‘భాషకు కులం, మతం ఉండవు’ అంటోంది సల్మా. ‘ఇతర మతస్తులు ఉర్దూ, పర్షియన్ భాషలు అధ్యయనం చేస్తున్నప్పుడు నేను సంస్కృతం ఎందుకు చదవకూడదు?’ అని కూడా అంటోంది. గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఆమె తాజాగా సంస్కృతం భాషలో పిహెచ్.డి తీసుకుంది. రోజు కూలీ కుమార్తె అయిన సల్మా సంస్కృతంలో ప్రొఫెసర్ అయ్యేందుకు సంకల్పించింది. గుజరాత్‌లో ఈ ఘనత సాధించిన తొలి ముస్లిం అమ్మాయి సల్మా.
ఇటీవల గుజరాత్ యూనివర్సిటీలో జరిగిన ఒక పిహెచ్.డి ప్రదానం అక్కడి వైస్ చాన్సలర్‌తో సహా చాలా మందిని సంతోషపెట్టింది. దానికి కారణం ఎవరూ పై చదువులు చదువుకోని ఒక ముస్లిం కుటుంబం నుంచి ఒక అమ్మాయి పిహెచ్.డి చేసింది. అందునా సంస్కృతం లో చేసింది. ప్రతి భాష ప్రతి ఒక్కరిది అని ఆమె ఈ విధానం ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది. అంతేకాదు, ఇష్టమైన భాషలో పరిశోధన ఇచ్చే గుర్తింపు కూడా గొప్పది అని చాటి చెప్పింది. ఆ అమ్మాయి 26 సంవత్సరాల సల్మా ఖురేషి.
‘సంస్కృతం దేవతల భాష అంటారు కొందరు. మరికొందరు అది బ్రాహ్మణుల భాష అని అంటారు. కాని ఏ భాషకూ కులం, మతం, ప్రాంతం ఉండవు. నేను నా హైస్కూల్ చదువు నుంచి సంస్కృతం చదువుతున్నాను. ఎందుకంటే ఆ సబ్జెక్ట్‌లో నాకు మార్కులు ఎక్కువ వచ్చేవి. అయితే మార్కులతో నిమిత్తం లేని ఆసక్తి మెల్లగా ఆ భాషను చదివే కొద్దీ నాకు పెరిగింది. పురాణాలు, ఉపనిషద్‌లు, వేదాలు... వీటిని చదువుతూ ఆ భాష పట్ల ఆసక్తి పెంచుకున్నాను’ అంది సల్మా ఖురేషి.
సౌరాష్ట్ర యూనివర్సిటీ నుంచి సంస్కృతంలో డిగ్రీ చేసిన సల్మా భావ్‌నగర్ యూనివర్సిటీ నుంచి ఎం.ఏ. సంస్కృతం చేసి గుజరాత్ యూనివర్సిటీలో పిహెచ్.డి.కి ఎన్‌రోల్ అయ్యింది. ‘నేను 15 మంది ఉండే ఉమ్మడి కుటుంబంలో నుంచి వచ్చాను. సంస్కృతం చదువుకుంటానంటే ఒక్కరూ వద్దనలేదు. మా నాన్న కూలి పని చేస్తాడు. ఆయన నేను చదువుకుంటే సంతోషపడ్డాడు’ అంది సల్మా.
సల్మా పిహెచ్.డి టాపిక్ ‘పురాణేషు నిరూపిత శిక్షపద్ధతి ఏకధ్యాయనం’. పురాణ కాలం నుంచి గురు శిష్య పరంపర ద్వారా విద్యావిధానం ఎలా కొనసాగింది అనేది దీని వివరణ. ఆమెకు గైడ్‌గా వ్యవహరించిన అతుల్ ఉనగర్ తన శిష్యురాలిని చూసి గర్వపడుతున్నారు. ‘గుజరాత్ యూనివర్సిటీలో ఇద్దరు విద్యార్థినులే సంస్కృతం లో పిహెచ్.డి చేస్తున్నారు. సల్మా కాకుండా ఇంకొక అమ్మాయి కూడా ముస్లిమే. ఆమె పేరు ఫరీదా. సల్మా కజిన్ ఆ అమ్మాయి. కాళిదాసు, భాసుడు సంస్కృతంలో కావ్యాలు రాసినప్పుడు వాటిని ఫలానా వారు మాత్రమే చదవాలని ఎక్కడా చెప్పలేదు. కాలక్రమంలో సంస్కృతాన్ని కొందరి భాషగా చేసి పెట్టారు. సంస్కృత భాష ద్వారా మన ప్రాచీన సాహిత్యాన్ని అర్థం చేసుకుని ప్రజలకు చేర్చాల్సిన అవసరం ఉంది’ అన్నాడాయన.
సల్మా సంస్కృతంలో పిహెచ్.డి చేయడాన్ని ప్రశంసించిన గుజరాత్ యూనివర్సిటీ వి.సి హిమాంశు ‘వివిధ భాషల అధ్యయనం ద్వారా కెరీర్ పొందాలనుకునేవారు సల్మాను చూసి స్ఫూర్తి పొందుతారని ఆశిస్తాను’ అన్నారు.
సల్మా స్ఫూర్తినిస్తుందనే ఆశిద్దాం.
గుజరాత్‌లో సల్మా ఘనత
Published Fri, Dec 11 2020 12:44 AM | Last Updated on Fri, Dec 11 2020 8:40 AM
1/1
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment