తెలుగు భాష వికాసం | story about telugu language | Sakshi
Sakshi News home page

తెలుగు భాష వికాసం

Published Thu, Oct 6 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM

తెలుగు భాష వికాసం

తెలుగు భాష వికాసం

తెలుగు భాషను తెనుగు, త్రిలింగం, ఆంధ్రం అని వ్యవహరిస్తారు. తెలుగు పదం ఆవిర్భావంపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. తెలుగు నేలపై శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం క్షేత్రాలున్నాయి. అందువల్లే ఈ ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని కూడా పిలుస్తారు. ఈ త్రిలింగం నుంచే తెనుగు పదం పుట్టిందనేది కొందరి వాదన. తెలుగు భాషకు శతాబ్దాల చరిత్ర ఉంది. తెలుగు భాషను పలువురు కింది విధంగా కీర్తించారు.
 
 తెలుగు భాషా చరిత్రను సాహిత్యకారులు మూడు భాగాలుగా విభజించారు. అవి..
 1.ప్రాకృత భాష ప్రభావం - శాతవాహనుల కాలం నుంచి క్రీ.శ.11వ శతాబ్దం వరకు ఉంది.
 2.సంస్కృత భాష ప్రభావం - క్రీ.శ. 11వ శతాబ్దం నుంచి క్రీ.శ.19వ శతాబ్దం వరకు ఉంది.
 3.పాశ్చాత్య ప్రభావం - క్రీ.శ.19వ శతాబ్దం నుంచి.
 
 తెలుగు భాష ఆవిర్భావానికి సంబంధించి సాహిత్యకారుల్లో వేర్వేరు అభిప్రాయాలున్నాయి. కొంతమంది ప్రాకృత, సంస్కృత భాషల నుంచి తెలుగు భాష ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. అయితే అత్యధిక మంది భాషావేత్తలు మాత్రం ద్రావిడ భాషా కుటుంబం నుంచి తెలుగు ఆవిర్భవించిందని పేర్కొన్నారు.
 
 ప్రస్తుతం వాడుకలో ఉన్న తెలుగు, ఆంధ్ర పదాల మధ్య విడదీయలేని బంధం ఉంది. క్రీ.పూ.2వ శతాబ్దం నుంచి క్రీ.శ. 2వ శతాబ్దం వరకు (శాతవాహనుల కాలంలో) ప్రాకృత భాషనే రాజ భాషగా పరిగణించారు. శాతవాహన రాజుల్లో 17వవాడైన హాలుడు గాథాసప్తశతిని ప్రాకృతంలో రచించాడు.
 
శాసనాల్లో తెలుగు భాష
క్రీ.శ.6వ శతాబ్దం నుంచి క్రీ.శ.8వ శతాబ్దం వరకు వేయించిన శాసనాల్లోని తెలుగు భాష చాలా ప్రాచీనమైందని తెలుస్తోంది. తెలుగు భాషలో మొట్టమొదటి శాసనం క్రీ.శ.575లో రేనాటి చోడులు వేయించిన ధనుంజయని కలమళ్ల శాసనం. ఇది తెలుగు శాసనాల్లో అత్యంత ప్రాచీనమైంది. ఇందులోని పద్య రచన ప్రాథమిక రూపంలో కనిపిస్తుంది. వీరి కాలంలో సుమారు 33 శాసనాలు వచనంలో ఉన్నాయి.
 
తూర్పు చాళుక్య రాజుల శాసనాల్లో తెలుగు వచనం కనిపించిన మొదటి శాసనం మొదటి జయసింహ వల్లభుని శాసనం (క్రీ.శ.641-673), కాగా రెండోది మంగిరాజు శాసనం (క్రీ.శ.682-706). వీరి తర్వాత చాళుక్య రాజులైన మూడో విష్ణువర్ధనుడు, గుణగ విజయాదిత్యుడు, చాళుక్య భీముడు, యుద్ధమల్లుడు, విమలాదిత్యుడు, రాజరాజనరేంద్రుడు వేయించిన తెలుగు శాసనాలు కూడా లభ్యమయ్యాయి. అయితే వాటిలో ప్రాకృత, సంస్కృత పదాలు అధికంగా కనిపిస్తాయి. అనంతర కాలానికి చెందిన అద్దంకి, ధర్మవరం, బెజవాడ, సామలూరు శాసనాల్లో వచనం, పద్యం కలిసి (మిశ్రమంగా) కన్పిస్తాయి. తొలి కాలానికి చెందిన శాసనాల్లో సంస్కృత తత్సమాలు, దీర్ఘ సమాసాలు ఉండగా, తర్వాతి కాలం శాసనా ల్లో దేశీయ పదాలు, మాండలికాలు అధికంగా ఉన్నాయి. రెండో దశకు చెందిన శాసనాల్లో ప్రాకృత, సంస్కృత ప్రభావం తగ్గింది.
 
9వ శతాబ్దం నాటి చాళుక్య భీముని కొరవి శాసనంలో తెలుగు లిఖిత సాహిత్యం కనిపిస్తుంది.గుణగ విజయాదిత్యుని సేనాని పంటరంగడు వేయించిన అద్దంకి శాసనంలో తరువోజ పద్యం కన్పించింది. పల్లెపాటలు, స్త్రీల పాటలు, దంపుడు పాటలు వంటివి తరువోజ ఛందస్సులోనే ఉన్నాయి. దీన్నుంచే ద్విపద (రెండు వరుసలు) పుట్టిందని ఆరుద్ర పేర్కొన్నారు. తరువోజ, ద్విపద, మధ్యాక్కర, సీసం వంటి వాటిని దేశీ ఛందస్సులుగా గుర్తించారు. గుణగ విజయాదిత్యుని కందుకూరు శాసనంలో సీస పద్యం, ధర్మవరం శాసనంలో ఆటవెలది, యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో మధ్యాక్కర (సంస్కృతేతర) పద్యాలు కన్పిస్తాయి.
 
తెలుగు సాహిత్యాభివృద్ధి - నన్నయ యుగం
తూర్పు చాళుక్యరాజైన రాజరాజ నరేంద్రుని కాలంలో నారాయణ భట్టు సహకారంతో నన్నయ భట్టు వ్యాసుని సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు. అనువాద ప్రక్రియ ఈ యుగం నుంచే ప్రారంభమైంది. ఆది, సభా పర్వాలతోపాటు అరణ్య పర్వంలోని కొంత భాగాన్ని నన్నయ తెలుగులోకి అనువదించాడు. నన్నయ మరణానంతరం సుమారు 200 ఏళ్ల తర్వాత తిక్కన.. మహాభారతంలోని 15 పర్వాలను తెలుగులోకి అనువాదం చేశాడు. నన్నయ అసంపూర్తిగా వదిలిపెట్టిన అరణ్య పర్వాన్ని తిక్కన పూర్తి చేయలేదు. తిక్కన, నిర్వచనోత్తర రామాయణంను తెలుగు వచనంలో రచించాడు. ఇతనికి కవి బ్రహ్మ, ఉభయకవి మిత్రుడు వంటి బిరుదులున్నాయి.
 
 ఎర్రాప్రగడ
ఇతడు క్రీ.శ.14వ శతాబ్దానికి చెందినవాడు. నన్నయ అసంపూర్తిగా రచించిన అరణ్య పర్వాన్ని ఎర్రాప్రగడ (ఎర్రన) పూర్తి చేశాడు. అలాగే హరివంశం, నృసింహ పురాణం వంటి ప్రబంధ కావ్యాలను రచించాడు. ప్రబంధ కావ్యాల మొదటి రచయితగా పేరుగాంచాడు. అందుకే ఇతడికి ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు ఉంది.సంస్కృత మహాభారతాన్ని నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడలు తెలుగులోకి అనువదించి ‘కవిత్రయం’గా ప్రసిద్ధి చెందారు.వాల్మీకి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని గోనబుద్ధారెడ్డి (కాకతీయ ప్రతాపరుద్రుడి కాలం నాటివాడు) రంగనాథ రామాయణం (ద్విపద) పేరుతో తెలుగులో రచించాడు.
 
 అదేవిధంగా మంత్రి భాస్కరుడు భాస్కర రామాయణాన్ని రాశాడు.
 నన్నయకు సమకాలికుడైన నన్నెచోడుడు కళ్యాణీ చాళుక్యుల సామంతుడు.
 ఒక చిన్న మండలాన్ని ఏలిన ఈ తెలుగు చోడ కవి యోధుడు కూడా.
 నన్నెచోడుడు ఒక యుద్ధంలో మరణించాడు.  ఇతడు నన్నయకు పూర్వం వాడని కొందరి వాదన.
 
 ఇతడు కుమార సంభవం అనే వర్ణనాత్మక కావ్యం రచించి కవిరాజశిఖామణిగా పేరొందాడు.శైవమత కవైన నన్నెచోడుడు కుమార సంభవం రచించాడు. ఇతని రచనల్లో మధురమైన పద చిత్రాలు, వర్ణనలు ఉంటాయి.నన్నెచోడుడు ఆ కాలంలో వాడుకలో ఉన్న దేశీయ పదాలు, దేశీయ ఛందస్సును అధికంగా ఉపయోగించాడు. అందువల్లే ఇతడు జాను తెనుగు రచయితగా పేరుగాంచాడు.
 మల్లికార్జున పండితారాధ్యుడు శివ భక్తుడు. శివతత్వసారం అనే గ్రంథాన్ని రచించాడు. తెలుగు శతక వాఙ్మయానికి ఒరవడి తీసుకొచ్చిన మరో శైవ కవైన యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకంరచించాడు. ఆంధ్ర దేశంలో వీరశైవ మతాన్ని బాగా ప్రచారం చేసినవారిలో మల్లికార్జున పండితారాధ్యుడు, పాల్కురికి సోమనాథుడు ప్రసిద్ధులు.
 
 పాల్కురికి సోమనాథుడు తన కావ్యాలను దేశీ ఛందస్సు అయిన ద్విపదలో రచించాడు. వీర శైవ మత స్థాపకుడైన బసవడు ఇతని గురువు.పాల్కురికి సోమనాథుడు వృషాధిప శతకం, బసవ పురాణం (బసవేశ్వరుని జీవితం), పండితారాధ్య చరిత్రలను జాన తెలుగులోకి (ద్విపదలో) రచించాడు. అందువల్లే ఇతణ్ని ద్విపద సాహిత్య పితామహుడిగా పేర్కొంటారు. బసవ పురాణాన్ని వీర శైవమత గ్రంథంగా పరిగణిస్తారు.సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో అనేక తరహా  జానపద గేయాలు, తుమ్మెద పదాలు, నివాళి పదాలు, వెన్నెల, గొబ్బి పదాలు, దంపుడు పాటలు, యక్షగానాలను పేర్కొన్నాడు. పల్లె పాటలు, జానపద నృత్యాలు, దేశీ నృత్యాల గురించి పండితారాధ్య చరిత్రలో వర్ణించాడు.
 
శరీనాథుడు, పోతన
తెలుగు సాహిత్యంలో తొలి కవిసార్వభౌముడుగా శ్రీనాథుడు ప్రసిద్ధి చెందాడు. ఇతడు సంస్కృత, తెలుగు భాషల్లో నిష్ణాతుడు. రెడ్డి రాజుల కాలంలో విద్యాధికారిగా నియమితుడయ్యాడు. సంస్కృత సాహిత్య గోష్టిలో విజయనగర రాయల ఆస్థాన కవుల్లో ఒకడైన డిండిమ భట్టును ఓడించి కవిసార్వభౌముడనే బిరుదు పొందాడు.
 
శ్రీహర్షుడు సంస్కృత భాషలో రచించిన శృంగారనైషధ  గ్రంథాన్ని శ్రీనాథుడు తెలుగులోకి అనువదించాడు. కాశీ ఖండం, భీమేశ్వర పురాణం, హరివంశం, పల్నాటి వీర చరిత్ర, క్రీడాభిరామం వంటి గ్రంథాలను తెలుగులో రచించాడు. క్రీడాభిరామం ఒక వీధి నాటకం. ఇది ఆనాటి సాంఘిక, మత పరిస్థితులను వివరిస్తుంది.
 
బమ్మెర పోతన (క్రీ.శ.1450-1510) మహాభాగవతాన్ని తెలుగులోకి అనువదించి ఆంధ్రుల అభిమాన కవిగా మారాడు. తెలుగు సాహిత్యంలో ఆంధ్ర మహాభాగవతం గ్రంథం అపూర్వమైంది. ఇందులో గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరిత్ర ఘట్టాలను సామాన్య ప్రజలు కూడా ఉటంకిస్తారు. పోతన, శ్రీనాథుని బావమరిది అని కొందరి అభిప్రాయం. పోతన రాజాస్థానాలను ఆశ్రయించలేదు. భాగవత గ్రంథాన్ని ఏ రాజుకీ అంకితమివ్వలేదు. ఇతడు వీరభద్ర విజయం, భోగినీ దండకం అనే గ్రంథాలను కూడా రచించాడు.
 
 ఈ కాలంలోనే గౌరన ద్విపదలో హరిశ్చంద్రోపాఖ్యానం, పినవీరభద్రుడు శృంగార శాకుంతల నాటకాన్ని  తెలుగులో రచించారు.గోల్కొండనేలిన కుతుబ్‌షాహీలు తెలుగు సాహిత్యాన్ని పోషించారు.ఇబ్రహీం కుతుబ్‌షా.. కందుకూరు రుద్రయ్యను పోషించాడు. ఇతడు జనార్దనాష్టకం, సుగ్రీవ విజయం, నిరంకుశోపాఖ్యానం గ్రంథాలనుతెలుగులో రచించాడు.ఈ కాలంలోనే పొన్నగంటి తెలగనార్యుడు అచ్చతెలుగులో యయాతి చరిత్ర రచించాడు.కంచెర్ల గోపన్న (రామదాసు) దాశరథీ శతకాన్ని రచించాడు.మల్లారెడ్డి.. పద్మ పురాణం రాశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement