సెట్‌ల కాలం
సాక్షి, నల్లగొండ, టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు ముగిశాయి. మరోవైపు ప్రభుత్వం వివిధ ‘సెట్’లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంసెట్, ఐసెట్, ఈసెట్, డైట్‌సెట్, ఎడ్‌సెట్,లాసెట్, పీజీఈ సెట్, పీఈ సెట్, పాలిసెట్ నిర్వహించేందుకు ముందుకొచ్చింది. దీంతో విద్యార్థులు ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌లపై దృష్టిసారించారు. ఎంట్రెన్స్‌లలో మంచి మార్కులు స్కోర్ చేయడానికి పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. వివిధ సెట్‌లను ఒకసారి పరిశీలిస్తే..
- ఉన్నత విద్యాభ్యాసానికి వరుస ‘ఎంట్రెన్స్’లు
- సమాయత్తమవుతున్న విద్యార్థులు
- కోచింగ్ సెంటర్‌లవైపు పరుగులు
కోచింగ్ సెంటర్లు ప్రారంభం
జిల్లాలో నల్లగొండ పట్టణంతో పాటు సూర్యాపేట, మిర్యాలగూడ, కోదాడ, భువనగిరి పట్టణాల్లో కోచింగ్ సెంటర్లు వెలిశాయి. ఈ సెంటర్లు విద్యార్థులతో సందడిగా మారాయి. విద్యార్థులు సైతం మంచి ర్యాంకు సాధించాలన్న తలంపుతో కృషి చేస్తున్నారు.
ఐసెట్
ఈ ప్రవేశ పరీక్ష రాసిన అభ్యర్థులు ఎంబీఏ, ఎంసీఏలలో అడ్మిషన్ పొందవచ్చు. రెండేళ్ల వ్యవధి కలిగిన ఈ కోర్సు చేయడానికి అనేకమంది ఆసక్తి చూపుతున్నారు. రెగ్యులర్‌గా తరగతులకు వెళ్లి విద్యన భ్యసిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని విద్యావేత్తలంటున్నారు. ఈ పరీక్షను కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఈ నెల 23న పరీక్ష నిర్వహించనుంది. జూన్ 9న ఫలితాలు వెల్లడించనుంది.
లాసెట్..
న్యాయవాద వృత్తిలో ఆసక్తి ఉన్నవారు రాసే ఈ ప్రవేశ పరీక్షను ఎస్వీ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎల్‌ఎల్‌బీ మూడు లేదా ఐదేళ్ల కోర్సులో ప్రవేశం పొందవచ్చు. దీనికి సంబంధించిన ప్రకటన మార్చి 4న వెలువడింది. జూన్ 8న పరీక్ష ఉంటుంది. జూన్ 19న ఫలితాలు వెల్లడిస్తారు.
పీఈసెట్
ఇది వ్యాయామ విద్యకు సంబంధించింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రెండు సంవత్సరాల వ్యవధి గల బీపీఈడీ/యూజీడీపీఈడీ కోర్సు చేయవచ్చు. దీనికి సంబంధించిన ప్రకటన మార్చి 7న వెలువడింది. ఈ నెల 5న పరీక్ష ఉంటుంది. ఫలితాలు వెల్లడించే తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. పరీక్షను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహిస్తోంది.
పీజీఈ సెట్
ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ అర్హత సాధించడం ద్వారా రెండేళ్ల వ్యవధి గల ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎం.అగ్రికల్చరల్ కోర్సుల్లో చేరే అవకాశముంది. పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ(యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్) నిర్వహిస్తోంది. పరీక్ష ప్రకటనను ఫిబ్రవరి 28న వెల్లడించింది. ఈనెల 26న పరీక్ష ఉంటుంది. జూన్ 17న ఫలితాలు విడుదల చేస్తారు.
ఎడ్‌సెట్
ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడడానికి మొదటి స్టెప్‌గా ఉండే ఈ కోర్సు వ్యవధి ఏడాది. దీనిని ఈ సంవత్సరం ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి మార్చి 5న ప్రకటన వచ్చింది. మే 30న పరీక్ష నిర్వహిస్తారు. జూన్ 23న ఫలితాలు వెల్లడించనున్నారు.
ఎంసెట్
ఈ ఎంట్రెన్స్ రాసి ర్యాంకు సాధించిన వారు ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ విభాగ కోర్సులు చేయడానికి అర్హులు. ఈ పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదే శ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పక్షాన నిర్వహించనుంది. ఫిబ్రవరి 10న ప్రకటన వచ్చింది. మే 17న పరీక్ష నిర్వహిస్తారు. జూన్2న పరీక్ష ఫలితాలు వెల్లడించనున్నారు.
ఈసెట్
ఈ పరీక్ష రాయడానికి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు, బీఎస్సీ(మ్యాథ్స్) చేసినవారు అర్హులు. పరీక్షను జేఎన్‌టీయూ(కాకినాడ) నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన ఫిబ్రవరి 4న వెలువడింది. ఈ నెల 10న పరీక్ష ఉంటుంది. ఇదే నెల 19న ఫలితాలు వెల్లడించనున్నారు.
పాలీసెట్
ఈ ప్రవేశ పరీక్ష ద్వారా మూడు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్/టెక్నాలజీ చేయవచ్చు. కోర్సు పూర్తి చేసి ఈసెట్ అర్హత సాధిస్తే ఇంజినీరింగ్ సెకండియర్‌లో ప్రవేశం పొందవచ్చు. ఈ పరీక్షను స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ ఏపీ నిర్వహించనుంది. దీనికి సంబంధించి ఏప్రిల్ 6న ప్రకటన చేయగా, ఈనెల 21న పరీక్ష ఉంటుంది. ఫలితాలు జూన్ 6న వెల్లడించనున్నారు.