశ్వవిద్యాలయం నిర్వహించిన పరీక్ష, ఇంటర్వ్యూల్లో ఆయన మరో 9మందితో పోటీపడి రెండు నెలలక్రితం ఆ పోస్టుకు ఎంపికయ్యాడు. ఆయనను ఏకగ్రీవంగా ఎంపిక చేసిన బోర్డులో ప్రముఖ సంస్కృత పండితుడు ప్రొఫెసర్ రాధావల్లభ్ త్రిపాఠీతోసహా హేమాహేమీలున్నారు. ఇతరులతో పోలిస్తే ఆ పోస్టుకు కావాల్సిన సకల అర్హతలూ ఆయనకు ఉన్నాయని, ఫిరోజ్‌ఖాన్ సంస్కృతంలో సాహిత్య సంబంధ అంశాలే బోధిస్తారు తప్ప మతపరమైన అంశాలతో ఆయనకు ప్రమేయం ఉండదని బీహెచ్‌యూ వైస్‌చాన్సలర్ రాకేష్ భట్నాగర్, సంస్కృత సాహిత్య విభాగం అధిపతి ప్రొఫెసర్ ఉమాకాంత్ చతుర్వేది, విశ్వవిద్యాలయ పాలకమండలి నచ్చ జెప్పినా విద్యార్థులు అంగీకరించలేదు. సంస్కృతాన్ని మతంతో లేదా కులంతో ముడిపెట్టడం, దాన్ని ఫలానా మతం వారు మాత్రమే నేర్చుకోవాలని, వారు మాత్రమే బోధించాలని ఆంక్షలు పెట్టడం రాజ్యాంగ విలువలకు అపచారం చేయడం మాత్రమే కాదు. ఆ భాషకు కూడా అన్యాయం చేసినట్టే. ప్రజల్లో విస్తృతంగా వాడుకలో ఉన్నప్పుడే ఏ భాషైనా అభివృద్ధి చెందుతుంటుంది. చిర కాలం వర్థిల్లుతుంది. కొందరికే పరిమితమైనప్పుడు కుంచించుకుపోతుంది. సంస్కృత వ్యాకరణం, సాహిత్యం, వేదాలు, ఉపనిషత్తులు ఔపోసనపట్టిన ఫిరోజ్‌ఖాన్‌ను విధ్వంసక శక్తిగా చూడటం, ఆయన బోధనాచార్యుడిగా వస్తే ఏదో అపచారం జరిగిపోతుందని బెంబేలెత్తడం ఆశ్చర్యం కలిగి స్తుంది. రాజస్తాన్‌కు చెందిన ఫిరోజ్ కుటుంబం మూడు తరాలనుంచి సంస్కృతంపైనా, హిందూ మత ఆచారాలపైనా ఆసక్తి, అనురక్తీ పెంచుకుంది. ఒకపక్క మసీదులో నమాజు చేస్తూనే గోవును పూజించడం, వారి స్వస్థలమైన బంగ్రూలో ఉన్న దేవాలయాల్లో భజన గీతాలు పాడటం ఫిరోజ్ తండ్రి రంజాన్ఖాన్కు దశాబ్దాలుగా అలవాటు. రంజాన్‌ఖాన్ సంస్కృతంలో పట్టభద్రుడు. తన కుటుంబం అనుసరిస్తున్న ఆచారాల విషయంలోగానీ, దేవాలయాల్లో భజనగీతాలు పాడటం విషయంలోగానీ ముస్లింలెవరూ అభ్యంతరం చెప్పలేదని ఆయనంటున్నాడు. సంస్కృతంపై తనకు వల్లమాలిన ప్రేమ ఉండబట్టే కుమారుణ్ణి ఆ భాషలో నిష్ణాతుడయ్యేలా ప్రోత్సహించానని చెబుతున్నాడు. ఫిరోజ్‌ఖాన్ సంస్కృత భాషపై చేసిన పరిశోధనైనా, ఆయన మాట్లాడే సంస్కృత భాషైనా అత్యున్నత ప్రమాణాలతో ఉన్నదని ఇంటర్వ్యూ బోర్డులోని సభ్యులు తెలిపారు. ఈ విషయమే ఆందోళన చేస్తున్న విద్యార్థులకు తెలియజెప్పి వారిని ఒప్పించాలని చూశారు. కానీ ఫలితం లేకపోయింది. ఈ ఆందోళన కొనసాగినంతకాలం ఫిరోజ్‌ఖాన్ అజ్ఞాతవాసం గడపవలసి వచ్చింది. చిత్రమేమంటే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో సంస్కృత విభాగ అధిపతిగా ఉన్న సల్మా మఫీజ్కు ఇలాంటి అడ్డంకులు ఎదురుకాలేదు. అందరూ అత్యంత సంక్లిష్టమైనదిగా భావించే పాణిని విరిచిత సంస్కృత వ్యాకరణం అష్టాధ్యాయిని ఆమె అలవోకగా బోధిస్తారు. సంస్కృత భాషలో పాండిత్యం గడించిన తొలి ముస్లిం మహిళగా ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు పీహెచ్డీ చేస్తున్న 15మంది విద్యార్థులకు ఆమె గైడ్. వారణాసికి చరిత్రలో విశిష్ట స్థానముంది. అక్కడ షా జహాన్ చక్రవర్తి పెద్ద కుమారుడు దారా షికో సంస్కృత భాషను అధ్యయనం చేయడమే కాదు... అందులో నిష్ణాతుడై భగవద్గీతను, 52 ఉపనిషత్తులను పర్షియన్ భాషలోకి అనువదించాడు. సాగర సంగమం పేరుతో హిందూ, ఇస్లాం, ఇతర మతాల మధ్య ఉన్న వైవిధ్యతలనూ, ఏకత్వాన్ని సోదాహరణంగా వివరిస్తూ పర్షియన్ భాషలో గ్రంథం రచించాడు. ఆయనకన్నా ఏడువందల ఏళ్ల ముందు అల్–బిరూని అనే ముస్లిం విద్యాధికుడు ఇప్పటి ఉజ్బెకిస్తాన్, తుర్కుమెనిస్తాన్ల నుంచి భారత్ వచ్చి సంస్కృతంలో పాండిత్యం గడించి ఈ దేశంలోని సంస్కృతి, మతం, జీవనవిధానం, తాత్విక చింతనలను చాటిచెబుతూ ఉద్గ్రంథాన్ని రచించాడు. పర్షియన్ ప్రపంచానికి హిందూ మతాన్ని పరిచయం చేసే వంద గ్రంథాలు వెలువరించాడు. సూఫీ కవి, పండితుడు అమిర్ ఖుస్రో వేదాల్ని, పురాణాల్ని ఔపోసన పట్టి, సంస్కృతంలోనే అనేక రచనలు చేశాడంటారు. ఆయన వచనంలోనూ, కవిత్వంలోనూ అడుగడుగునా అనేక సంస్కృత పదాలుంటాయి. వీరు మాత్రమే కాదు... యూరప్ దేశాలకు చెందిన ఎందరో సంస్కృతాన్ని నేర్చుకున్నారు. 1785లో చార్లెస్ విల్కిన్స్తో మొదలుపెట్టి జర్మనీకి చెందిన మాక్స్ ముల్లర్ వరకూ అనేకులు సంస్కృత కావ్యాలను, గ్రంథాలను ఇంగ్లిష్, జర్మన్ తది తర భాషల్లోకి అనువదించారు. కొందరు పర్షియన్ భాషలోకి అనువాదమైన సంస్కృత కావ్యాలను తర్జుమా చేశారు. సంస్కృతభాషను నిశితంగా అధ్యయనం చేసి భిన్న శతాబ్దాల్లో వెలువడిన సంస్కృత కావ్యాల్లోని భాషా ప్రయోగాల్లో చోటుచేసుకున్న మార్పులపై పరిశోధనలు చేసిన కొలం బియా యూనివర్సిటీ ప్రొఫెసర్ షెల్డన్ పొలాక్ వర్తమాన ప్రపంచంలోని సంస్కృత భాషా పండి తుల్లో అగ్రగణ్యుడు. భాష నేర్చుకోవడానికి కులమో, మతమో అడ్డురావడం అంతిమంగా దానికి ప్రతిబంధక మవుతుంది తప్ప అది విస్తరించడానికి దోహదపడదు. మన దేశంలో ఉన్న కుల వ్యవస్థ ఇలాంటి ప్రతిబంధకాలు సృష్టించబట్టే ఆర్యభట, కణాదుడు, వరాహమిహిరుడు, చరకుడు, సుశ్రుతుడు, బ్రహ్మగుప్తుడు తదితరులు సంస్కృత భాషలో అభివృద్ధి చేసిన ఎన్నో విజ్ఞానశాస్త్రాలు అనంతర కాలంలో విస్తరించలేకపోయాయి. నిజానికి ఇలాంటివి మనకు గుణపాఠాలు కావాలి. మన దృష్టి కోణాన్ని విశాలం చేయాలి. మరింతమంది ఫిరోజ్‌ఖాన్‌లు రూపొందేందుకు దోహదపడాలి. కానీ జరుగుతున్నదంతా అందుకు విరుద్ధం. అది విచారకరం. -
ప్రభుత్వ పత్రికా ప్రకటనలు ఇక సంస్కృతంలోనూ..
లక్నో, ఉత్తరప్రదేశ్ : యూపీ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ప్రతికా ప్రకటనలు, ముఖ్యమంత్రి ప్రసంగాలు ఇకనుంచి సంస్కృతంలో కూడా వెలువడనున్నాయని ఆ రాష్ట్ర అధికారులు మంగళవారం తెలిపారు. దీనికి సంబంధించి మొదటి ప్రెస్ రిలీజ్‌ను సంస్కృతంలో విడుదల చేశారు. సోమవారం జరిగిన ఓ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సంస్కృతం అనేది మన రక్తంలోనే ఉందని, భారతదేశంలో సంస్కృత భాష ఒక భాగమని కానీ, నేడు కేవలం పుజారులకు వృత్తి భాషగా మాత్రమే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్కృతానికి పునర్వైభవం తీసుకురావడానకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమైన ప్రసంగాలు, ప్రభుత్వ సమాచారం హిందీ, ఇంగ్లీష్ మరియు ఉర్దూలతోపాటు సంస్కృతంభాషలోనూ విడుదల చేయనున్నారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి యోగి ప్రసంగపత్రాన్ని సంస్కృతంలో కూడా విడుదల చేశారు. ఇప్పుడు దాన్ని మరింత విస్తరించాలని ప్లాన్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇందుకోసం ముఖ్యమంత్రి ప్రసంగాలను సంస్కృతంలోకి అనువదించడానికి లక్నోకు చెందిన రాష్ట్రీయ సంస్కృత సంస్థ సహాయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో 25 పత్రికలు సంస్కృతంలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. కానీ వాటిలో ఏవి దిన పత్రికలు కావు. -
తెలుగు భాష వికాసం
తెలుగు భాషను తెనుగు, త్రిలింగం, ఆంధ్రం అని వ్యవహరిస్తారు. తెలుగు పదం ఆవిర్భావంపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. తెలుగు నేలపై శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం క్షేత్రాలున్నాయి. అందువల్లే ఈ ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని కూడా పిలుస్తారు. ఈ త్రిలింగం నుంచే తెనుగు పదం పుట్టిందనేది కొందరి వాదన. తెలుగు భాషకు శతాబ్దాల చరిత్ర ఉంది. తెలుగు భాషను పలువురు కింది విధంగా కీర్తించారు. తెలుగు భాషా చరిత్రను సాహిత్యకారులు మూడు భాగాలుగా విభజించారు. అవి.. 1.ప్రాకృత భాష ప్రభావం - శాతవాహనుల కాలం నుంచి క్రీ.శ.11వ శతాబ్దం వరకు ఉంది. 2.సంస్కృత భాష ప్రభావం - క్రీ.శ. 11వ శతాబ్దం నుంచి క్రీ.శ.19వ శతాబ్దం వరకు ఉంది. 3.పాశ్చాత్య ప్రభావం - క్రీ.శ.19వ శతాబ్దం నుంచి. తెలుగు భాష ఆవిర్భావానికి సంబంధించి సాహిత్యకారుల్లో వేర్వేరు అభిప్రాయాలున్నాయి. కొంతమంది ప్రాకృత, సంస్కృత భాషల నుంచి తెలుగు భాష ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. అయితే అత్యధిక మంది భాషావేత్తలు మాత్రం ద్రావిడ భాషా కుటుంబం నుంచి తెలుగు ఆవిర్భవించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న తెలుగు, ఆంధ్ర పదాల మధ్య విడదీయలేని బంధం ఉంది. క్రీ.పూ.2వ శతాబ్దం నుంచి క్రీ.శ. 2వ శతాబ్దం వరకు (శాతవాహనుల కాలంలో) ప్రాకృత భాషనే రాజ భాషగా పరిగణించారు. శాతవాహన రాజుల్లో 17వవాడైన హాలుడు గాథాసప్తశతిని ప్రాకృతంలో రచించాడు. శాసనాల్లో తెలుగు భాష క్రీ.శ.6వ శతాబ్దం నుంచి క్రీ.శ.8వ శతాబ్దం వరకు వేయించిన శాసనాల్లోని తెలుగు భాష చాలా ప్రాచీనమైందని తెలుస్తోంది. తెలుగు భాషలో మొట్టమొదటి శాసనం క్రీ.శ.575లో రేనాటి చోడులు వేయించిన ధనుంజయని కలమళ్ల శాసనం. ఇది తెలుగు శాసనాల్లో అత్యంత ప్రాచీనమైంది. ఇందులోని పద్య రచన ప్రాథమిక రూపంలో కనిపిస్తుంది. వీరి కాలంలో సుమారు 33 శాసనాలు వచనంలో ఉన్నాయి. తూర్పు చాళుక్య రాజుల శాసనాల్లో తెలుగు వచనం కనిపించిన మొదటి శాసనం మొదటి జయసింహ వల్లభుని శాసనం (క్రీ.శ.641-673), కాగా రెండోది మంగిరాజు శాసనం (క్రీ.శ.682-706). వీరి తర్వాత చాళుక్య రాజులైన మూడో విష్ణువర్ధనుడు, గుణగ విజయాదిత్యుడు, చాళుక్య భీముడు, యుద్ధమల్లుడు, విమలాదిత్యుడు, రాజరాజనరేంద్రుడు వేయించిన తెలుగు శాసనాలు కూడా లభ్యమయ్యాయి. అయితే వాటిలో ప్రాకృత, సంస్కృత పదాలు అధికంగా కనిపిస్తాయి. అనంతర కాలానికి చెందిన అద్దంకి, ధర్మవరం, బెజవాడ, సామలూరు శాసనాల్లో వచనం, పద్యం కలిసి (మిశ్రమంగా) కన్పిస్తాయి. తొలి కాలానికి చెందిన శాసనాల్లో సంస్కృత తత్సమాలు, దీర్ఘ సమాసాలు ఉండగా, తర్వాతి కాలం శాసనా ల్లో దేశీయ పదాలు, మాండలికాలు అధికంగా ఉన్నాయి. రెండో దశకు చెందిన శాసనాల్లో ప్రాకృత, సంస్కృత ప్రభావం తగ్గింది. 9వ శతాబ్దం నాటి చాళుక్య భీముని కొరవి శాసనంలో తెలుగు లిఖిత సాహిత్యం కనిపిస్తుంది.గుణగ విజయాదిత్యుని సేనాని పంటరంగడు వేయించిన అద్దంకి శాసనంలో తరువోజ పద్యం కన్పించింది. పల్లెపాటలు, స్త్రీల పాటలు, దంపుడు పాటలు వంటివి తరువోజ ఛందస్సులోనే ఉన్నాయి. దీన్నుంచే ద్విపద (రెండు వరుసలు) పుట్టిందని ఆరుద్ర పేర్కొన్నారు. తరువోజ, ద్విపద, మధ్యాక్కర, సీసం వంటి వాటిని దేశీ ఛందస్సులుగా గుర్తించారు. గుణగ విజయాదిత్యుని కందుకూరు శాసనంలో సీస పద్యం, ధర్మవరం శాసనంలో ఆటవెలది, యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో మధ్యాక్కర (సంస్కృతేతర) పద్యాలు కన్పిస్తాయి. తెలుగు సాహిత్యాభివృద్ధి - నన్నయ యుగం తూర్పు చాళుక్యరాజైన రాజరాజ నరేంద్రుని కాలంలో నారాయణ భట్టు సహకారంతో నన్నయ భట్టు వ్యాసుని సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు. అనువాద ప్రక్రియ ఈ యుగం నుంచే ప్రారంభమైంది. ఆది, సభా పర్వాలతోపాటు అరణ్య పర్వంలోని కొంత భాగాన్ని నన్నయ తెలుగులోకి అనువదించాడు. నన్నయ మరణానంతరం సుమారు 200 ఏళ్ల తర్వాత తిక్కన.. మహాభారతంలోని 15 పర్వాలను తెలుగులోకి అనువాదం చేశాడు. నన్నయ అసంపూర్తిగా వదిలిపెట్టిన అరణ్య పర్వాన్ని తిక్కన పూర్తి చేయలేదు. తిక్కన, నిర్వచనోత్తర రామాయణంను తెలుగు వచనంలో రచించాడు. ఇతనికి కవి బ్రహ్మ, ఉభయకవి మిత్రుడు వంటి బిరుదులున్నాయి. ఎర్రాప్రగడ ఇతడు క్రీ.శ.14వ శతాబ్దానికి చెందినవాడు. నన్నయ అసంపూర్తిగా రచించిన అరణ్య పర్వాన్ని ఎర్రాప్రగడ (ఎర్రన) పూర్తి చేశాడు. అలాగే హరివంశం, నృసింహ పురాణం వంటి ప్రబంధ కావ్యాలను రచించాడు. ప్రబంధ కావ్యాల మొదటి రచయితగా పేరుగాంచాడు. అందుకే ఇతడికి ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు ఉంది.సంస్కృత మహాభారతాన్ని నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడలు తెలుగులోకి అనువదించి ‘కవిత్రయం’గా ప్రసిద్ధి చెందారు.వాల్మీకి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని గోనబుద్ధారెడ్డి (కాకతీయ ప్రతాపరుద్రుడి కాలం నాటివాడు) రంగనాథ రామాయణం (ద్విపద) పేరుతో తెలుగులో రచించాడు. అదేవిధంగా మంత్రి భాస్కరుడు భాస్కర రామాయణాన్ని రాశాడు. నన్నయకు సమకాలికుడైన నన్నెచోడుడు కళ్యాణీ చాళుక్యుల సామంతుడు. ఒక చిన్న మండలాన్ని ఏలిన ఈ తెలుగు చోడ కవి యోధుడు కూడా. నన్నెచోడుడు ఒక యుద్ధంలో మరణించాడు. ఇతడు నన్నయకు పూర్వం వాడని కొందరి వాదన. ఇతడు కుమార సంభవం అనే వర్ణనాత్మక కావ్యం రచించి కవిరాజశిఖామణిగా పేరొందాడు.శైవమత కవైన నన్నెచోడుడు కుమార సంభవం రచించాడు. ఇతని రచనల్లో మధురమైన పద చిత్రాలు, వర్ణనలు ఉంటాయి.నన్నెచోడుడు ఆ కాలంలో వాడుకలో ఉన్న దేశీయ పదాలు, దేశీయ ఛందస్సును అధికంగా ఉపయోగించాడు. అందువల్లే ఇతడు జాను తెనుగు రచయితగా పేరుగాంచాడు. మల్లికార్జున పండితారాధ్యుడు శివ భక్తుడు. శివతత్వసారం అనే గ్రంథాన్ని రచించాడు. తెలుగు శతక వాఙ్మయానికి ఒరవడి తీసుకొచ్చిన మరో శైవ కవైన యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకంరచించాడు. ఆంధ్ర దేశంలో వీరశైవ మతాన్ని బాగా ప్రచారం చేసినవారిలో మల్లికార్జున పండితారాధ్యుడు, పాల్కురికి సోమనాథుడు ప్రసిద్ధులు. పాల్కురికి సోమనాథుడు తన కావ్యాలను దేశీ ఛందస్సు అయిన ద్విపదలో రచించాడు. వీర శైవ మత స్థాపకుడైన బసవడు ఇతని గురువు.పాల్కురికి సోమనాథుడు వృషాధిప శతకం, బసవ పురాణం (బసవేశ్వరుని జీవితం), పండితారాధ్య చరిత్రలను జాన తెలుగులోకి (ద్విపదలో) రచించాడు. అందువల్లే ఇతణ్ని ద్విపద సాహిత్య పితామహుడిగా పేర్కొంటారు. బసవ పురాణాన్ని వీర శైవమత గ్రంథంగా పరిగణిస్తారు.సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో అనేక తరహా జానపద గేయాలు, తుమ్మెద పదాలు, నివాళి పదాలు, వెన్నెల, గొబ్బి పదాలు, దంపుడు పాటలు, యక్షగానాలను పేర్కొన్నాడు. పల్లె పాటలు, జానపద నృత్యాలు, దేశీ నృత్యాల గురించి పండితారాధ్య చరిత్రలో వర్ణించాడు. శరీనాథుడు, పోతన తెలుగు సాహిత్యంలో తొలి కవిసార్వభౌముడుగా శ్రీనాథుడు ప్రసిద్ధి చెందాడు. ఇతడు సంస్కృత, తెలుగు భాషల్లో నిష్ణాతుడు. రెడ్డి రాజుల కాలంలో విద్యాధికారిగా నియమితుడయ్యాడు. సంస్కృత సాహిత్య గోష్టిలో విజయనగర రాయల ఆస్థాన కవుల్లో ఒకడైన డిండిమ భట్టును ఓడించి కవిసార్వభౌముడనే బిరుదు పొందాడు. శ్రీహర్షుడు సంస్కృత భాషలో రచించిన శృంగారనైషధ గ్రంథాన్ని శ్రీనాథుడు తెలుగులోకి అనువదించాడు. కాశీ ఖండం, భీమేశ్వర పురాణం, హరివంశం, పల్నాటి వీర చరిత్ర, క్రీడాభిరామం వంటి గ్రంథాలను తెలుగులో రచించాడు. క్రీడాభిరామం ఒక వీధి నాటకం. ఇది ఆనాటి సాంఘిక, మత పరిస్థితులను వివరిస్తుంది. బమ్మెర పోతన (క్రీ.శ.1450-1510) మహాభాగవతాన్ని తెలుగులోకి అనువదించి ఆంధ్రుల అభిమాన కవిగా మారాడు. తెలుగు సాహిత్యంలో ఆంధ్ర మహాభాగవతం గ్రంథం అపూర్వమైంది. ఇందులో గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరిత్ర ఘట్టాలను సామాన్య ప్రజలు కూడా ఉటంకిస్తారు. పోతన, శ్రీనాథుని బావమరిది అని కొందరి అభిప్రాయం. పోతన రాజాస్థానాలను ఆశ్రయించలేదు. భాగవత గ్రంథాన్ని ఏ రాజుకీ అంకితమివ్వలేదు. ఇతడు వీరభద్ర విజయం, భోగినీ దండకం అనే గ్రంథాలను కూడా రచించాడు. ఈ కాలంలోనే గౌరన ద్విపదలో హరిశ్చంద్రోపాఖ్యానం, పినవీరభద్రుడు శృంగార శాకుంతల నాటకాన్ని తెలుగులో రచించారు.గోల్కొండనేలిన కుతుబ్‌షాహీలు తెలుగు సాహిత్యాన్ని పోషించారు.ఇబ్రహీం కుతుబ్‌షా.. కందుకూరు రుద్రయ్యను పోషించాడు. ఇతడు జనార్దనాష్టకం, సుగ్రీవ విజయం, నిరంకుశోపాఖ్యానం గ్రంథాలనుతెలుగులో రచించాడు.ఈ కాలంలోనే పొన్నగంటి తెలగనార్యుడు అచ్చతెలుగులో యయాతి చరిత్ర రచించాడు.కంచెర్ల గోపన్న (రామదాసు) దాశరథీ శతకాన్ని రచించాడు.మల్లారెడ్డి.. పద్మ పురాణం రాశాడు. -
నేటి నుంచి జీ జైపూర్ లిటరరీ ఫెస్టివల్
జైపూర్: భారీ హంగామాతో, జాతీయ అంతర్జాతీయస్థాయి రచయితలతో, సంగీతకారులతో 8వ జీ జైపూర్ లిటరరీ ఫెస్టివల్ బుధవారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో ప్రారంభం కానుంది. ఏడేళ్లుగా అప్రతిహతంగా సాగుతున్న ఉత్సవానికి ఇది కొనసాగింపు. ఐదురోజుల ఈ ఉత్సవంలో ఈసారి ‘భారతదేశంలో స్త్రీల లైంగిక సమానత్వం’ అనే అంశాన్ని ప్రధానంగా తీసుకోనున్నారు. సంస్కృత భాష వర్తమాన పరిస్థితిపై కూడా చర్చ జరగనుంది. దాదాపు 300 మంది వక్తలు పాల్గొనే ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు వహీదా రెహమాన్, నసీరుద్దీన్ షా, షబానా ఆజ్మీ ముఖ్య ఆకర్షణగా నిలువనున్నారు. ప్రారంభ వేడుకలో అరవింద్ కృష్ణ మెహరోత్రా, అశోక్ బాజ్‌బాయ్, విజయ్ శేషా ద్రి, నోబెల్ బహుమతి గ్రహీత వి.ఎస్.నైపాల్ వంటి సాహితీ దిగ్గజాలు పాల్గొంటారు. జైపూర్‌లో ఎంపికచేసిన తొమ్మిది వేదికల్లో 200 కార్యక్రమాలు జరగనున్నాయి. రెండు లక్షల మంది సాహితీ ప్రియులు పాల్గొనవచ్చని అంచనా. -
కప్పల తక్కెడ
జీవన కాలమ్ కొందరికి, కొన్నింటికి - వాటి ద్వారా కలిగే ప్రభావాన్ని బట్టి కొన్ని అపప్రథలు మిగులుతాయి. సంస్కృతం ‘మతవాది’ అన్నది కూడా అలాంటిదే. బొత్తిగా బూజుపట్టిన ఆలోచనలున్న ఒక పాఠ కుడు - ఒకానొక ఆంగ్ల దినపత్రికలో మొన్న ఒక సంపాదక లేఖ రాశాడు. ఈ దేశంలో సంస్కృత భాషని పెంపొందించుకో వాలని అంటూ, ఆ భాష మతానికే కాక వైద్యం, రసాయనిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, జ్యోతిషశాస్త్రం, గణితశాస్త్రం, ధనుశ్శాస్త్రం, అణుశాస్త్రం వంటి విభా గాలలో ఎంతో పురోగతిని సాధించిందని గర్వ పడ్డాడు. ఇలాంటి మైనారిటీ ఆలోచనలున్న వ్యక్తు లింకా ఈ దేశంలో ఉండటం ఆశ్చర్యకరం. చాలా కాలం కిందట ఓ విదేశీ దౌత్య ఉద్యోగి మన భారతీయ ఉద్యోగిని అడిగారట: ‘ఏమండీ! మీ దేశంలో ప్రపంచానికి దీటుగా నిలువగల, అత్యంత పురాతనమయిన సంస్కృత భాష ఉందికదా, దాని వికాసానికి మీ ప్రభుత్వం పూనుకోదేం?’’ అని. భారత దౌత్య ఉద్యోగి ఆ ప్రశ్నకే కంగారు పడి పోయి ‘‘బాబూ, మా దేశంలో సంస్కృతానికీ మతా నికీ లంకె. అందుకని ఆ భాషని మేం ముట్టుకోము’’ అన్నారట. మన దేశంలో చాలా దున్నలు ఈనుతూ ఉంటాయి. వాటి దూడల్ని మనం అనునిత్యం పశు వుల కొట్టాల్లో కట్టేస్తూంటాం. మన గొప్పతనం పొరుగువాడు చెప్తే మనకు రుచిస్తుంది. అమెరికా అంతరిక్ష పరిశోధక సంస్థలో సైంటిస్టు రిక్ బ్రిగ్ మాటలివి. ‘సంస్కృతం గణితం, శాస్త్ర పరిశోధనకేకాక ఉచ్చారణను అభివృద్ధి చేయ డానికి ఉపయోగపడుతుంది. ఏకాగ్రతను పెంచు తుంది. ఆ భాషలోని అక్షరాలు సశాస్త్రీయమైనవి. వాటిని సరిగ్గా ఉచ్చరిస్తే మాటలో స్వచ్ఛత, ధాటీ పెరుగుతుంది. ఆలోచనాశక్తి పదునుదేరి, జ్ఞాపకశక్తి, ధారణ పెరుగుతుంది.’ విచిత్రంగా ప్రపంచ భాషల న్నింటిలో నేటి కంప్యూటర్‌కి చక్కగా అతికినట్టు సరిపోయే భాష సంస్కృతం (ట). Sanskrit and computer are perfect fit. ఐర్లాండులో ఒక స్కూలులో సంస్కృతం నేర్పు తారు. ఇలాంటి స్కూళ్లు ప్రపంచంలో ఆరే ఉన్నాయి. ఓ జర్మన్ తండ్రి రడ్గర్ కోర్టెన్‌హోస్ట్ తన కొడుక్కి ఎం దుకు సంస్కృతం నేర్పిస్తున్నాడో ఒక వ్యాసం రాశా డు. ఆయన మాటలు: శబ్ద సౌందర్యం, ఉచ్చారణ లో తూకం, భాషా శిల్పంలో నిర్దుష్టత ఏ భాషలోనూ ఇంతగా లేదు. మిగతా భాషల్లాగ సైద్ధాంతికంగా ఈ భాషలో ఎట్టి మార్పూ రాదు. మానవాళి ఆర్జించు కున్న అతి పరిణతిగల భాషగా సంస్కృతానికి ఎలాంటి మార్పూ అవసరం లేదు. అందుకే సంస్కృ తం లిపిని ‘అక్షరం’, అంటే నశించనిది, అన్నారు. ఇదీ ఆయన వివరణ. కొందరికి, కొన్నింటికి - వాటి ద్వారా కలిగే ప్రభావాన్ని బట్టి కొన్ని అపప్రథలు మిగులుతాయి. సంస్కృతం ‘మతవాది’ అన్నది కూడా అలాంటిదే. ఈ రోజుల్లో ప్రతి రచనా కాలధర్మాన్ని బట్టి ఎలా పీడిత ప్రజాభ్యుదయం లక్ష్యంగా పురోగమిస్తోందో, ఆ రోజుల్లో సంస్కృతమూ ధర్మమూ, దైవమూ ప్రాతిపదికగా రచనల్ని సాగించింది. ఊహించని స్థాయిలో మేధా సంపత్తిని, భక్తి తత్పరతని ప్రదర్శించినప్పుడు తన్మయులమవు తాం. ఆ ప్రతిభ అవధులు దాటితే చెప్పడానికి మాటలు చాలవు. అప్పుడేమంటాం? మాటలకం దని ‘దేవుడు’ అంటాం. ఇంకా పై దశ - సాక్షాత్తూ దేవుని అవతారమే అంటాం. వర్తమానంలో అలాం టి ఉదాహరణ ఒకటుంది. సచిన్ తెందూల్కర్‌ని మనం ‘దేవుడు’ అనే అంటున్నాం. ఈ యీ అపూర్వమైన మౌలిక రచనల మీద మతం ‘మరక’కి అర్థం అదే. కాగా, మనది ప్రజాస్వామిక వ్యవస్థ. పాపం, మన ప్రభుత్వం ఆగస్టు 7-15 వరకు సంస్కృత వారోత్సవాలు జరపాలని సెకెండరీ విద్యా కేంద్ర సంస్థ ఒక ఆదేశాన్ని జారీ చేసింది. తమిళనాడులో వైకోగారి ఎం.డి.ఎం.కె.; రామదాసుగారి పి.ఎం.కె. పార్టీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. వెంటనే ఈ ఆదేశాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. డి.ఎం.కె. ఇలంగోవన్ ఒకమాట అన్నారు: ‘మా తమిళం సంస్కృతం కంటే ఏ మాత్రం తీసి పోదు’ - అని. వర్తమాన పరిభాషలో ‘వెంకయ్య మహానుభావుడు’ అంటే ‘వీరయ్య శుంఠ’ అని అర్థం. హిందీ భాష పట్ల ఇలాంటి ఉద్యమాన్నే ద్రవిడ మున్నేత్ర కజగం జరిపి-హిందీని వ్యతిరేకించిన కారణంగానే ప్రజామోదాన్ని సంపాదించి 45 సంవత్సరాలుగా ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తోంది. భారతదేశం ప్రపంచంలో మొట్టమొదటి సారిగా ‘సున్నా’ను కనిపెట్టింది. గణితశాస్త్రంలో అదొక పెద్ద మలుపు. ఆర్యభట్టు, వరాహమిహు రుడు, చరకుడు, శుశ్రుతుడు, పాణిని, లీలావతి వంటివారెందరో సంస్కృతంలో ఎన్నో విభాగాల వికాసానికి బాటలు వేశారు. అయినా ఈనాటి భాషా వికాసం ఆయా విష యాల మీద బొత్తిగా అవగాహన లేని రాజకీయ పార్టీలు, నాయకుల పరిధిలో ఇరుక్కోవడం - ఈనాటి అభివృద్ధికి నిదర్శనం. మరొక్కసారి - సంస్కృతంలో మతం వాటా కేవలం పది శాతం. -
పురాతన పుస్తక భాండాగారం
* ఉర్దూ, సంస్కృత భాషల్లో.. 90 ఏళ్లనాటి భగవద్గీత * ఉర్దూ, అరబిక్, పర్షియన్, ఇంగ్లిష్, టర్కిస్ భాషల డిక్షనరీలు * అందుబాటులో మరెన్నో అరుదైన పుస్తకాలు న్యూఢిల్లీ: అదిపాత ఢిల్లీలోని అత్యంత ఇరుకైన ప్రాంతం. అక్కడ నివసించే యువతకు.. భవిష్యత్ తరాలకు ఏమి ఇవ్వాలనే ఆలోచన తట్టింది.. వెంటనే ఆచరణలో పెట్టారు. వజ్ర సంకల్పంతో 1999లో ఓ చిన్న గదిలో గ్రంథాలయాన్ని ప్రారంభిం చారు. భవిష్యత్ తరాలకు పుస్తక సంపదను వారసత్వంగా (ఈ గ్రంథాలయాన్ని) అందజేశారు. ఈ ప్రయత్నానికి అందరూ చేదోడువాదోడయ్యారు. చేయిచేయి కలిపితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు. ఆ పుస్తక భాండాగారం ఇప్పుడు రెండు దశాబ్దాల వడికి చేరింది. అదే చాంద్నీ చౌక్‌లోని జమా మసీద్‌కు కొద్ది దూరంలోని ఇమ్లీ గలీలో ఉన్న‘షా వాలైలా’ గ్రంథాలయం. అరుదైన, అంతరించిపోతున్న పుస్తకాలను పుస్తక ప్రియులకు అందుబాటులో ఉంచుతోంది. ఇప్పుడు పరిశోధనా గ్రంధాలయంగా మారింది. అందుబాటులో ఉన్న పుస్తకాలు: వివిధ పబ్లికేషన్లు, డిక్సనరీలు, వివిధ భాషలలో కథలు, పద్య కవితల పుస్తకాలను అందుబాటులో ఉంచుతోంది. అంతరించిపోయిన పుస్తకాలు, అరుదైన పుస్తకాలను సేకరించి అందుబాటులోకి తెస్తోంది. ఈ కృషిని నిరంతరం కొనసాగిస్తోంది. సుమారు 15,000 పుస్తకాలున్నాయి. హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం, ఉర్దూ, పర్షియన్, అరబిక్ భాషల పుస్తకాలున్నాయి. ఈ లైబ్రరరీలో సుమారు 70శాతం అంతరించిపోయిన, అరుదైన పుస్తక సంపద అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఢిల్లీ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్(డవైడబ్ల్యూఏ) ఆధ్వర్యంలో సికందర్ చాంగేజ్ నిర్వహిస్తున్నాడు. ఆఖరి మొఘలు వంశంతో సన్నిహిత సంబంధాలున్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన అనుభవాలు ఇలా వివరించారు.. దాతల సహకారం: ‘మా వారసుల నుంచి వచ్చిన పుస్తక సంపదను లైబ్రరరీని స్ధాపించినప్పుడు (సుమారు 2000 పుస్తకాలు) దానం చేశాన’ని చెప్పారు. ప్రజలు ముందుకొచ్చి పుస్తకాలను దానం చేస్తున్నారు. అన్ని రకాల, భాషల పుస్తకాలు, అరుదైనవి అందజేస్తున్నారు. ఇప్పటి వరకు అరుదైన పుస్తకాలు 15,000 వరకు ఉన్నాయి. ఈ లైబ్రరరీకి పుస్తకాలను దానం చేయడం ఆయన స్ఫూర్తితో..అలా మొదలై కొనసాగుతోనే ఉంది. అరుదైన పుస్తక సంపద: 150 సంవత్సరాల క్రితం నాటి పద్య పుస్తకాలు(బహదూర్షా జాఫర్ కాలం నాటి) కూడా ఉన్నాయి. 90 ఏళ్ల నాటి ‘భగవద్గీత’ సంస్కృతం, ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంది. చివరి మొఘల్ రాజు బహదూర్ షా జాఫర్ సేకరించిన పద్యాల పుస్తకం ఎర్రకోటలోని రాయల్ ప్రెస్‌లో 1885లో ముద్రించారు. ఇది పంజాబీ భాషలో అచ్చు అయ్యింది. అదేవిధంగా 225 ఏళ్ల క్రితం పర్షియన్ రచయిత క్వాజీ సయ్యద్ అలీ రచించిన‘సాయిర్-ఉల్-ఎక్తాబ్’ ఈ పుస్తకం అరుదైనది. సూఫీ బోధనల పుస్తకాలు ఉన్నాయి.. ఉర్దూ, అరబిక్, పర్షియన్, ఇంగ్లిష్, టర్కిస్ భాషలల్లో డిక్షనరీలున్నాయి. 1870లో బోపాల్‌కు చెందిన బేగం ఆరు భాషల్లో రచించిన ‘ఖాజానతుల్ లుగాత్’ అనే పుస్తకం ఉంది. ఈ అరుదైన పుస్తకాన్ని అంతర్జాతీయ ఆదరణ ఉంది. దేశీయ విద్యార్థులు, స్కాలర్లతోపాటు వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు ఈ పుస్తకంపై అధ్యయనం, పరిశోధనలు చేస్తారని నిర్వాహకులు పేర్కొన్నారు.సమస్యల వలయంలో..: అట్లాంటి లైబ్రరరీకి ప్రస్తుతం స్థలం కొరత సమస్యగా మారింది. కొన్ని పుస్తకాలను కట్టలుగటి ఉంచాల్సి వస్తుంది. అంటే ఈ పుస్తక బండాగారం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోందని మహ్మద్ నయూమ్ చెప్పారు.