సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులకు ఆదరణ తగ్గుతోంది. విద్యా బోధనలో నాణ్యత కొరవడటం.. ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్స్ (ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ ఆప్లికేషన్స్ (ఎంసీఏ), మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ఎంటెక్) తదితర కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు వెనుకంజ వేస్తున్నారు. సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సెట్స్)లకు గతేడాది 4,56,990 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ సారి 4,00,953 మందే దరఖాస్తు చేసుకున్నట్లు ఉన్నత విద్యా మండలి లెక్కలు తేల్చింది. అంటే గతేడాదితో పొలిస్తే దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 56 వేలు తగ్గింది.
ఎడ్‌సెట్‌కు భారీగా తగ్గిన దరఖాస్తులు
ఎడ్‌సెట్ దరఖాస్తులు గతేడాది కంటే 40 శాతం తగ్గాయి. 2017లో 64,029 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ సారి 38,414 మందే పరీక్షకు హాజరవనున్నారు. ఐసెట్ రాసేందుకు గతేడాది 77,422 మంది.. ఈ సారి 62,631 మంది ఆసక్తి చూపారు. ఎంటెక్, న్యాయ విద్య, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులకూ ఆదరణ తగ్గుతోంది. అలాగే ఎంటెక్ కోసం ప్రవేశ పరీక్ష రాసే వారి సంఖ్య గతేడాదితో పోలిస్తే 12,668 తగ్గింది. అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ రాసే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గింది. గతేడాది 79,033 మంది.. ఈ సారి 73,106 మంది దరఖాస్తు చేసుకున్నారు.
బీటెక్‌పై డిప్లొమా విద్యార్థుల్లో ఆసక్తి
పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది కంటే ఈ సారి 2,788 మంది ఎక్కువగా ఈసెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఎంసెట్ ద్వారా బీటెక్‌లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న వారి కూడా సంఖ్య పెరిగింది. గతేడాది 1,41,137 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ సారి 1,47,958 మంది పరీక్ష రాయనున్నారు.
మార్పులతోనే తగ్గుదల
గతంలో డిగ్రీల కోసం ఏదో ఓ కాలేజీలో చేరడం.. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకపోవడంతోనే ఆదరణ తగ్గుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. యూనివర్సిటీలు కూడా నిబంధనలు కఠినం చేయడంతో చదువుకోవాలన్న శ్రద్ధ ఉన్న విద్యార్థులే కాలేజీల్లో చేరుతున్నారని చెబుతున్నారు. ఉన్నత విద్యలో సంస్కరణలూ సంఖ్య తగ్గడానిక మరో కారణమని పేర్కొంటున్నారు.
ఉపాధి అవకాశాలు తగ్గినందునే
ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో విద్యా ర్థుల సంఖ్య తగ్గుతోంది. విద్యార్థుల ఆలోచన ల్లోనూ మార్పొచ్చింది. అనవసరంగా ఫీజులు చెల్లించి చదువలేకపోతే ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. పైగా నాణ్యత లేకుండా చదివినా ప్రయోజనం ఉండదని, ఉపాధి లభించదని అవగాహనకొచ్చారు. అందుకే సీరియస్‌గా చదువుకోవాలనుకునే వారే వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో చేరుతు న్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు బీఎడ్ వారు అర్హులు కాదని, ఎస్‌జీటీ వారే అర్హులని ఎన్‌సీటీఈ ఉత్తర్వులు ఇవ్వడం.. బీఎడ్‌ను రెండేళ్ల కోర్సుగా మార్పు చేయడంతో నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు.
– ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment