Technical education course
-
మే 13 నుంచి ఏపీఈఏపీ సెట్..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంప్రదాయ, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కామన్ ఎంట్రన్స్ టెస్టు (సెట్)ల తేదీలను ఉన్నత విద్యామండలి బుధవారం విడుదల చేసింది. మే 6వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు 9 రకాల సెట్స్‌ను నిర్వహించనుంది. ఆయా వర్సిటీలకు ఒక్కో సెట్ నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తూ కన్వీనర్లను నియమించింది. త్వరలోనే సెట్స్ కమిటీలతో సమావేశం నిర్వహించి దశలవారీగా ప్రవేశాల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపరీక్షల విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. విద్యార్థులకు మేలుచేస్తూ ఎంసెట్ స్థానంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు ఒకే ఎంట్రన్స్ టెస్టు (ఈఏపీసెట్) నిర్వహిస్తున్నారు. ఈ విధానం సత్ఫలితాలివ్వడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఏడాది నుంచి అక్కడి ఎంసెట్‌ను ఈఏపీసెట్‌గా మార్చింది. గతంలో పీజీ ప్రవేశాలకు వర్సిటీల వారీగా నోటిఫికేషన్లు వచ్చేవి. విద్యార్థి వర్సిటీలకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. ఫలితంగా పేద విద్యార్థులపై ఆర్థికభారం ఎక్కువయ్యేది. దీన్ని గమనించిన ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు ఒకే ఎంట్రన్స్ టెస్టును తీసుకొచ్చింది. ఇందులో అర్హత సాధించిన విద్యార్థుల ర్యాంకుల ఆధారంగా వర్సిటీల్లో సీట్లు భర్తీచేస్తోంది. దీంతో ప్రతిభగల విద్యార్థికి ఏ వర్సిటీలోనైనా చదువుకునే అవకాశం దక్కుతోంది. -
ఐదు జవాబులు రాస్తే సరి..
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ సాంకేతిక విద్య కోర్సుల్లోని విద్యార్థులకు యూనివర్సిటీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కనీస హాజరుశాతం నుంచి మినహాయింపునిచ్చింది. అలాగే సులభతరమైన పరీక్షావిధానాన్ని ప్రకటించింది. గతానికి భిన్నంగా ఈ సారి కేవలం 8 ప్రశ్నలనే పరీక్షల్లో ఇస్తారు. ఇందులో ఐదింటికి సమాధానం రాస్తే సరిపోతుంది. బీటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మాడీ, ఫార్మాడీ (పీబీ) కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఇది వర్తిస్తుందని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ డాక్టర్ మంజూర్ హుస్సేన్ బుధవారం ‘సాక్షి’ప్రతినిధికి తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 లక్షల (నాలుగేళ్లకు కలిపి)మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. మిగతా యూనివర్సిటీలు కూడా ఇదే విధానాన్ని అనుసరించనున్నట్టు ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి. గతానికి ఇప్పటికీ తేడా ♦సాధారణంగా కాలేజీ పనిదినాల్లో 75 శాతం హాజరు ఉంటేనే పరీక్షలకు అనుమతిస్తారు. ఇందులో 10 శాతం మెడికల్ గ్రౌండ్లో మినహాయింపు ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ప్రత్యక్ష బోధన ఆలస్యమైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హాజరు శాతాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ♦కరోనాకు ముందు ప్రశ్నపత్రం రెండు భాగాలుగా (పార్ట్–ఏ, పార్ట్–బీ) ఉండేది. పార్ట్–ఏ నుంచి మూడు మార్కుల ప్రశ్నలు ఐదు, రెండు మార్కులవి 5.. మొత్తం 25 మార్కులుంటాయి. పార్ట్–బీలో ఐదు మార్కుల ప్రశ్నలు 10 ఇస్తారు. దీంతో రెండు పార్టుల్లో మొత్తం 75 మార్కులు, ఇంటర్నల్స్ 25 మార్కులకు పరీక్ష విధానం ఉండేది. ♦ఇప్పుడు ఒకే పార్ట్‌గా పరీక్ష ఉంటుంది. మొత్తం 8 ప్రశ్నలిస్తారు. ఇందులో ఐదింటికి జవాబులు రాస్తే సరిపోతుంది. ఒక్కో ప్రశ్నకు 15 మార్కులు.. మొత్తం 75 మార్కులుంటాయి. ఇంటర్నల్స్‌కు 25 మార్కులు ఉంటాయి. కనీస పాస్ మార్క్ 40 (ఇంటర్నల్స్‌తో కలిపి)గా నిర్ణయించారు. -
అడ్మిషన్ రద్దు చేసుకుంటే ఫీజు వాపసు ఇవ్వాల్సిందే
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, తదితర సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశం పొంది వివిధ కారణాలతో అడ్మిషన్‌ను రద్దు చేసుకునే విద్యార్థులకు ఫీజులు, సర్టిఫికెట్లను వారంలోపు తిరిగి ఇచ్చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తమ అడ్మిషన్‌ను రద్దు చేసుకునే విద్యార్థులతోపాటు మధ్యలో ఉపసంహరించుకునే విద్యార్థులకు కూడా ఫీజులు, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చేయాలని అన్ని సాంకేతిక ఉన్నత విద్యా సంస్థలకు సూచనలు ఇచ్చింది. కోవిడ్–19తో తలెత్తిన అత్యవసర పరిస్థితి నేపథ్యంలో ఇది ప్రతి విద్యా సంస్థ ప్రాథమిక బాధ్యతగా గుర్తెరగాలని పేర్కొంది. పూర్తి ఫీజు వాపసుతో సాంకేతిక కోర్సుల సీట్ల అడ్మిషన్‌ను రద్దు చేసుకోవడానికి గడువు నవంబర్ 10గా ఏఐసీటీఈ ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరికొన్ని అంశాలను జోడిస్తూ ఇచ్చిన తాజా ఉత్తర్వులు ఇలా.. ► నవంబర్ 10 కంటే ముందుగా విద్యార్థి తన అడ్మిషన్‌ను ఉపసంహరించుకుంటే వసూలు చేసిన మొత్తం ఫీజులో రూ.1,000 లోపు ప్రాసెసింగ్ ఛార్జీలను మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని విద్యా సంస్థలు తిరిగి చెల్లించాలి. ► ఒకవేళ నవంబర్ 10 తర్వాత విద్యార్థి అడ్మిషన్‌ను వదిలేస్తే.. ఖాళీ అయ్యే ఆ సీటును నవంబర్ 15లోగా వేరే విద్యార్థితో భర్తీ చేసుకుంటే రూ.1,000కి మించకుండా ప్రాసెసింగ్ ఛార్జీలు తీసుకోవచ్చు. దీంతోపాటు విద్యార్థి ఎన్ని రోజులపాటు ఉన్నాడో ఆ మేరకు ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు (హాస్టల్ ఉంటేనే)ను మినహాయించుకుని తక్కిన మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాలి. ► నవంబర్ 10 తర్వాత ఖాళీగా ఉన్న సీటు నవంబర్ 15 వరకు భర్తీ కాకపోతే ఆ విద్యా సంస్థ సదరు విద్యార్థికి సెక్యూరిటీ డిపాజిట్‌ను తిరిగి చెల్లించాలి. సర్టిఫికెట్లు కూడా వెనక్కి ఇవ్వాలి. ► విద్యార్థి అడ్మిషన్‌ను వదులుకుని సంస్థ నుంచి వెళ్లిపోవాలనుకుంటే తదుపరి సెమిస్టర్లు, సంవత్సరాలకు సంబంధించిన ఫీజును అడగరాదు. ► ప్రవేశాన్ని రద్దు చేయడం లేదా ఫీజును వాపసు చేయడంలో ఆలస్యం, ఏఐసీటీఈ మార్గదర్శకాలను పాటించకున్నా చర్యలు తప్పవు. -
ఏపీ సెట్లకూ కరోనా కష్టాలు
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి రాష్ట్రంలోని ఇంజనీరింగ్ సహా వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలపై కూడా తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, బీఈడీ, బీపీఈడీ తదితర కోర్సులకు నిర్వహించే ఎంసెట్, ఐసెట్, ఈసెట్, ఎడ్‌సెట్ సహా వివిధ సెట్ల పరీక్షలు నిర్ణీత సమయంలో నిర్వహించగలుగుతామా? లేదా అన్న సందేహాలు అధికారులు వ్యక్తపరుస్తున్నారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో పరీక్షల ఏర్పాట్లు నిలిచిపోయాయి. మరోపక్క ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఏప్రిల్ 5, 7, 9 తేదీల్లో జరగాల్సి ఉండగా జాతీయ పరీక్షల మండలి (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) వాయిదా వేసింది. తదుపరి షెడ్యూల్‌ను 31వ తేదీ తరువాత విడుదల చేస్తామని ప్రకటించింది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించాల్సి ఉన్న నీట్‌ను కూడా మే 3వ తేదీ నుంచి నెలాఖరు వరకు వాయిదా వేసింది. ఏప్రిల్ 15 తరువాత పరిస్థితులను అంచనా వేశాక షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ముందుకు సాగని కార్యకలాపాలు.. - రాష్ట్రంలో ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్లకు ఉన్నత విద్యామండలి ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదల చేసింది. - ఎంసెట్ ఆన్లైన్ దరఖాస్తు గడువు మార్చి 29 వరకు ఉండగా దాన్ని ఏప్రిల్ 5 వరకు పొడిగించారు. - ఈసెట్, ఐసెట్ గడువును ముందు ఏప్రిల్ 2 వరకు నిర్ణయించగా.. దాన్ని ఏప్రిల్ 9 వరకు పొడిగించారు. - లాక్డౌన్ కారణంగా దరఖాస్తుల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. అందువల్ల గడువు మరోసారి పొడిగించాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. - సెట్ల నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాలు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అత్యవసర కార్యకలాపాలు మినహా మిగతావన్నీ నిలిచిపోయాయి. - ఈ పరీక్షలకు సంబంధించి ఆన్లైన్ సేవలందిస్తున్న టీసీఎస్‌లో కూడా పరిమిత సంఖ్యలో ఉద్యోగులనే అనుమతిస్తుండడంతో హెల్ప్‌లైన్ సెంటర్లపై ప్రభావం పడింది. - ఆయా ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నల రూపకల్పన వంటి ప్రక్రియలు కూడా ప్రస్తుతం మధ్యలో నిలిచిపోయినట్లు మండలి వర్గాలు పేర్కొంటున్నాయి. - జాతీయస్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్స్ వంటి పరీక్షలు కూడా వాయిదా పడిన నేపథ్యంలో ఎంసెట్ తదితర పరీక్షలను కూడా రీ షెడ్యూల్ చేయాల్సి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. - దీనిపై ఆయా ఉమ్మడి ప్రవేశ పరీక్షల కమిటీలు సమావేశమై నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని మండలి ఉన్నతాధికారి ఒకరు వివరించారు. పరీక్షల తేదీలు ఇలా ఉన్నాయి ఎంసెట్ (ఇంజనీరింగ్): ఏప్రిల్ 20 నుంచి 23 వరకు ఎంసెట్ (అగ్రికల్చర్): ఏప్రిల్ 23, 24 ఈసెట్: ఏప్రిల్ 30, ఐసెట్: ఏప్రిల్ 27 పీజీఈసెట్: మే 2, 3, 4 ఎడ్‌సెట్: మే 9, లాసెట్: మే 8 పీఈసెట్: మే 5, 6, 7, 8 -
ఇక కృత్రిమ మేధను చదివేయొచ్చు..
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ హైదరాబాద్ వంటి జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థలే కాదు.. రాష్ట్ర స్థాయి విద్యా సంస్థల్లోనూ ఆధునిక సాంకేతిక విద్యా కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి కోర్సులను ప్రవేశపెట్టేందుకు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు ముందుకొచ్చాయి. దీంతో జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలు అందుకు ఓకే చెప్పాయి. వీటి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 4 కాలేజీలకు ఆమోదం తెలపగా, మరో రెండు కాలేజీలకు ఒకట్రెండు రోజుల్లో ఆమోదం తెలపనుంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా.. కేంద్ర విధాన నిర్ణయాల్లో భాగంగా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. 2019–20 విద్యా సంవత్సరం నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బిగ్ డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ వంటి కోర్సులను అమల్లోకి తెచ్చేందుకు విద్యా సంస్థలు ముందుకు రావాలని సూచించింది. ఏఐ నైపుణ్యాలు కలిగిన వారికి మార్కెట్లో విపరీత డిమాండ్ ఉండగా, ఆ నైపుణ్యం ఉన్న వారు 2.5 శాతమే ఉన్నట్లు నేషనల్ ఎంప్లాయిబిలిటీ సర్వేలో తేలింది. 2016లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ విలువ 3.2 బిలియన్ డాలర్లు కాగా, 2025 నాటికి 89.86 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం వంటి సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పరిశోధనల కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మొదట ఐఐటీ హైదరాబాద్ ముందుకు వచ్చి ఈ విద్యా సంవత్సరం నుంచే ఏఐని అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర స్థాయి విద్యా సంస్థలు కూడా గత 8 నెలలుగా ఆయా కోర్సులపై కసరత్తు చేశాయి. కోర్సుల డిజైనింగ్, బోధన సిబ్బంది తదితరాలపై ప్రణాళికలు రూపొందించుకుని వర్సిటీల నుంచి ఆమోదం పొందాయి. ఏడు కాలేజీల్లో కొత్త కోర్సులు.. రాష్ట్రంలోని ఏడు కాలేజీల్లో ఆరు రకాల కొత్త కోర్సులను ప్రవేశ పెట్టేందుకు రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ముందుకొచ్చాయి. ఏఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి ప్రధాన అంశాలతో స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కాలేజీ బీటెక్ కంప్యూటర్ ఇంజనీరింగ్ పేరుతో కొత్త కోర్సును రూపొందించింది. ఇక బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రత్యేక కోర్సుగా సీవీఎస్ఆర్ కాలేజీ, విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అందుబాటులోకి తెస్తోంది. కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్‌ను వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి, కంప్యూటర్‌సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సీవీఆర్ కాలేజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (నెట్వర్క్స్)ను, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కోర్సులను కిట్స్ కాలేజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కోర్సును మల్లారెడ్డి కాలేజీలో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాయి. ఇందులో సీవీఎస్ఆర్, విద్యాజ్యోతి, వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి, మల్లారెడ్డి కాలేజీల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ఓకే చెప్పింది. రెండుమూడు రోజుల్లో స్టాన్లీ, కిట్స్ కాలేజీల్లోనూ ప్రవేశాలకు అనుమతి లభించనున్నట్లు ఉన్నత విద్యా శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రతి కాలేజీకి 60 సీట్లు.. మొదటిసారిగా కోర్సును ప్రవేశ పెడుతున్నందున 60 సీట్లకే వర్సిటీలు ఆమోదం తెలిపాయి. దీంతో మొత్తంగా ఆయా కాలేజీల్లోని ఆయా కోర్సు ల్లో 480 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు వివిధ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో అదనపు సీట్ల పెంపునకు ప్రభుత్వం ఓకే చెప్పింది. 13 ఇంజనీరింగ్ కాలేజీల్లో 780 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇన్నాళ్లు బీటెక్ ఎంబీఏగా ఇంటిగ్రేటెడ్ కోర్సును రద్దు చేసి, ఆ సీట్లను బీటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్‌లో కలిపింది. ఇందులో గతంలో 75 సీట్లు మాత్రమే ఉండగా, ఇ ప్పుడు వాటి సంఖ్య 150కి చేరుకోనుంది. బీటెక్‌తోపాటు ఎంటెక్ కలిగిన ఈ ఐదేళ్ల కోర్సుకు డిమాండ్ ఉండటంతో జేఎన్టీయూ ఈ మేరకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వం అందుకు ఓకే చెప్పింది. -
కోరుకున్న చోట సర్టిఫికెట్ల వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో చేరే విద్యార్థులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం తమ ర్యాంకు ప్రకారం కేటాయించిన హెల్ప్‌లైన్ కేంద్రానికి వెళ్లి చేయించుకోవాల్సి వచ్చేది. ఇందుకోసం ఒక్కోసారి ఎక్కువ దూరం వెళ్లాల్సి వచ్చేది. ఇకపై అలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ కేంద్రానికి వెళ్లి, తమకు నచ్చిన తేదీల్లో, వీలైన సమయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకునేలా చర్యలు చేపట్టింది. ఇందుకు స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తేనుంది. శుక్రవారం సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని అన్ని వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్‌ల్లో అమలు చేయాలని నిర్ణయించింది. ప్రవేశాల షెడ్యూల్ ప్రకటించాక నిర్ణీత తేదీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అయితే ఇందులో ప్రతి గంటను ఒక స్లాట్‌గా విభజిస్తారు. విద్యార్థులు అందులో ఏదో ఒక రోజులో వీలైన ఏదో ఒక సమ యాన్ని ఫీజు చెల్లించాక స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈ క్రమంలో విద్యార్థి ఆన్లైన్లో హెల్ప్‌లైన్ కేంద్రాన్ని, సమయాన్ని ఎంచుకోవాలి. అలా స్లాట్ బుక్ చేసు కున్న విద్యార్థి సంబంధిత హెల్ప్‌లైన్ సెంటర్‌కు నిర్ణీత సమయంలో వెళ్లి తమ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఆ తర్వాత వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. పాలిసెట్ కౌన్సెలింగ్ నుంచి ప్రారంభం ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న పాలిటెక్నిక్ కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్ నుంచి దీనిని అమల్లోకి తీసుకువస్తోంది. విద్యార్థి ఒకవేళ నిర్ణీత సమయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకాని పరిస్థితి ఉంటే ప్రవేశాల కమిటీకి మెయిల్ ఐడీకి మెయిల్ చేస్తే అతనికి తర్వాత వెరిఫికేషన్ చేపట్టేలా ఏర్పాట్లు చేస్తామని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. దీన్ని పాలిసెట్కే కాకుండా ఎంసెట్, ఈసెట్ వంటి ఇతర వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్‌ల్లోనూ అమలు చేయనున్నట్లు వివరించారు. -
ఓడలు బళ్ళు.. బళ్ళు ఓడలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాంకేతిక విద్యా కోర్సులను అభ్యసించేందుకు విద్యార్థుల్లో ఆసక్తి తగ్గిపోతోంది. నాణ్యత ప్రమాణాలు కొరవడటంతో ఆయా కోర్సుల్లో చేరేందుకు ముందుకు రావడం లేదు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్ వంటి కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య గత మూడేళ్లలో క్రమంగా తగ్గుతూ వస్తోంది. మరోవైపు సంప్రదాయ డిగ్రీలైన బీకాం, బీఎస్సీలలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సైన్సు, కామర్స్ రంగాల్లో అవకాశాలు పెరుగుతుండటంతో వీటిలో చేరే వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఇంజనీరింగ్ కన్వీనర్ కోటాలో చేరిన విద్యార్థుల సంఖ్య గత మూడేళ్లలో 6 వేల వరకు తగ్గిపోగా, సంప్రదాయ డిగ్రీల్లో చేరిన వారి సంఖ్య గత ఏడాదికి, ఇప్పటికి 25 వేలకు పైగా పెరగడం గమనార్హం. ఉన్నత విద్యా శాఖ తాజాగా తేల్చిన లెక్కల్లో ఈ వాస్తవం బయటపడింది. సంప్రదాయ డిగ్రీల్లో భారీ పెరుగుదల.. రాష్ట్రంలో సంప్రదాయ డిగ్రీలైన బీఏ, బీకాం, బీఎస్సీలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతేడాదికి ఇప్పటికి పోల్చితే బీఏలో 8 వేలకు పైగా విద్యార్థుల సంఖ్య పెరిగింది. అలాగే బీకాంలో 16 వేల వరకు పెరగగా, బీఎస్సీలో 10 వేల వరకు విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఇంజనీరింగ్ కన్వీనర్ కోటాలో 2016–17 విద్యా సంవత్సరంలో 71,066 సీట్లు అందుబాటులో ఉంటే అందులో 54,064 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇక 2018–19 విద్యా సంవత్సరంలో 66,079 సీట్లు అందుబాటులో ఉండగా, అందులో 48,662 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇక ఎంబీఏ, ఎంసీఏలోనూ 2016–17లో 24,557 సీట్లు అందుబాటులో ఉండగా, అందులో 22,479 సీట్లు భర్తీ అయ్యాయి. అదే 2018–19కి వచ్చే సరికి 25,912 సీట్లు అందుబాటులో ఉండగా కేవలం 21,767 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. పాలిటెక్నిక్‌లోనూ 2016 విద్యా సంవత్సరంలో 50,721 సీట్లు అందుబాటులో ఉంటే అందులో 36,983 సీట్లు భర్తీ అయ్యాయి. అదే 2018 విద్యా సంవత్సరంలో 38,359 సీట్లు అందుబాటులో ఉంటే అందులో 29,310 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. -
ఆ కోర్సులు మాకొద్దు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులకు ఆదరణ తగ్గుతోంది. విద్యా బోధనలో నాణ్యత కొరవడటం.. ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్స్ (ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ ఆప్లికేషన్స్ (ఎంసీఏ), మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ఎంటెక్) తదితర కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు వెనుకంజ వేస్తున్నారు. సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సెట్స్)లకు గతేడాది 4,56,990 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ సారి 4,00,953 మందే దరఖాస్తు చేసుకున్నట్లు ఉన్నత విద్యా మండలి లెక్కలు తేల్చింది. అంటే గతేడాదితో పొలిస్తే దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 56 వేలు తగ్గింది. ఎడ్‌సెట్‌కు భారీగా తగ్గిన దరఖాస్తులు ఎడ్‌సెట్ దరఖాస్తులు గతేడాది కంటే 40 శాతం తగ్గాయి. 2017లో 64,029 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ సారి 38,414 మందే పరీక్షకు హాజరవనున్నారు. ఐసెట్ రాసేందుకు గతేడాది 77,422 మంది.. ఈ సారి 62,631 మంది ఆసక్తి చూపారు. ఎంటెక్, న్యాయ విద్య, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులకూ ఆదరణ తగ్గుతోంది. అలాగే ఎంటెక్ కోసం ప్రవేశ పరీక్ష రాసే వారి సంఖ్య గతేడాదితో పోలిస్తే 12,668 తగ్గింది. అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ రాసే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గింది. గతేడాది 79,033 మంది.. ఈ సారి 73,106 మంది దరఖాస్తు చేసుకున్నారు. బీటెక్‌పై డిప్లొమా విద్యార్థుల్లో ఆసక్తి పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది కంటే ఈ సారి 2,788 మంది ఎక్కువగా ఈసెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఎంసెట్ ద్వారా బీటెక్‌లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న వారి కూడా సంఖ్య పెరిగింది. గతేడాది 1,41,137 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ సారి 1,47,958 మంది పరీక్ష రాయనున్నారు. మార్పులతోనే తగ్గుదల గతంలో డిగ్రీల కోసం ఏదో ఓ కాలేజీలో చేరడం.. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకపోవడంతోనే ఆదరణ తగ్గుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. యూనివర్సిటీలు కూడా నిబంధనలు కఠినం చేయడంతో చదువుకోవాలన్న శ్రద్ధ ఉన్న విద్యార్థులే కాలేజీల్లో చేరుతున్నారని చెబుతున్నారు. ఉన్నత విద్యలో సంస్కరణలూ సంఖ్య తగ్గడానిక మరో కారణమని పేర్కొంటున్నారు. ఉపాధి అవకాశాలు తగ్గినందునే ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో విద్యా ర్థుల సంఖ్య తగ్గుతోంది. విద్యార్థుల ఆలోచన ల్లోనూ మార్పొచ్చింది. అనవసరంగా ఫీజులు చెల్లించి చదువలేకపోతే ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. పైగా నాణ్యత లేకుండా చదివినా ప్రయోజనం ఉండదని, ఉపాధి లభించదని అవగాహనకొచ్చారు. అందుకే సీరియస్‌గా చదువుకోవాలనుకునే వారే వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో చేరుతు న్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు బీఎడ్ వారు అర్హులు కాదని, ఎస్జీటీ వారే అర్హులని ఎన్సీటీఈ ఉత్తర్వులు ఇవ్వడం.. బీఎడ్‌ను రెండేళ్ల కోర్సుగా మార్పు చేయడంతో నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. – ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ -
అన్నీ ఆన్లైన్లోనే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల ప్రవేశాల్లో విద్యార్థులకు ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తేవాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఉమ్మడి ప్రవేశ పరీక్షలు రాసి, కౌన్సెలింగ్ ద్వారా సీట్లు లభించిన విద్యార్థులు ఇకపై ఫీజులను చలానా రూపంలో బ్యాంకుల చుట్టూ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రవేశాల క్యాంపు కార్యాలయం చర్యలు చేపడుతోంది. చలానా విధానాన్ని ఈ సారి పూర్తిగా తొలగించి రిజిస్ట్రేషన్ నుంచి మొ దలుకొని ట్యూషన్ ఫీజు వరకు ఆన్లైన్లో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాం కింగ్ ద్వారా చెల్లించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇబ్బందులకు చెల్లు చీటీ ఎంసెట్, ఐసెట్, ఈసెట్, పాలీసెట్ తదితర ప్రవేశ పరీక్షల ద్వారా సీట్లు పొందే దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నారు. సీట్లు కేటాయించే సమయంలో కనీస ఫీజున్న కాలేజీల్లో మినహా మిగతా కాలేజీల్లో మొదటి విడత కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు పొందే విద్యార్థులు అదనపు ఫీజులను చలానా జనరేట్ చేసుకొని బ్యాంకులకు వెళ్లి చెల్లించాల్సి వచ్చేది. ఇక ఫీజు రీయింబర్స్మెంట్ రాని ఓసీ విద్యార్థులైతే మొత్తం ఫీజులను ఇలాగే చెల్లించేవారు. అలా మొదటి విడతలో సీటు వచ్చి ఫీజు చెల్లించిన విద్యార్థులకు రెండో విడత కౌన్సెలింగ్‌లో ఎక్కువ ఫీజు ఉన్న మరో కాలేజీలో సీటు వస్తే అదనపు ఫీజును మళ్లీ బ్యాం కులకు వెళ్లి చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు రెండో విడతలో తక్కువ ఫీజు ఉన్న కాలేజీలో సీటు వస్తే.. ముందుగా చెల్లించిన ఎక్కువ మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు అన్ని కౌన్సెలింగ్‌లు, ప్రవేశాలు పూర్తయ్యే వరకు ఆగాల్సి వస్తోంది. అంతేకాదు ఆ మిగతా మొత్తాన్ని తీసుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌లోని ప్రవేశాల క్యాంపు కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. ఇకపై ఆ అవసరం ఉండకుండా చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్ రావాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు ఫీజుల చెల్లింపులో ఇబ్బందులను తొలగించడంతోపాటు అదనపు మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు విద్యార్థులు ఎవరూ హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రవేశాల క్యాంపు కార్యాలయం అధికారి బి.శ్రీనివాస్ వెల్లడించారు. ప్రవేశాల కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫీజును కూడా ఆన్లైన్లో చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు రెండో విడత, మూడో విడత కౌన్సెలింగ్‌లలో ఎక్కువ ఫీజున్న కాలేజీల్లో సీట్లు వస్తే అదనపు ఫీజును ఆన్లైన్లో చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు రెండు, మూడు విడతల్లో తక్కువ ఫీజు ఉన్న కాలేజీల్లో సీటు వస్తే మొదటి విడతలో చెల్లించిన ఫీజులో రెండు, మూడు విడతల్లో సీటు వచ్చిన కాలేజీ ఫీజు పోగా మిగతా మొత్తాన్ని ఆ విద్యార్థి ఆన్లైన్లో చెల్లించిన అకౌంట్‌కే తిరిగి వెనక్కి పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. తద్వారా విద్యార్థులు హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని వెల్లడించారు. -
ఉపాధికి టెక్నిక్
పాలిటెక్నిక్ కోర్సుకు పెరుగుతున్న ఆదరణ పాలీసెట్ - 2016 దరఖాస్తుల విక్రయూలు ప్రారంభం పోచమ్మ మైదాన్: అతి తక్కువ కాల వ్యవధిలో ఉపాధికి బాటలువేసే సాంకేతిక విద్యా కోర్సు పాలిటెక్నిక్. దీనిలో చేరేవారి సంఖ్య ఏటా పెరుగుతూపోతోంది. ఈ కోర్సు పూర్తి చేసినవారు అనంతర కాలంలో ఈసెట్ పరీక్ష రాసి నేరుగా ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలోకి ప్రవేశం పొందొచ్చు. ఉపాధికి ఊతమివ్వడమే కాక.. భవిష్యత్తులో ఇంజినీరింగ్ చేయూలనే ఆశయంతో ఉన్న విద్యార్థుల పాలిట పాలిటెక్నిక్ వరంగా మారింది. ప్రవేశ విద్యార్హత పదోతరగతి. 2016-17 విద్యా సంవత్సరానికి పాలీసెట్ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల విక్రయూలు ఇప్పటికే ప్రారంభమయ్యూరుు. దరఖాస్తుల స్వీకరణ కోసం వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటుచేశారు. చివరి తేదీ ఏప్రిల్ 10 అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించేందుకు ఏప్రిల్ 10 చివరి తేదీ. ఈసారి టీఎస్ ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 21న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు అభ్యర్థులకు రాతపరీక్ష ఉంటుంది. ఇందులో 120 ప్రశ్నలు ఉంటాయి. 120 నిమిషాలు సమయం ఇస్తారు. గణితం 60 మార్కులు, భౌతికశాస్త్రం 30 మార్కులు, రసాయనశాస్త్రం 30 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. మే 3న పాలీసెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. 4 హెల్ప్‌లైన్ కేంద్రాలు అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించేందుకు వరంగల్‌లో 4 హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అవి వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్, మహిళా పాలిటెక్నిక్, స్టేషన్ ఘన్పూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్, పరకాల ప్రభుత్వ పాలిటెక్నిక్, మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని హెల్ప్‌లైన్ సెంటర్లలో అభ్యర్థులు ఎక్కడి నుంచైనా రూ.300 దరఖాస్తు రుసుము చెల్లించి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు నింపి కౌంటర్లో ఇస్తే వెంటనే అధికారులు హాల్ టికెట్‌ను జారీ చేస్తారు. జిల్లాలో 23 పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 5 ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవి కాగా, మిగిలినవన్నీ ప్రైవేటు యూజమాన్యాలకు చెందినవి. వీటిలో సుమారు 5040 దాకా సీట్లు ఉన్నాయి. ఈఈఈ,మెకానికల్, సివిల్, ఈసీఈ, సీఎంఈ, సీసీపీ స్పెషలైజేషన్లతో కోర్సులు అందిస్తున్నారు. చక్కటి కెరీర్‌కు వారధి పాలిటెక్నిక్ కోర్సు ఉపాధి అవకాశాలకు వారధి. త్వరగా ఉద్యోగం సంపాదించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. ఏటా దీనికి డిమాండ్ పెరుగుతోంది. ఈ కోర్సు చేసిన విద్యార్థులు అనంతర కాలంలో బీటెక్ కూడా చేయొచ్చు. చాలా కంపెనీలో టెక్నికల్ విభాగాల్లో ఉద్యోగాలు ఇస్తున్నారుు. - శంకర్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, వరంగల్