M Tech
-
ఎంటెక్ విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 9 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది. మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనని అభ్యర్థులు 11వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 12వ తేదీ వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొంది. ఈనెల 15న సీట్ల కేటాయింపు ఉంటుందని, 19లోగా సీట్లు వచ్చిన అభ్యర్థులు కాలేజీలో రిపోర్టింగ్ చేయాలని సూచించింది. కాగా, డిగ్రీలో ప్రవేశానికి (సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు) 9, 10 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ఒక ప్రకటనలో వెల్లడించింది. -
ఎంటెక్ చేశావా.. టీచింగ్ చేస్తావా?
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక విద్యలో మాస్టర్ డిగ్రీ (ఎంటెక్) పూర్తి చేసిన అభ్యర్థులకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. ముఖ్యంగా బీటెక్ కంప్యూటర్ సైన్స్ సహా దాని అనుబంధ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి ఉజ్వల భవిష్యత్ ఉండబోతోంది. రాష్ట్రంలో కొత్త వర్సిటీలు, సాంకేతిక కోర్సుల్లో సీట్లు పెరుగుతుండటం.. మరోవైపు కొన్నేళ్లుగా ఎంటెక్‌లో ప్రవేశాలు తగ్గుతుండటంతో ఇప్పటికే ఎంటెక్ చేసిన వారికి బోధన రంగంలో మున్ముందు డిమాండ్ పెరగనుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగంలో మరో రెండేళ్లలో వేతనాలు రెట్టింపయ్యే అవకాశముందని అంటున్నారు. కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న కొరత రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ సీట్లు గత మూడేళ్లుగా పెరుగుతున్నాయి. అదనపు సెక్షన్లు వస్తున్నాయి. దీనికి తోడు కొత్తగా ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల అనుమతిచ్చింది. ఇవి కూడా ఎక్కువగా మార్కెట్లో డిమాండ్ ఉండే కోర్సులకే ప్రాధాన్యమిస్తున్నాయి. ఇవన్నీ ఎంటెక్ అభ్యర్థులకు కలిసి వస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే కంప్యూటర్ సైన్స్ సీట్లు పెరిగినా అధ్యాపకుల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ వర్సిటీల్లోనే దాదాపు 3 వేలకుపైగా ఖాళీలున్నట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. చాలా కాలేజీలు ఇతర రాష్ట్రాల నుంచి ఫ్యాకల్టీని ఆహ్వానిస్తున్నా వేతనాలు ఎక్కువగా ఇవ్వాల్సి వస్తోందని భావిస్తున్నాయి. స్థానికంగా ఎంటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు రూ. 50 వేల లోపే వేతనాలు ఇవ్వడానికి ప్రైవేటు కాలేజీలు సిద్ధపడుతున్నాయి. ఇతర రాష్ట్రాల వాళ్లు రూ. లక్షకు పైగా డిమాండ్ చేస్తున్నారు. రెండేళ్లలో భారీగా అవసరం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీసీ) మార్గదర్శకాల ప్రకారం బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఇతర కంప్యూటర్ కోర్సులు బోధించేందుకు ప్రతి 20 మంది విద్యార్థులకు ఓ అధ్యాపకుడు ఉండాలి. రాష్ట్రంలో కన్వీనర్ కోటా కిందే దాదాపు 80 వేలకు పైగా బీటెక్ సీట్లున్నాయి. ఇందులో 75 శాతం కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ, మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి కోర్సులున్నాయి. మిగతా కోర్సుల్లో (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) సీట్లు చాలా వరకు మిగులుతున్నాయి. కంప్యూటర్ సైన్స్ కోర్సులకు బోధించడానికి 3 వేల మంది సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్లు అవసరం. ప్రస్తుతం 2 వేల మందే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో 60 మందితో సెక్షన్లు నిర్వహిస్తున్నారు. 2024–25 నాటికి పెరిగే సీట్లను బట్టి కనీసం 10 వేల మంది కంప్యూటర్ సైన్స్, కొత్త కోర్సులు బోధించే వాళ్లు కావాలి. కొత్త వర్సిటీలు వస్తే ఈ సంఖ్య మరింత పెరగనుంది. కొరత ఎందుకు? సాధారణంగా విద్యార్థులు బీటెక్ కంప్యూటర్ సైన్స్, కొత్త కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఉపాధి వైపే వెళ్తున్నారు. క్యాంపస్ రిక్రూట్మెంట్లో కొంతమంది ఎంపికవుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ప్రారంభంలోనే రూ. 40 వేల నెలసరి వేతనం పొందే వీలుంది. దీంతో ఎంటెక్ చేయాలని విద్యార్థులు ఆలోచించట్లేదు. మరికొంత మంది విదేశాల్లో ఎంఎస్ కోసం వెళ్తున్నారు. ఫలితంగా ఏటా ఎంసెట్‌లో సీట్లు భారీగా మిగులుతున్నాయి. ప్రైవేటు కాలేజీల్లో ఫ్యాకల్టీ ఎలా ఉందో.. గుర్తింపునిచ్చే వర్సిటీలూ పట్టించుకోవట్లేదు. నాణ్యమైన అధ్యాపకులు లేరని గుర్తించినా విధిలేక అఫిలియేషన్ ఇస్తున్నారు. దీంతో ప్రైవేటు కాలేజీలు అధ్యాపకులకు వేతనాలు అరకొరగా ఇస్తున్నాయనే ఆరోపణలున్నాయి. సాఫ్ట్‌వేర్‌తో సమానంగా వేతనం ఉంటే తప్ప బోధన వైపు మళ్లే అవకాశం కనిపించట్లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మున్ముందు కొరతను ఎలా అడ్డుకుంటారనేది ప్రశ్నార్థకమే. జీతాలు పెంచితే కొంత మార్పు రావొచ్చు ఓవైపు కంప్యూటర్ కోర్సులు పెరుగుతున్నాయి. మరోవైపు సంబంధిత విభాగాల్లో ఎంటెక్ చేసేవారి సంఖ్య తక్కువగా ఉంది. ఈ తేడాను పూడ్చాలి. బీటెక్‌తోనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తున్నాయి. ఎంఎస్‌కు విదేశాలకు వెళ్తున్నారు. బోధించేందుకు వారు ఎందుకు ఇష్టపడట్లేదో తెలుసుకోవాలి. ఆకర్షణీయమైన వేతనాలు ఇస్తే కొంత మార్పు రావొచ్చు. – ప్రొఫెసర్ వి వెంకటరమణ (ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్) -
ఎంటెక్ సీట్లలో భారీగా కోత
సాక్షి, హైదరాబాద్ : పీజీ ఇంజనీరింగ్‌లో (ఎంటెక్) ఈసారి భారీగా సీట్లు తగ్గిపోనున్నా యి. ఇందుకోసం పలు కాలేజీల యాజమాన్యా లు వర్సిటీలకు దరఖాస్తు చేసుకున్నాయి. ఎంటెక్ కోర్సుల నిర్వహణ సమస్యగా మారడం తో ఈ నిర్ణయానికి వచ్చాయి. వర్సిటీల నిబంధనల ప్రకారం ప్రతి ఎంటెక్ కోర్సులో 12 మంది విద్యార్థులకు ఒక పీహెడ్డీ అధ్యాపకుడు తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన ఉంది. విద్యార్థులు పెద్ద గా కాలేజీలకు రాకపోవడం, చేరే వారి సంఖ్య కూడా తగ్గిపోతుండటంతో వేతన భారం తప్పించుకునేందుకు కాలేజీలు ఎంటెక్ కోర్సులను రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నా యి. ఈ నేపథ్యంలో ఈసారి 2 వేల సీట్ల రద్దుకు యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. అలాగే అధ్యాపకులను తొలగిస్తున్నట్లు సమాచా రం పంపించడంతో వారు ఆందోళనలో పడ్డారు. ఇటీవల నగర పరిసరాల్లోని ఓ కాలేజీ యాజమాన్యం ఓ అధ్యాపకున్ని తొలగిస్తున్నట్లు ఫోన్ ద్వారా మెసేజ్ పంపించి అదే తొలగింపు ఆర్డర్ గా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో ఆయన ఆందోళనలో పడ్డారు. ఇది ఆయ న ఒక్కరి పరిస్థితే కాదు..రాష్ట్రంలోని అనేక మంది పరిస్థితి ఇదే కావడంతో ఆందోళన నెలకొంది. -
ఎంటెక్ చదివినా ఉద్యోగం రాలేదని..
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య హైదరాబాద్: ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రాలేదన్న బెంగ ఓ వైపు.. అనారోగ్యంతో బాధపడు తున్న తల్లి మరోవైపు... ఇంటి పెద్ద కొడుకుగా తానేమీ చేయలేకపోతు న్నానని మనస్తాపానికి లోనైన ఓ యువకుడు తాను ఉంటున్న అపార్టు మెంటుపై నుంచి నాలాలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చైతన్యపురి సీఐ గురురాఘవేంద్ర శుక్రవారం వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా నూతనకల్లు గ్రామానికి చెందిన ఉప్పలయ్య, కోటమ్మ దంపతుల కుమారుడు శ్రీనివాస్(23) ఎంటెక్ చదివి ఉద్యోగం కోసం నగరానికి వచ్చాడు. చైతన్యపురి గంగోత్రి అపార్టుమెంటులో స్నేహితుల తో కలసి ఉంటున్నాడు. కొంతకాలంగా ఉద్యోగం రాలేదని వేదన పడుతు న్నాడు. అతని తల్లి కోటమ్మ కేన్సర్‌తో బాధపడుతోంది. కాగా, శుక్రవారం తెల్లవారు జామున భవనం పైనుంచి ఎవరో దూకిన శబ్దం రావటంతో ఉప్పలయ్య బయటకు వచ్చి చూశాడు. అపార్టుమెంటు పక్కనున్న నాలాలో ఎవరో పడినట్టు గమనించిన ఆయన కిందికి వెళ్లి చూడగా శ్రీనివాస్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. -
ఎంటెక్, ఎం.ఫార్మసీలపై దృష్టి
నాణ్యతా ప్రమాణాల పెంపునకు సర్కారు చర్యలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎంటెక్, ఎం ఫార్మసీ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రమాణాలు, అర్హులైన అధ్యాపకులు లేకుండా కాలేజీలను నడుపుతున్న తీరును నియంత్రించేందుకు చర్యలు చేపట్టనుంది. అందులో భాగంగా విద్యార్థులు, ఫ్యాకల్టీకి బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచి స్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 137 ఇంజనీరింగ్ కాలేజీలు ఎంటెక్ కోర్సును అందిస్తున్నాయి. వాటికోసం ప్రత్యేకంగా కాలేజీలు లేకపోయినా బీటెక్ కోర్సులను నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కాలేజీల్లోనే ఎంటెక్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. అయితే ఆయా కాలేజీల్లో ఎంటెక్ విద్యార్థులకు బోధించే అర్హులైన అధ్యాపకులు లేరని, బోధనే సరిగా జరగడం లేదని జేఎన్టీయూహెచ్, ఉన్నత విద్యాశాఖ గుర్తించాయి. నిబంధనల ప్రకారం.. ఎంటెక్ కోర్సు కొనసాగించాలంటే ప్రతి ఆరుగురు విద్యార్థులకు ఒక పీహెచ్డీ ప్రొఫెసర్, ఒక ఎంటెక్ చేసి సీనియారిటీ కలిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండాలి. కానీ చాలా కాలేజీల్లో పీహెచ్డీ చేసిన ప్రొఫెసర్లు లేరన్న విషయం విద్యాశాఖ దృష్టికి వచ్చింది. సరైన మౌలిక వసతులు, ల్యాబ్‌లు, లైబ్రరీలు, ఇతర పరికరాలు కూడా అవసరమైన మేరకు లేవని గుర్తించింది. ఎంఫార్మసీ కాలేజీల్లోనూ ఇదే తరహా పరిస్థితి ఉందని నిర్ధారించింది. బయోమెట్రిక్ తో అక్రమాలకు చెక్ ఆధార్ నంబర్, బయోమెట్రిక్ ఆధారంగా ప్రవేశాలు చేపట్టడం.. విద్యార్థులు, అధ్యాపకులకు బయోమెట్రిక్ హాజరు ప్రవేశపెట్టడం ద్వారా అక్రమాలకు చెక్ పెట్టవచ్చని విద్యాశాఖ భావిస్తోంది. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ దుర్వినియోగం కాకుండా చర్యలు చేపట్టాలని యోచిస్తోంది. -
'కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంటెక్ విద్యార్థులు'
సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంబీఏ, ఎంటెక్, ఎంఫార్మసీ విద్య అభ్యసించిన వారి నుంచి కూడా దరఖాస్తులు వస్తున్నాయని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ)లో శుక్రవారం జరిగిన ‘అకాడమీ భవిష్యత్ ప్రణాళిక’ అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీని బృహత్ ప్రణాళికగా చేపట్టినట్లు పేర్కొన్నారు. మూడు విడతలుగా నిర్వహిస్తున్న ఈ పరీక్షలు తెలివైన అభ్యర్థులు వస్తారని ఆశిస్తున్నామన్నా రు. అందుకే కానిస్టేబుల్‌గా ఎన్నికైన ప్రతి ఒక్కరికి మొదటి రోజే ఒక కంప్యూటర్ ట్యాబ్లెట్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఎఫ్ఐఆర్ నుంచి కేసు దర్యాప్తు ముగిసే వరకు అన్ని కంప్యూటర్లో నిక్షిప్తమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 10వేల మందికి శిక్షణ ఇచ్చేలా పోలీస్ అకాడమీ ప్రణాళిక రచించుకోవాలని అధికారులకు సూచించారు. మాజీ డీజీపీలు హెచ్‌జే దొర, కె.వి.కృష్ణారావు, మాజీ ఐపీఎస్‌లు గోపీనాథ్‌రెడ్డి, ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అకాడమీ స్థాపించిన 1986 నుంచి నేటి వరకు జరిగిన అనేక శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను అధికారులు సందర్శించారు. అనంతరం పోలీస్ అకాడమీ నూతన సంవత్సర కేలండర్‌ను డీజీపీ అనురాగ్‌శర్మ ఆవిష్కరించారు. -
అంతా ‘సెట్’రైట్
* పది రోజుల్లో వివిధ ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు * ఇంటర్ బోర్డు ఏర్పాటుతో మార్గం సుగమం * పలు ‘సెట్’ల నిర్వహణ తేదీలపై దృష్టిపెట్టిన ఉన్నత విద్యాశాఖ * ఉన్నత విద్యా మండలి, వర్సిటీలతో ఉన్నతస్థాయి భేటీకి ఏర్పాట్లు * 15 శాతం సీట్లకు ఓపెన్ కోటాలో ఏపీ విద్యార్థులకు అవకాశం * తెలంగాణ సెట్స్ రాసిన వారికే మెరిట్‌ను బట్టి అడ్మిషన్లు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాటుతో తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు(సెట్స్) మార్గం సుగమమైంది. ఇంటర్ పరీక్షల వ్యవహారం ఇన్నాళ్లూ తేలకపోవడంతో ఈ నెల తొలి వారంలో ప్రకటించాల్సిన సెట్స్ నిర్వహణ తేదీలు ఖరారు కాలేదు. ప్రస్తుతం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసుకోవడంతో వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలపై ఉన్నత విద్యాశాఖ అధికారులు దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం లేకుండా తెలంగాణలో సొంతంగానే సెట్స్‌ను నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. మరో పది రోజుల్లో ఆయా పరీక్షల తేదీలను ఖరారు చేయనున్నట్లు సమాచారం. బీటెక్, ఎంబీబీఎస్‌లో ప్రవేశాల కోసం ఎంసెట్‌ను, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్‌ను, ఎంటెక్, ఎంఫార్మసీ కోసం పీజీఈసెట్‌ను, న్యాయ విద్యలో ప్రవేశాలకు లాసెట్‌ను, బీఎడ్‌లో చేరడానికి ఎడ్‌సెట్‌ను, డిప్లొమా విద్యార్థులు నేరుగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు(లేటరల్ ఎంట్రీ) ఈసెట్‌ను, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాల కోసం పీఈసెట్‌ను నిర్వహించేందుకు తేదీలను అధికారులు ప్రకటించనున్నారు. త్వరలో ఉన్నతస్థాయి సమావేశం సెట్స్ తేదీల ఖరారుపై త్వరలోనే ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించేందుకు రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో వివిధ విశ్వవిద్యాలయాల వైస్‌చాన్స్‌లర్లతో సమావేశం నిర్వహించాలని భావిస్తోంది. సెట్స్ నిర్వహణకు సంబంధించిన అంశాలపై యూనివర్సిటీ వర్గాలతో చర్చించి అధికారులు సమగ్ర నివేదిక రూపొందించనున్నారు. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో చర్చించి నిర్ణయాన్ని ప్రకటించాలని వారు భావిస్తున్నారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణలో అనుభవమున్న జేఎన్టీయూహెచ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయాలకు కీలక సెట్స్ బాధ్యతలను అప్పగించే అవకాశముంది. కొత్త వర్సిటీలైన పాలమూరు, తెలంగాణ, మహత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీలకు తక్కువ మంది విద్యార్థులు పోటీ పడే సెట్స్‌ను నిర్వహించే బాధ్యతలను అప్పగించాలని అధికారులు యోచిస్తున్నారు. దీనిపై ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. గత పదేళ్లుగా ఎంసెట్‌ను నిర్వహిస్తున్న హైదరాబాద్ జేఎన్టీయూకే ఈసారి కూడా బాధ్యతలను అప్పగించనున్నారు. ఐసెట్ నిర్వహణను కూడా దానికే అప్పగించనున్నారు. కాకతీయ వర్సిటీకి లాసెట్, ఉస్మానియాకు పీజీఈసెట్, ఎడ్‌సెట్ నిర్వహణ బాధ్యతలను అప్పగించే అవకాశముంది. ఓపెన్ కోటాలో ఏపీ విద్యార్థులకు అవకాశం విద్యాసంస్థల్లో సీట్ల కేటాయింపు విషయంలో విభజన చట్టం ప్రకారం నడుచుకుంటామని అధికారులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఓపెన్ కోటాలో 15 శాతం సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ విద్యార్థులు ఇకపై తెలంగాణలోని విద్యా సంస్థల్లో చేరాలంటే టీ సర్కార్ నిర్వహించే ప్రవేశ పరీక్షలను రాయాలి. కాగా, ఎంసెట్ తుదిర్యాంకు ఖరారులో ఇంటర్ మార్కులకిచ్చే 25 శాతం వెయిటేజీ విషయంలోనూ సమస్య ఉండబోదని అధికారులు అంటున్నారు. ఓపెన్ కోటాలో తెలంగాణలోని విద్యా సంస్థల్లో చేరగోరే విద్యార్థులు ఏపీలో ఇంటర్ చదివితే అక్కడ సాధించిన ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ ర్యాంకును ఖరారు చేస్తామంటున్నారు. ఆ ర్యాంకు ఆధారంగానే ఓపెన్ కోటా ను భర్తీ చేసి ఉమ్మడి ప్రవేశాల స్పూర్తిని కొనసాగిస్తామంటున్నారు. దీనిపై అనుమానాలుంటే జేఈఈ మెయిన్‌లో అవలంభించే పర్సంటైల్ విధానాన్ని ఇక్క డా అమలు చేస్తామని గతంలోనే టీ సర్కార్ స్పష్టం చేసింది. మరోవైపు జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ వంటి జాతీయస్థాయి పోటీపరీక్షల్లో రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుంటారు కనక ఏ రాష్ర్టం విద్యార్థులకైనా నష్టం ఉండదని అధికారులు భావిస్తున్నారు.