సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చాలా ఇంజనీరింగ్ కాలేజీలు సంప్రదాయ కోర్సుల్లో సీట్లు తగ్గించుకొని డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు ప్రవేశపెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే సరైన నాణ్యతా ప్రమాణాల్లేకుండానే డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్ల పెంపునకు దరఖాస్తు చేసుకున్నట్లు జేఎన్టీయూహెచ్ తాజా పరిశీలనలో వెల్లడైంది.
పదేళ్ల నాటి కంప్యూటర్లు...
జేఎన్‌టీయూహెచ్ పరిధిలో 145 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వాటిల్లో దాదాపు 50 కాలేజీల్లో అన్ని సదుపాయాలున్నాయని అధికారులు చెబుతున్నారు. మిగిలిన కాలేజీలు సమర్పించిన సదుపాయాలకు సంబంధించిన వివరాలను పరిశీలించగా కంప్యూటర్ సైన్స్ కోర్సు బోధనకు కనీసం 10 మంది విద్యార్థులకు ఒక అత్యాధునిక కంప్యూటర్ ఉండాల్సి ఉండగా సెక్షన్ మొత్తానికి రెండు కంప్యూటర్లు కూడా లేవని తేలింది.
అవి కూడా అతితక్కువ ప్రమాణాలతో ఉన్నాయని, సరికొత్త టెక్నాలజీ బోధించేందుకు ఏమాత్రం పనికి రావని అధికారులు గుర్తించారు. పదేళ్ల నాటి కాన్ఫిగరేషన్‌తో వాడే కంప్యూటర్లు కూడా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కంప్యూటర్ సైన్స్, డేటా అనాలసిస్, సైబర్ సెక్యూరిటీకి వాడే అత్యాధునిక సాఫ్ట్‌వేర్ రన్ కావడానికి ఉపకరించే ఆధునిక కంప్యూటర్ల స్థానంలో నాసిరకం వాటితోనే కాలేజీలు బోధన సాగిస్తున్నట్లు తేలింది.
ఇక అధ్యాపకుల విషయానికొస్తే కంప్యూటర్ సైన్స్ వచ్చిన కొత్తలో ఉన్న వారే ఇప్పుడూ బోధకులుగా ఉన్నారు. వారు నైపణ్యాలను మెరుగుపరుచుకున్నట్లు ఎలాంటి ఆధారాలను యాజమాన్యాలు చూపలేదని తెలిసింది. ప్రతిరోజూ మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలంటే ప్రముఖ కంపెనీల్లో అధ్యాపకులు శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఈ దిశగా ఎలాంటి కసరత్తు జరగలేదు.
అన్ని సౌకర్యాలు, ఫ్యాకల్టీ ఉంటేనే గుర్తింపు..
ఈ నెల 18 నుంచి కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియను మొదలుపెడతాం. ప్రతి కాలేజీని పూర్తిస్థాయిలో పరిశీలిస్తాం. నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు, ఫ్యాకల్టీ ఉంటేనే కాలేజీలకు గుర్తింపు ఇస్తాం. కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచాలని ఎక్కువ కాలేజీలే కోరుతున్నాయి. వాటి సామర్థ్యం, బోధన విధానాలను లోతుగా పరిశీలించే ఉద్దేశంతోనే ఈసారి అఫిలియేషన్ ప్రక్రియను ముందే చేపడుతున్నాం.
– ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ
78 కాలేజీల డొల్లతనం..
ఈసారి దాదాపు వంద ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు సీట్ల మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా సివిల్‌లో 40 శాతం, మెకానికల్‌లో 35 శాతం, ఎలక్ట్రికల్‌లో 34 శాతం సీట్లు మాత్రమే భర్తీ కావడంతో ఈసారి ఆయా బ్రాంచీల్లో సెక్షన్లు, సీట్లు తగ్గించుకుంటామని కోరాయి. వాటి స్థానంలో సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సుల్లో సీట్లు పెంచాలని విజ్ఞప్తి చేశాయి.
అయితే ఆయా కాలేజీలు సమర్పించిన వివరాలను జేఎన్టీయూహెచ్ అధికారులు పరిశీలించగా ఎన్నో లోపాలు బయటపడ్డాయి. కంప్యూటర్ కోర్సులు కోరుతున్న వంద కాలేజీలకుగాను 78 కాలేజీల్లో అత్యాధునిక కంప్యూటర్లు లేవని, కంప్యూటర్ లాంగ్వేజ్‌పై పట్టున్న ఫ్యాకల్టీ లేదని తేలింది.
Comments
Please login to add a commentAdd a comment