'కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంటెక్ విద్యార్థులు'
సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంబీఏ, ఎంటెక్, ఎంఫార్మసీ విద్య అభ్యసించిన వారి నుంచి కూడా దరఖాస్తులు వస్తున్నాయని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ (టీఎస్‌పీఏ)లో శుక్రవారం జరిగిన ‘అకాడమీ భవిష్యత్ ప్రణాళిక’ అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీని బృహత్ ప్రణాళికగా చేపట్టినట్లు పేర్కొన్నారు.
మూడు విడతలుగా నిర్వహిస్తున్న ఈ పరీక్షలు తెలివైన అభ్యర్థులు వస్తారని ఆశిస్తున్నామన్నా రు. అందుకే కానిస్టేబుల్‌గా ఎన్నికైన ప్రతి ఒక్కరికి మొదటి రోజే ఒక కంప్యూటర్ ట్యాబ్లెట్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఎఫ్‌ఐఆర్ నుంచి కేసు దర్యాప్తు ముగిసే వరకు అన్ని కంప్యూటర్‌లో నిక్షిప్తమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 10వేల మందికి శిక్షణ ఇచ్చేలా పోలీస్ అకాడమీ ప్రణాళిక రచించుకోవాలని అధికారులకు సూచించారు.
మాజీ డీజీపీలు హెచ్‌జే దొర, కె.వి.కృష్ణారావు, మాజీ ఐపీఎస్‌లు గోపీనాథ్‌రెడ్డి, ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అకాడమీ స్థాపించిన 1986 నుంచి నేటి వరకు జరిగిన అనేక శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను అధికారులు సందర్శించారు. అనంతరం పోలీస్ అకాడమీ నూతన సంవత్సర కేలండర్‌ను డీజీపీ అనురాగ్‌శర్మ ఆవిష్కరించారు.