అంతా ‘సెట్’రైట్
* పది రోజుల్లో వివిధ ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు
* ఇంటర్ బోర్డు ఏర్పాటుతో మార్గం సుగమం
* పలు ‘సెట్’ల నిర్వహణ తేదీలపై దృష్టిపెట్టిన ఉన్నత విద్యాశాఖ
* ఉన్నత విద్యా మండలి, వర్సిటీలతో ఉన్నతస్థాయి భేటీకి ఏర్పాట్లు
* 15 శాతం సీట్లకు ఓపెన్ కోటాలో ఏపీ విద్యార్థులకు అవకాశం
* తెలంగాణ సెట్స్ రాసిన వారికే మెరిట్‌ను బట్టి అడ్మిషన్లు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాటుతో తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు(సెట్స్) మార్గం సుగమమైంది. ఇంటర్ పరీక్షల వ్యవహారం ఇన్నాళ్లూ తేలకపోవడంతో ఈ నెల తొలి వారంలో ప్రకటించాల్సిన సెట్స్ నిర్వహణ తేదీలు ఖరారు కాలేదు. ప్రస్తుతం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసుకోవడంతో వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలపై ఉన్నత విద్యాశాఖ అధికారులు దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం లేకుండా తెలంగాణలో సొంతంగానే సెట్స్‌ను నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు.
మరో పది రోజుల్లో ఆయా పరీక్షల తేదీలను ఖరారు చేయనున్నట్లు సమాచారం. బీటెక్, ఎంబీబీఎస్‌లో ప్రవేశాల కోసం ఎంసెట్‌ను, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్‌ను, ఎంటెక్, ఎంఫార్మసీ కోసం పీజీఈసెట్‌ను, న్యాయ విద్యలో ప్రవేశాలకు లాసెట్‌ను, బీఎడ్‌లో చేరడానికి ఎడ్‌సెట్‌ను, డిప్లొమా విద్యార్థులు నేరుగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు(లేటరల్ ఎంట్రీ) ఈసెట్‌ను, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాల కోసం పీఈసెట్‌ను నిర్వహించేందుకు తేదీలను అధికారులు ప్రకటించనున్నారు.
త్వరలో ఉన్నతస్థాయి సమావేశం
సెట్స్ తేదీల ఖరారుపై త్వరలోనే ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించేందుకు రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో వివిధ విశ్వవిద్యాలయాల వైస్‌చాన్స్‌లర్లతో సమావేశం నిర్వహించాలని భావిస్తోంది. సెట్స్ నిర్వహణకు సంబంధించిన అంశాలపై యూనివర్సిటీ వర్గాలతో చర్చించి అధికారులు సమగ్ర నివేదిక రూపొందించనున్నారు. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో చర్చించి నిర్ణయాన్ని ప్రకటించాలని వారు భావిస్తున్నారు.
ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణలో అనుభవమున్న జేఎన్‌టీయూహెచ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయాలకు కీలక సెట్స్ బాధ్యతలను అప్పగించే అవకాశముంది. కొత్త వర్సిటీలైన పాలమూరు, తెలంగాణ, మహత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీలకు తక్కువ మంది విద్యార్థులు పోటీ పడే సెట్స్‌ను నిర్వహించే బాధ్యతలను అప్పగించాలని అధికారులు యోచిస్తున్నారు. దీనిపై ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
గత పదేళ్లుగా ఎంసెట్‌ను నిర్వహిస్తున్న హైదరాబాద్ జేఎన్‌టీయూకే ఈసారి కూడా బాధ్యతలను అప్పగించనున్నారు. ఐసెట్ నిర్వహణను కూడా దానికే అప్పగించనున్నారు. కాకతీయ వర్సిటీకి లాసెట్, ఉస్మానియాకు పీజీఈసెట్, ఎడ్‌సెట్ నిర్వహణ బాధ్యతలను అప్పగించే అవకాశముంది.
ఓపెన్ కోటాలో ఏపీ విద్యార్థులకు అవకాశం
విద్యాసంస్థల్లో సీట్ల కేటాయింపు విషయంలో విభజన చట్టం ప్రకారం నడుచుకుంటామని అధికారులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఓపెన్ కోటాలో 15 శాతం సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ విద్యార్థులు ఇకపై తెలంగాణలోని విద్యా సంస్థల్లో చేరాలంటే టీ సర్కార్ నిర్వహించే ప్రవేశ పరీక్షలను రాయాలి.
కాగా, ఎంసెట్ తుదిర్యాంకు ఖరారులో ఇంటర్ మార్కులకిచ్చే 25 శాతం వెయిటేజీ విషయంలోనూ సమస్య ఉండబోదని అధికారులు అంటున్నారు. ఓపెన్ కోటాలో తెలంగాణలోని విద్యా సంస్థల్లో చేరగోరే విద్యార్థులు ఏపీలో ఇంటర్ చదివితే అక్కడ సాధించిన ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ ర్యాంకును ఖరారు చేస్తామంటున్నారు. ఆ ర్యాంకు ఆధారంగానే ఓపెన్ కోటా ను భర్తీ చేసి ఉమ్మడి ప్రవేశాల స్పూర్తిని కొనసాగిస్తామంటున్నారు.
దీనిపై అనుమానాలుంటే జేఈఈ మెయిన్‌లో అవలంభించే పర్సంటైల్ విధానాన్ని ఇక్క డా అమలు చేస్తామని గతంలోనే టీ సర్కార్ స్పష్టం చేసింది. మరోవైపు జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ వంటి జాతీయస్థాయి పోటీపరీక్షల్లో రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుంటారు కనక ఏ రాష్ర్టం విద్యార్థులకైనా నష్టం ఉండదని అధికారులు భావిస్తున్నారు.