ఎంటెక్, ఎం.ఫార్మసీలపై దృష్టి
నాణ్యతా ప్రమాణాల పెంపునకు సర్కారు చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎంటెక్, ఎం ఫార్మసీ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రమాణాలు, అర్హులైన అధ్యాపకులు లేకుండా కాలేజీలను నడుపుతున్న తీరును నియంత్రించేందుకు చర్యలు చేపట్టనుంది. అందులో భాగంగా విద్యార్థులు, ఫ్యాకల్టీకి బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచి స్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 137 ఇంజనీరింగ్ కాలేజీలు ఎంటెక్ కోర్సును అందిస్తున్నాయి. వాటికోసం ప్రత్యేకంగా కాలేజీలు లేకపోయినా బీటెక్ కోర్సులను నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కాలేజీల్లోనే ఎంటెక్ కోర్సులను నిర్వహిస్తున్నాయి.
అయితే ఆయా కాలేజీల్లో ఎంటెక్ విద్యార్థులకు బోధించే అర్హులైన అధ్యాపకులు లేరని, బోధనే సరిగా జరగడం లేదని జేఎన్టీయూహెచ్, ఉన్నత విద్యాశాఖ గుర్తించాయి. నిబంధనల ప్రకారం.. ఎంటెక్ కోర్సు కొనసాగించాలంటే ప్రతి ఆరుగురు విద్యార్థులకు ఒక పీహెచ్‌డీ ప్రొఫెసర్, ఒక ఎంటెక్ చేసి సీనియారిటీ కలిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండాలి. కానీ చాలా కాలేజీల్లో పీహెచ్‌డీ చేసిన ప్రొఫెసర్లు లేరన్న విషయం విద్యాశాఖ దృష్టికి వచ్చింది. సరైన మౌలిక వసతులు, ల్యాబ్‌లు, లైబ్రరీలు, ఇతర పరికరాలు కూడా అవసరమైన మేరకు లేవని గుర్తించింది. ఎంఫార్మసీ కాలేజీల్లోనూ ఇదే తరహా పరిస్థితి ఉందని నిర్ధారించింది.
బయోమెట్రిక్ తో అక్రమాలకు చెక్
ఆధార్ నంబర్, బయోమెట్రిక్ ఆధారంగా ప్రవేశాలు చేపట్టడం.. విద్యార్థులు, అధ్యాపకులకు బయోమెట్రిక్ హాజరు ప్రవేశపెట్టడం ద్వారా అక్రమాలకు చెక్ పెట్టవచ్చని విద్యాశాఖ భావిస్తోంది. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ దుర్వినియోగం కాకుండా చర్యలు చేపట్టాలని యోచిస్తోంది.