ఇక కృత్రిమ మేధను చదివేయొచ్చు.. | Technical Education System WIll Enter Into State Colleges | Sakshi
Sakshi News home page

ఇక కృత్రిమ మేధను చదివేయొచ్చు..

Published Thu, Jul 4 2019 2:54 AM | Last Updated on Thu, Jul 4 2019 9:38 AM

Technical Education System WIll Enter Into State Colleges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐఐటీ హైదరాబాద్‌ వంటి జాతీయ స్థాయి ఇంజనీరింగ్‌ విద్యా సంస్థలే కాదు.. రాష్ట్ర స్థాయి విద్యా సంస్థల్లోనూ ఆధునిక సాంకేతిక విద్యా కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో ఎంతో డిమాండ్‌ ఉన్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, బిగ్‌ డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, డేటా సైన్స్, మిషన్‌ లెర్నింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వంటి కోర్సులను ప్రవేశపెట్టేందుకు రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీలు ముందుకొచ్చాయి. దీంతో జేఎన్‌టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలు అందుకు ఓకే చెప్పాయి. వీటి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 4 కాలేజీలకు ఆమోదం తెలపగా, మరో రెండు కాలేజీలకు ఒకట్రెండు రోజుల్లో ఆమోదం తెలపనుంది.

మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా.. 
కేంద్ర విధాన నిర్ణయాల్లో భాగంగా మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. 2019–20 విద్యా సంవత్సరం నుంచే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), బిగ్‌ డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, డేటా సైన్స్, మిషన్‌ లెర్నింగ్‌ వంటి కోర్సులను అమల్లోకి తెచ్చేందుకు విద్యా సంస్థలు ముందుకు రావాలని సూచించింది. ఏఐ నైపుణ్యాలు కలిగిన వారికి మార్కెట్‌లో విపరీత డిమాండ్‌ ఉండగా, ఆ నైపుణ్యం ఉన్న వారు 2.5 శాతమే ఉన్నట్లు నేషనల్‌ ఎంప్లాయిబిలిటీ సర్వేలో తేలింది. 2016లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మార్కెట్‌ విలువ 3.2 బిలియన్‌ డాలర్లు కాగా, 2025 నాటికి 89.86 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం వంటి సంస్థలు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై పరిశోధనల కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మొదట ఐఐటీ హైదరాబాద్‌ ముందుకు వచ్చి ఈ విద్యా సంవత్సరం నుంచే ఏఐని అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర స్థాయి విద్యా సంస్థలు కూడా గత 8 నెలలుగా ఆయా కోర్సులపై కసరత్తు చేశాయి. కోర్సుల డిజైనింగ్, బోధన సిబ్బంది తదితరాలపై ప్రణాళికలు రూపొందించుకుని వర్సిటీల నుంచి ఆమోదం పొందాయి.

ఏడు కాలేజీల్లో కొత్త కోర్సులు.. 
రాష్ట్రంలోని ఏడు కాలేజీల్లో ఆరు రకాల కొత్త కోర్సులను ప్రవేశ పెట్టేందుకు రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలు ముందుకొచ్చాయి. ఏఐ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, బిగ్‌ డేటా అనలిటిక్స్‌ వంటి ప్రధాన అంశాలతో స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్‌ కాలేజీ బీటెక్‌ కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ పేరుతో కొత్త కోర్సును రూపొందించింది. ఇక బీటెక్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రత్యేక కోర్సుగా సీవీఎస్‌ఆర్‌ కాలేజీ, విద్యాజ్యోతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అందుబాటులోకి తెస్తోంది. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ బిజినెస్‌ సిస్టమ్స్‌ను వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి, కంప్యూటర్‌సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీని సీవీఆర్‌ కాలేజీ, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (నెట్‌వర్క్స్‌)ను, ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌ కోర్సులను కిట్స్‌ కాలేజీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఇంజనీరింగ్‌ కోర్సును మల్లారెడ్డి కాలేజీలో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాయి. ఇందులో సీవీఎస్‌ఆర్, విద్యాజ్యోతి, వీఎన్‌ఆర్‌ విజ్ఞాన జ్యోతి, మల్లారెడ్డి కాలేజీల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ఓకే చెప్పింది. రెండుమూడు రోజుల్లో స్టాన్లీ, కిట్స్‌ కాలేజీల్లోనూ ప్రవేశాలకు అనుమతి లభించనున్నట్లు ఉన్నత విద్యా శాఖ వర్గాలు వెల్లడించాయి. 

ప్రతి కాలేజీకి 60 సీట్లు.. 
మొదటిసారిగా కోర్సును ప్రవేశ పెడుతున్నందున 60 సీట్లకే వర్సిటీలు ఆమోదం తెలిపాయి. దీంతో మొత్తంగా ఆయా కాలేజీల్లోని ఆయా కోర్సు ల్లో 480 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు వివిధ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో అదనపు సీట్ల పెంపునకు ప్రభుత్వం ఓకే చెప్పింది. 13 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 780 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఇన్నాళ్లు బీటెక్‌ ఎంబీఏగా ఇంటిగ్రేటెడ్‌ కోర్సును రద్దు చేసి, ఆ సీట్లను బీటెక్‌ ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌లో కలిపింది. ఇందులో గతంలో 75 సీట్లు మాత్రమే ఉండగా, ఇ ప్పుడు వాటి సంఖ్య 150కి చేరుకోనుంది. బీటెక్‌తోపాటు ఎంటెక్‌ కలిగిన ఈ ఐదేళ్ల కోర్సుకు డిమాండ్‌ ఉండటంతో జేఎన్‌టీయూ ఈ మేరకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వం అందుకు ఓకే చెప్పింది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement